చిత్తూరు అర్బన్: చిత్తూరులో విద్యుత్‌శాఖ (ట్రాన్స్‌కో) అధికారుల తీరుపై సామాన్యులు దుమ్మెత్తిపోస్తున్నారు. విద్యుత్ బిల్లులను చెల్లించడానికి వెళుతున్న ప్రజల నుంచి అధికారులు, సిబ్బంది డబ్బులు కట్టించుకోకపోవడమే ఇందుకు కారణం. ఇప్పటికే ఓవైపు కేంద్ర ప్రభుత్వం యూపీఐ చెల్లింపులు ఉచితం కాదని.. వీటికి రుసుములు వసూలు చేసుకునే హక్కు ఆయా సంస్థలకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో యూపీఐ లావాదేవీల ద్వారా మాత్రమే విద్యుత్ బిల్లులు చెల్లించాలని.. నగదు చెల్లింపులు తీసుకోమంటూ చిత్తూరులోని పలు విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాల వద్ద అధికారులు బోర్డులు ఏర్పాటుచేశారు. బిల్లులు చెల్లించడానికి వెళుతున్న ప్రజల నుంచి డబ్బులు తీసుకోవడంలేదు. కొందరైతే తమ వద్ద స్మార్ట్‌ఫోన్ లేదని, కీ–ప్యాడ్ ఫోన్ ఉందని.. ఎందుకు డబ్బులు కట్టించుకోరంటూ సిబ్బందిని నిలదీస్తున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాము నగదు తీసుకోవడంలేదని సిబ్బంది చెబుతుండడంతో.. బిల్లుల వసూలు కేంద్రాల వద్ద వాగ్వాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందరూ యూపీఐ చెల్లింపులే చేస్తే, రానున్న రోజుల్లో విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు మూతబడి.. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది ఉద్యోగాలు దొరక్క రోడ్డున పడడం ఖాయంగా కనిపిస్తోంది. డిజిటలైజేషన్ ప్రక్రియ పేరిట అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు.. సామాన్యులను ఇబ్బందుల పాలుచేస్తున్నాయి. విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రతీ ఒక్కరి వద్ద స్మార్ట్ ఫోన్లు, యూపీఐ చెల్లింపులు ఉండవనే వాస్తవాన్ని అధికారులు గ్రహించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మాన్యువల్‌గా సైతం నగదుతో విద్యుత్ బిల్లులు చెల్లింపులు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


