నాటుకుంటున్న నేర సామ్రాజ్యం! | - | Sakshi
Sakshi News home page

నాటుకుంటున్న నేర సామ్రాజ్యం!

Aug 10 2026 1:40 AM | Updated on Aug 10 2026 1:40 AM

జిల్లాలో చాపకింద నీరుగా నాటు తుపాకులు సొంతంగా బాంబులు చుడుతూ.. దోపిడీలకు పాల్పడుతున్న దుండగులు ఇప్పటికే రెండు ప్రాంతాల్లో వెలుగు చూసిన వైనం ప్రశ్నార్థకంగా పోలీసుల నిఘా

చిత్తూరు అర్బన్‌: జిల్లాలో నేర సామ్రాజ్యం విస్తరిస్తోంది. నాటు తుపాకుల మోత మోగుతోంది. సొంతంగా నాటు బాంబులు తయారు చేస్తూ దోపిడీలు, దొంగతనాలకు పాల్పడుతున్నారు. మనుషులను సైతం చంపేస్తున్నారు. దీన్ని ఆదిలోనే తుంచేయకపోతే పోలీసులకు కొరకరానికొయ్యగా మారడం ఖాయం.

చిల్లర కొట్టులో దొరికినట్టు

జిల్లాలో చిత్తూరు దాటుకున్న తరువాత బంగారుపాళ్యం, మొగిలి, పలమనేరు, పెద్దపంజాణి నుంచి కుప్పం వరకు దట్టమైన అటవీ ప్రాంతం ఉన్న విషయం తెలిసిందే. అందులోనూ వేల హెక్టార్లలో కౌండిన్య అడవులు ఉండడంతో ఇక్కడి వన్యప్రాణులను వేటాడడానికి నాటు తుపాకులు విరివిగా ఉపయోగిస్తున్నారు. సొంతంగా తయారు చేసుకునేవాళ్లు కొందరైతే, ఉత్తరాధి ప్రాంతాల నుంచి తక్కువ ధరకు రహస్యంగా తెప్పించుకుంటున్న వాళ్లు మరికొందరు. ఎటుచేరి ఈ నాటు తుపాకులు అడవి జంతువులతో పాటు మనుషుల ప్రాణాలు కూడా తీస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. గత వారం పెద్దపంజాణి మండలం, మారెప్పపల్లెలో మేకల శ్రీనివాసులు నాటు తుపాకీతో కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో నిందితుడిని గుర్తించిన పోలీసులు, అరెస్టు చేయడానికి చర్యలు చేపట్టారు. పోలీసులు నిందితుడిని కూడా అరెస్ట్‌ చేశారు.

బాంబుల మోత

చిత్తూరులో మూడు రోజుల క్రితం ఓ ఇంటి కాపలాదారుడిని హత్య చేసిన ముఠా.. నాటు బాంబు విసిరి, ఇంటి కిటికీలు ధ్వంసంచేసి దోపిడీకి ప్రయత్నించింది. ఈ ఘటన స్థానికులను భయ భ్రాంతులకు గురిచేస్తోంది. చోరీలు, దోపిడీలకు వస్తున్న ముఠాలు మనుషుల ప్రాణాలను ఏ మాత్రం లెక్కపెట్టకుండా నాటు బాంబులు విసురుతున్నారంటే.. అది వాళ్ల ధైర్యమా..? పోలీసుల నిఘా వైఫల్యమా..? అర్థం కావడం లేదు. ప్రశాంతతకు మారుపేరైన చిత్తూరు జిల్లాలో నాటు తుపాకులు, నాటు బాంబుల వాడకం క్రమంగా పెరుగు తుండడం నేర సామ్రాజ్యాన్ని విస్తరించడంగా భావించాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.

పెద్దపంజాణిలో హత్యకు

ఉపయోగించిన నాటు తుపాకీ

చిత్తూరులో నాటు బాంబు వేయడంతో ధ్వంసమైన ఇల్లు

నిఘా ఏమైనట్టు?

పల్లెల్లో ఎవరెవరి వద్ద నాటు తుపాకులు ఉన్నాయనే విషయం తెలుసుకోవాలంటే అది పెద్ద పనేమీ కాదు. ఊర్లో చిన్న పిల్లాడిని అడిగినా చెప్పేస్తాడు. కానీ స్పెషల్‌ బ్రాంచ్‌, ఇంటలిజెన్స్‌, ఆయా స్టేషన్‌లో ఉద్యోగాలు చేసే పోలీసులకు మాత్రం నాటు తుపాకులు ఎవరి వద్ద ఉన్నాయి? బాంబులు ఎవరు చుడుతున్నారు..? అనే సమాచారం లేకపోవడం నమ్మశక్యంగా లేదు. లేకుంటే ఆయా నిఘా సంస్థలు సరిగా పనిచేయడంలేదనే చెప్పాలి. నేరం జరిగిన తరువాత తీరిగ్గా మాత్రం పోలీసులు వచ్చి దర్యాప్తు కొనసాగిస్తున్నామంటూ చెబుతున్నారు. జిల్లా పోలీసు బాసు కల్పించుకుని ప్రత్యేక డ్రైవ్‌ లాంటివి నిర్వహిస్తే తప్ప, ఈ నాటు విష సంస్కృతికి తెరపడేలా కనిపించడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement