రూ.20 వేలు లంచం ఇస్తేనే
పొజిషన్ సర్టిఫికెట్
అదీ ఓ వీఆర్వోని కలిసిన తర్వాతే
తహసీల్దార్ కార్యాలయం లాగిన్‌లు ప్రైవేట్ వ్యక్తి చేతికి
ఆ వీఆర్‌ఓ సహకారంతో బయట నుంచి పనులు
గుడిపాల తహసీల్దార్ కార్యాలయంలో ఇదీ పరిస్థితి
గుడిపాల : గుడిపాల మండల తహసీల్దార్ కార్యాలయం అవినీతికి అడ్డాగా మారింది. ఇంటిపై లోన్ తీసుకునేందుకు పొజెషన్ సర్టిఫికెట్ కావాలంటే ఏకంగా రూ.20 వేలు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఈ తతంగం అంతా ఓ వీఆర్వో కనుసన్నల్లోనే సాగుతున్నట్టు స్పష్టమవుతోంది. మండలంలోని పాపసముద్రం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఆ వీర్‌ఓకు రూ.20 వేలు లంచం ఇచ్చి మరీ పొజెషన్ సర్టిఫికెట్ తీసుకున్నట్టు సమాచారం. ఇలా మండలంలో వందలాది మంది బ్యాంక్ రుణం తీసుకునేందుకు లంచాలు ఇచ్చి పొజెషన్ సర్టిఫికెట్లు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
ఆ లాగిన్‌లన్నీ ప్రైవేట్ వ్యక్తికి
గుడిపాల మండలంలో వీఆర్‌ఓలు, ఆర్‌ఐలు, తహసీల్దార్‌కు సంబంధించిన లాగిన్‌లన్నీ ఓ ప్రైవేట్ వ్యక్తి చేతికి అందినట్టు స్థానికంగా చర్చించుకుంటున్నారు. వీటన్నింటికీ సూత్రధారి, పాత్రధారి ఆ వీఆర్‌ఓనే. ఆ వీఆర్‌ఓ ఏం చెబితే అందుకు తహసీల్దార్ తలూపాల్సిందే. అందుకు తహసీల్దార్ ఒక్కో ఫైల్‌కు ఒక్కో రేటు నిర్ణయించి వసూలు చేస్తున్నట్టు సమాచారం.
తహసీల్దార్ ఖర్చు రోజుకు రూ.3 వేలు
స్థానిక తహసీల్దార్‌కు రోజుకు ఖర్చు రూ.3 వేలు అవుతుందని.. ఆ వీఆర్‌ఓ మిగతా వీఆర్‌ఓలకు బాహాటంగా చెబుతున్నాడు. రోజూ తిరుపతి నుంచి కారులో తహసీల్దార్ వస్తున్నాడని, ఖర్చు రూ.3 వేలుదాకా అవుతోందని, అందుకు అనుగుణంగా మీరు కుడా వసూళ్లు చేయాలని చెబుతున్నట్టు సమాచారం. కొత్త పాస్ పుస్తకాలు, మ్యుటేషన్స్, పాస్ పుస్తకాల్లో సర్వే నంబర్లు చేర్చడం వంటి వాటికి రేటును అధనంగా పెంచుకోవాలని మిగతా వీఆర్‌ఓలకు కూడా సూచిస్తున్నట్టు చర్చ సాగుతోంది. మీకు ఏమైనా ఇబ్బంది అనిపిస్తే తనకు చెప్పాలని ఆయన బాహాటంగానే చెబుతున్నట్టు సమాచారం.
రీసర్వే గ్రామాల రైతులకు చుక్కలు
గుడిపాల మండలంలో రీసర్వే చేస్తున్న రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. కొంతమంది రైతులకు అనువంశికంగా వస్తున్న భూములకు సంబంధించి పంటలు చేసుకుంటున్నా ఎటువంటి రికార్డులు మాత్రం లేవు. అటువంటి వాటిని గమనించి వేలాది రూపాయలు రైతుల వద్ద నుంచి గుంజుకుంటున్నారు. ఓ రైతు తనవద్ద ఎటువంటి డాక్యుమెంట్లు లేవని, భూమి మాత్రం తనదేనని చెప్పడంతో ఆ రైతును మాయ చేసి అతని వద్ద నుంచి రూ.30వేలు వసూలు చేసినట్టు స్థానికంగా చర్చసాగుతోంది. రికార్డులు మొత్తం తామే చూసుకుంటామని తహసీల్దార్ కార్యాలయానికి రూ.20 వేలు, ఆర్‌డీఓ కార్యాలయాలనికి రూ.5 వేలు, జేసీ కార్యాలయంలో పనిచేస్తున్న వారికి రూ.5 వేలు చొప్పున రూ.30 వేలు వసూలు చేస్తున్నట్టు బాధితులు చెబుతున్నారు. ఈ వ్యవహారాన్ని మొత్తం ఓ ప్రైవేట్ వ్యక్తి ద్వారా తహసీల్దార్ కార్యాలయం లాగిన్‌లో పంచాయతీల వారీగా చూస్తూ సంబంధిత వీఆర్వో సెటిల్‌మెంట్‌లు చేస్తున్నట్టు సమాచారం.
తహసీల్దార్ డ్రైవర్ ఆ వీఆర్‌ఓనే
గుడిపాల తహసీల్దార్ డ్రైవర్‌గా ఆ వీఆర్‌ఓ వ్యవహరిస్తూ కార్యకలాపాలన్నీ చూస్తున్నట్టు తెలుస్తోంది. తానే తహసీల్దార్ డ్రైవర్‌గా ఉన్నానని.. ఏది ఏమైననా తానే కార్యకలాపాలన్నీ చూసుకుంటూ ఉంటానని చెబుతున్నట్టు తెలుస్తోంది.


