సాక్షి టాస్క్‌పోర్స్: డీఎస్సీలో అక్రమాలపై సీబీఐ విచారణ, తప్పులకు నైతిక బాధ్యతగా విద్యాశాఖా మంత్రి నారా లోకేష్ రాజీనామా, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విడుదల కోరుతూ బాధితులతో కలిసి వైఎస్‌ఆర్‌సీపీ నిరసనలకు దిగడం తెలిసిందే. ఇప్పటికే కుప్పంలో మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. పార్టీ పిలుపు మేరకు సోమవారం ఉదయం 10 గంటలకు కుప్పంలో ఎమ్మెల్సీ భరత్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ క్యాంపు కార్యాలయం నుంచి బస్టాండు కూడలిలోని వైఎస్‌ఆర్ విగ్రహం వరకు శాంతియుత ర్యాలీకి ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో 30 యాక్టు పేరుతో అనుమతులు లేవని ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగుతున్న నిరసనను ఇక్కడ కూడా చేపడతామని వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. దీంతో టీడీపీ నాయకులు నేరుగా రంగంలోకి దిగారు. వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ర్యాలీ జరగకుండా చేసేందుకు అకస్మాత్తుగా విజయోత్సవ ర్యాలీకి రూపకల్పన చేశారు. సోమవారం ఉదయం 10 గంటలకు కుప్పం టీడీపీ కార్యాలయం నుంచి బస్టాండు కూడలిలోని ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతి పోలింగ్ బూత్ నుంచి కనీసం 50 మందిని తీసుకురావాలని స్థానిక నాయకులను పురమాయించారు.
తమకు కంచుకోటగా టీడీపీ నాయకులు చెప్పుకునే కుప్పం నియోజకవర్గంలోనూ విపక్షానికి పెరుగుతున్న ఆధరణను చూసి అధికార పార్టీ జడుసుకుంటోందా?.. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే కనీస హక్కును సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలోనూ అడ్డుకునేందుకు కుట్రలు చేస్తోందా ?.. అంటే అవుననే సమాధానమే వస్తోంది.
పోలీసుల పచ్చ పాతం
నిరసన ర్యాలీని అడ్డుకునేందుకు కుప్పం పోలీసులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. పది రోజుల ముందే పార్టీ ప్రకటించిన ర్యాలీని ఓ వైపు అడ్డుకొంటూ మరో వైపున టీడీపీ మెరుపు ర్యాలీకి మాత్రం పచ్చ కార్పెట్ పరిచారు. వైఎస్‌ఆర్‌సీపీ ర్యాలీకి మాత్రం ఎవరూ రాకూడదని సామాజిక మాద్యమాల్లో పోస్టులు పెట్టారు. ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని భావించిన నాయకులకు నేరుగా ఫోన్లు చేసి బెదిరింపులకు పూనుకున్నారు. ఒక్క రోజు ముందుగా తెర మీదికి వచ్చిన టీడీపీ ర్యాలీపై మాత్రం ఎలాంటి ఆంక్షలు లేకుండా సహకారం అందిస్తున్నారు. ఇరు పార్టీల ర్యాలీలతో కుప్పం నియోజకవర్గంలో ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.


