కుప్పం : పట్టణంలోని ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవాలయ పునర్నిర్మాణం వివాదాస్పదంగా మారింది. ప్రధానంగా గర్భగుడి మార్పు చేయాలని టీడీపీ నేతలు మంకు పట్టు పడుతుండడంతో వ్యవహారం ముదిరిపోయింది. ఏళ్ల తరబడిగా అమ్మవారు ఆశీనులపైన శక్తిపీఠం మార్పు చేస్తే అరిష్టమని పూజారులు ఆవేదన వ్యక్తం చేస్తుండడంతో వివాదం మరింత పెద్దదైంది.
మార్పు తథ్యం!
ఆలయ కమిటీ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో గర్భగుడి మార్పు తథ్యమని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. వాస్తు దోషాల ప్రకారం గర్భగుడిని మార్పు చేస్తేనే ఆలయ అభివృద్ధి సాధ్యమని వాదిస్తున్నారు. అయితే ఈ విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఏకపక్షం నిర్ణయాలు తీసుకోవడం తగదని పట్టణవాసులు సూచిస్తున్నారు. అయితే మా మాటే శాసనం.. గర్భగుడి మార్పు తప్పదని ఆలయ కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు తెగేసి చెబుతున్నారు.
మనోభావాలు దెబ్బతీయడమే..
సుమారు 110 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రసన్న తిరుపతి గంగమ్మ దేవస్థానం శక్తి పీఠాన్ని మార్పు చేసేందుకు యత్నిస్తే అనర్థాలు తప్పవని పూజారులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు ఎవరూ గర్భగుడి జోలికి వెళ్లలేదని, ఈ క్రమంలో ఏకపక్షంగా వ్యవహరించి శక్తిపీఠం మారిస్తే అరిష్టమని స్పష్టం చేస్తున్నారు. అమ్మవారు శక్తి పీఠం ఉన్న చోటే ఏటా విశ్వరూప దర్శనం ఉంటుందని, ఆ స్థానం మార్చి మరోచోట జాతర జరిపించడం సరికాదని సూచిస్తున్నారు. ఇది భక్తుల మనోబావాలను దెబ్బతీయడమేనని హెచ్చరిస్తున్నారు.


