డబ్బులున్నా.. సేవ‘లే’! | - | Sakshi
Sakshi News home page

డబ్బులున్నా.. సేవ‘లే’!

Aug 5 2026 12:24 AM | Updated on Aug 5 2026 12:24 AM

● కాణిపాకంలో ఆన్‌లైన్‌ విఘ్నాలు ● డిజిటల్‌ నిర్ణయంతో సేవలకు అంతరాయం

కాణిపాకం: విఘ్నాలు తొలగించే కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి క్షేత్రంలో ఆన్‌లైన్‌ సేవలు భక్తులకు కొత్త విఘ్నాలను సృష్టిస్తున్నాయి. అక్రమాల కట్టడి, టికెట్ల గోల్‌మాల్‌కు చెక్‌ పెడతామంటూ అర్జిత సేవలకు అమల్లోకి తెచ్చిన నగదు రహిత విధానం గందరగోళానికి దారితీస్తోంది. మాన్యువల్‌ కౌంటర్లను ఎత్తేసి, కేవలం మనమిత్ర ఆన్‌లైన్‌ విధానం, కియోస్క్‌ మిషన్ల ద్వారానే టికెట్లు జారీ చేస్తుండడంతో సామాన్య, గ్రామీణ, వృద్ధ భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.

యూపీఐతోనే చెల్లింపులు

కాణిపాకం ఆలయంలో ప్రస్తుతం ఫోన్‌పే, జీపే, పేటీఎం వంటి డిజిటల్‌ యాప్‌ల ద్వారా ఆన్‌న్‌లైన్‌ చెల్లింపులు చేస్తేనే అర్జిత సేవల టికెట్లు ఇస్తున్నారు. దీంతో చేతి నిండా డబ్బులు పట్టుకుని వచ్చినా, స్వామివారి సేవల్లో పాల్గొనే అవకాశం లేక అనేకమంది భక్తులు నిరాశగా వెనుతిరుగుతున్నారు. స్వామివారి దర్శనార్థం వచ్చే వేలాది మంది భక్తుల్లో అధికులు గ్రామీణ ప్రాంతాలకు చెందినవారే కావడంతో పాటు ఇప్పటికీ చాలామంది వద్ద సాధారణ కీప్యాడ్‌ ఫోన్లు మాత్రమే ఉన్నాయి. స్మార్ట్‌ఫోన్లు, డిజిటల్‌ వాలెట్లు వాడడం రాని వృద్ధులు టికెట్ల కోసం క్యూలో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. చేతిలో నగదు ఉన్నా, ఆన్‌లైన్‌ చెల్లింపుల కోసం చుట్టుపక్కల ఇతర భక్తులను బతిమాలుకోవాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. తమ తరఫున ఆన్‌న్‌లైన్‌లో డబ్బులు కట్టాలని, తాము నగదు చేతికి ఇస్తామని వేడుకుంటున్నారు.

పునరుద్ధరిస్తే మేలు

కాణిపాకం క్షేత్రానికి సాధారణ రోజుల్లో 15 వేల మందికి పైగా, శని, ఆదివారాలు, పండుగ రోజుల్లో 30 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. ఒకేసారి వందలాది మంది కియోస్క్‌ మిషన్ల వద్ద డిజిటల్‌ చెల్లింపులు చేస్తుండడంతో సర్వర్లు డౌనై, గంటల తరబడి సేవల్లో అంతరాయం ఏర్పడుతోంది. ఆలయంలో పారదర్శకత పెంచడం స్వాగతించదగినదే అయినా, భక్తుల సౌకర్యాన్ని పూర్తిగా మర్చిపోవడం సరికాదని స్థానికులు మండిపడుతున్నారు. కనీసం స్మార్ట్‌ఫోన్లు లేనివారు, వృద్ధుల కోసం ఒక మాన్యువల్‌ టికెట్‌ కౌంటర్‌ను అత్యవసరంగా పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement