పలమనేరు : మొగిలి ఘాట్‌లో సంచరిస్తున్న ఒంటరి ఏనుగును ఇటీవలే కుంకీ ఏనుగుల ద్వారా బంధించి ఎలిఫెంట్ క్యాంపునకు తరలించారు. దీంతో అక్కడ సమస్య తగ్గింది. కానీ, ఇప్పుడు మరో ఒంటరి ఏనుగు మొసలిమడుగులో బీభత్సం సృష్టిస్తోంది. శుక్రవారం రాత్రి అడవిలోంచి వచ్చిన ఒంటరి ఏనుగు గ్రామానికి చెందిన చలపతి నాయుడు మామిడి తోట ఫెన్సింగ్‌ను ధ్వంసం చేసింది. మామిడి కొమ్మలతోపాటు రెండు కొబ్బరి చెట్లను నేలకూల్చింది. మామిడితోపులోని ఇంటి కిటీకీలను నాశనం చేసేసింది. దీంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అడవిలోంచి ఏనుగులు రాకుండా ఇంద్రానగర్ నుంచి కాలువపల్లి మీదుగా చెత్తపెంట వరకు సోలార్‌ఫైన్సింగ్ నిర్మించాలని కోరుతున్నారు. ముందుగా కుంకీ ఏనుగుల ద్వారా ఈ ఒంటరి ఏనుగును పట్టి క్యాంపునకు తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఎలిఫెంట్ క్యాంపు వద్దే ధర్నా చేస్తామని బాధిత రైతులు స్పష్టం చేస్తున్నారు.
పంటల ధ్వంసం
గుడిపాల: మండలంలో ఒంటరి ఏనుగు శుక్రవారం రాత్రి బీభత్సం సృష్టించింది. కుప్పిగానిపల్లెలో వేరుశనగ పంటను నాశనం చేసింది. వసంతాపురం గ్రామానికి సమీపంలోనే పశుగ్రాసం, అరటి, కొబ్బరి చెట్లను ధ్వంసం చేసింది. నరహరిపేటలో పద్మనాభరెడ్డి అనే రైతు మామిడితోట కంచెను కూల్చేసింది. పారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ధామస్ తమ సిబ్బందితో ఏనుగు ఆచూకీని కనిపెట్టేందుకు యత్నిస్తున్నారు. పొలాల వద్ద పశువులను కట్టకూడదని, రాత్రి వేళల్లో ఇంటిలో నుంచి బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు.
మొసలిమడుగు వద్ద ఒంటరి ఏనుగు
ఏనుగు ధ్వంసం చేసిన అరటిపంట


