చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాను సమస్యలు వెంటాడుతున్నాయి. సామాన్య ప్రజల నుంచి అన్నదాతల వరకు, పారిశుద్ధ్య కార్మికుల నుంచి ప్రజాప్రతినిధు ల వరకు సమస్యల సుడిగుండంలో చిక్కుకుని అ ల్లాడుతున్నారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం మాత్రం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. ఈ క్ర మంలో శనివారం చిత్తూరులో జిల్లా పరిషత్ చివరి సర్వసభ్య సమావేశం నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 25తో ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం ముగియనుంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో జిల్లా పరిషత్ పాలకవర్గం ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టింది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చా క సర్వసభ్య సమావేశాలను కేవలం మొక్కు బడిగా నిర్వహిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గౌరవ వేతనం బకాయి!
వైఎస్సార్‌సీపీకి చెందిన ప్రజాప్రతినిధులనే కారణంగా ప్రభుత్వం దాదాపు రెండేళ్లుగా గౌరవ వేతనాలు చెల్లించడం లేదు. జిల్లాలోని 65 మంది జెడ్పీటీసీలకు నెలకు రూ.6,000 చొప్పున రూ. 84 లక్షలు, 877 మంది ఎంపీటీసీ సభ్యులు, కో–ఆప్షన్ సభ్యులకు నెలకు రూ.3,000 చొప్పున రూ.1.16 కోట్లు మొత్తంగా రూ. 2 కోట్ల గౌరవ వేతనం పెండింగ్‌లో పడిపోయింది. అలాగే 1,330 మంది గ్రీన్ అంబాసిడర్లకు 4 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదు. సమగ్ర శిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న 1,200 మంది క్షేత్రస్థాయి ఉద్యోగులకు బడ్జెట్ లేదనే కారణంతో జీతాలు నిలిపివేసింది.
ఏనుగుల బెడద!
హంద్రీ–నీవా కాలువలో నీరు ఆగిపోవడం, వర్షాలు లేక చెరువులు ఎండిపోవడంతో కుప్పం నియోజకవర్గంలోని 46 గ్రామాల్లో తీవ్రమైన నీటి కొరత ఏర్పడింది. ప్రజలు నిత్యం ట్యాంకర్లపైనే ఆధారపడాల్సి వస్తోంది. చిత్తూరు, పూతలపట్టు, పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో గజరాజులు గుంపులుగా తిష్టవేసి పంటలను ధ్వంసం చేస్తున్నాయి.
పడకేసిన పశువైద్యం
జిల్లాలో పశువైద్యం పూర్తిగా పడకేసింది. లంపీ స్కిన్ వంటి ప్రమాదకర వ్యాధులు వస్తున్నా నిర్ధారణ పరీక్షలు చేసే నాథుడే కరువయ్యాడు.
సంక్షోభంలో వ్యవసాయం
జిల్లాలోని వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయింది. విద్యుత్ ట్రాన్‌న్స్‌ఫార్మర్ల కోసం ఏడాది క్రితమే డబ్బులు చెల్లించిన 1,500 మంది రైతులు నేటికీ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. అధికారులు లంచాలు డిమాండ్ చేస్తున్నారని, టీడీపీ నేతలు చెప్పిన వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 21,903 హె క్టార్లు కాగా, విత్తనాలు అందక కేవలం 93 హెక్టార్లకే పరిమితమైంది. జిల్లాకు 27 వేల క్వింటాళ్ల వేరుశనగ కాయలు కేటాయించినా, కేవలం 6 వేల క్వింటాళ్లు పంపిణీ చేసి చేతులు దులుపుకున్నారు. తోతాపురి కేజీ రూ.7.50గా ప్రభుత్వం ప్రకటించినా, ర్యాంపుల్లో రూ.3 నుంచి రూ.5లకే కొనుగోలు చేస్తూ దళారులు నిలువునా దోచుకుంటున్నారు.


