గ్రానైట్ కొండపై
పాలేరులో అక్రమంగా క్వారీ నిర్వహిస్తున్న టీడీపీ నేతలు
ఆయన అనుమతి తప్పనిసరి!
బంగారుపాళానికి చెందిన సదరు టీడీపీ నేత క్వారీలకు అధిపతిగా హల్‌చల్ చేస్తున్నాడు. తనకు రాష్ట్ర స్థాయిలో పవర్ ఉందంటూ విర్రవీగుతుంటాడని, మైనింగ్ అధికారులను సైతం తన గుప్పెట్లో పెట్టుకున్నాడని స్థానికంగా చర్చ సాగుతోంది. ఏ క్వారీకి అనుమతి రావాలన్నా, ఎక్కడ అక్రమ తవ్వకం జరగాలన్నా సదరు గ్యాంగ్‌లీడర్ అనుమతి తప్పనిసరిగా మారిందని, నెలవారీ మామూళ్లు వసూలు చేస్తూ అధికారుల పేరిట దందా నడుపుతున్నాడని కూటమిలోని ఒక వర్గం ఆరోపిస్తోంది. సాయంత్రమైతే చాలు ఆ నేత కార్యాలయంలో మైనింగ్ పంచాయితీలు జరుగుతుంటాయని వెల్లడిస్తున్నారు. బుధవారం చేపట్టిన తనిఖీల్లో అధికారులు సీజ్ చేసిన హిటాచీని కూడా సదరు నేతే పంచాయితీ చేసి మరీ విడిపించేందుకు కుయుక్తులు పన్నుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంతోపాటు సోషల్ మీడియాలో సైతం రచ్చచేస్తామని కూటమిలోని ఒక వర్గం నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్నా.. సదరు గ్యాంగ్‌లీడర్ పట్టించుకోవడం లేదని తెలిసింది.
పాలేరులో కొండపై తవ్వకం
సాక్షి టాస్క్‌ఫోర్స్ : బంగారుపాళెం మండలం పాలేరు సమీపంలో టీడీపీ నేతల కనుసన్నల్లోనే గ్రానైట్ అక్రమ క్వారీ నడుస్తోంది. గతంలో కొన్నిరోజులు నిలిచిపోయిన తవ్వకాలు, నెల నుంచి మళ్లీ వేగం పుంజుకున్నాయి. పచ్చమూక రోజుకో వైపు గ్రానైట్ ఖనిజాన్ని సరిహద్దులు దాటిస్తూ రూకోట్లు కొల్లగొడుతున్నారు. క్వారీ వద్ద భారీ యంత్రాలతో తవ్వకాలు సాగుతున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పలు సభల్లో మాట్లాడుతూ అక్రమ గ్రానైట్ దందాలకు చెక్ పెడతామని ఉపన్యాసాలు ఇస్తుంటే, క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు మాత్రం అధికారులకు మామూళ్లు అందిస్తూ దందా నడిపిస్తున్నారు.
ఉత్తుత్తి తనిఖీలు
పాలేరు క్వారీ అక్రమాలపై వారం క్రితం టీడీపీ స్థానిక నేత ఒకరు ఫిర్యాదు చేయడంతో మైనింగ్ అధికారులు తనిఖీలకు బయలుదేరారు. క్షేత్రస్థాయిలో తవ్వకాలను గుర్తించి, అక్కడున్న హిటాచీ యంత్రాన్ని సీజ్ చేసి పోలీసులకు అప్పగించారు. అయితే దీనిపై కేసు నమోదు చేస్తారా లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది. క్వారీల గ్యాంగ్ లీడర్‌గా చెప్పుకునే ఓ టీడీపీ నేత రంగంలోకి దిగి సీజ్ చేసిన హిటాచీని వదిలిపెట్టాలని, కేసులు లేకుండా చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నట్లు సొంతపార్టీ నేతలే విమర్శలు గుప్పిస్తున్నారు.
అక్రమార్జనే లక్ష్యగా టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. ప్రకృతి వనరులను ఇష్టారాజ్యంగా కబళిస్తున్నారు. అందులో భాగంగానే బంగారుపాళెం మండలం పాలేరు సమీపంలోని గ్రానైట్ కొండపై కన్నేశారు. యథేచ్ఛగా క్వారీ నిర్వహిస్తూ రూ.కోట్ల ఖనిజాన్ని కొల్లగొట్టేస్తున్నారు. అడ్డూ అదుపూ లేకుండా సరిహద్దులు దాటిస్తూ దర్జాగా దందా నడిపిస్తున్నారు. భారీ యంత్రాలతో తవ్వకాలు చేపడుతున్నప్పటికీ మైనింగ్ అధికారులు మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. చివరకు అధికార పార్టీ నేతలే ఫిర్యాదు చేయడంతో తూతూమంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులుదులిపేసుకున్నారు. మూడుపువ్వులు.. ఆరు కాయలుగా గ్రానైట్ దోపిడీ సాగుతున్నప్పటికీ మామూళ్ల మత్తులో జోగుతున్నారు.


