చిత్తూరు కార్పొరేషన్: జిల్లాలోని ఎంపీడీఓలకు కేరళ రాష్ట్రంలో పలు అంశాలపై ఇచ్చిన అధ్య యన శిక్షణ శనివారంతో ముగిసింది. పెద్దపంజాణి, కుప్పం ఎంపీడీఓలు బాలాజీ, రాజేంద్రప్రసాద్ శిక్షణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక పాలన, చెత్త నుంచి సంపద తయారీ, పలు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ఎంపీడీఓలకు అవగాహన కల్పించారు.
తుది దశకు డిజిటైజేషన్
చిత్తూరు కలెక్టరేట్ : ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలో పరిశీలన, డిజిటలైజేషన్ ప్రక్రియ తుది దశకు చేరుకున్నట్లు కలెక్టరేట్ సుమిత్ కుమార్ గాంధీ తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 13,40,126 మంది ఓటర్లలో ఇప్పటికే 12,04,503 మంది వివరాలు డిజటలైజ్ చేశామన్నారు. ప్రస్తుతం రోల్‌బ్యాక్‌కు సంబంధించిన 31, ఆన్‌లైన్‌లో వచ్చి న 3 దరఖాస్తులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నా యని వెల్లడించారు. జిల్లాలో 29,900 మందిఓటర్లకు మ్యాపింగ్ పూర్తికాగా, 1,35,623 మందిని అన్ కలెక్టబుల్‌గా గుర్తించినట్లు వివరించారు.
పంటల బీమా తప్పనిసరి
ఐరాల: ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే పంట నష్టాల నుంచి రక్షణ పొందేందుకు రైతులు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి మురళి కోరారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్‌ఎస్‌కేలో సిబ్బంది, రైతుల తో సమావేశమై మాట్లాడారు. యూరియా పంపిణీ యాప్ ద్వారానే చేయాలని స్పష్టం చేశా రు. రైతులు వరి ఎకరా పంటకు రూ.840, రాగి పంట ఎకరాకు రూ.560 కామన్ సర్వీస్ సెంటర్‌లో ప్రీమియం చెల్లించి బీమా పథకంలో చేరాలన్నారు. వేరుశనగ పంటకు ప్రత్యామ్నాయంగా సోయాబీన్స్ మేలన్నారు. ఎల్‌నినో ప్రభావం అధికంగా ఉన్న నేపథ్యంలో నీటి వినియోగం తక్కువగా ఉన్న పంటలను ఎంపిక చేసుకోవడం ఉత్తమమన్నారు. పశుగ్రాసం కొరతను అధిగమించేందుకు నవధాన్యాలను సాగు చేయాలని, రైతులు సాగు చేసిన పంటలకు ఈ–క్రాప్ చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏడీఏ ఉమ, ఏఓ వందన, జెడ్‌బీఎన్‌ఎఫ్ సిబ్బంది, బీమా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
శ్రీవారి దర్శనానికి
18 గంటలు
తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 29 కంపార్ట్‌మెంట్లలో భక్తలు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 70,216 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 27,606 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.77 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
కారును ఢీకొన్న లారీ
బంగారుపాళెం: మండలంలో చైన్నె–బెంగళూరు జాతీయ రహదారిపై మహాసముద్రం టోల్ ప్లాజా వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పలమనేరు నుంచి చిత్తూరు వైపు వెళ్తున్న కారును వెనుక నుంచి వస్తున్న లారీ ఢీకొంది. అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రహదారిపై ప్రమాదానికి గురైన వాహనాలను పక్కకు తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు.


