కార్వేటినగరం : చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను ప్రశ్నిస్తే.. వేధించడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ జీడీ నెల్లూరు నియోజకవర్గ సమన్వయకర్త కృపాలక్ష్మితో కలిసి శుక్రవారం పుత్తూరులోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ విధానాలు, టీటీడీలో సాగుతున్న అక్రమాలపై పోరాటం చేస్తున్న వైఎస్సార్‌సీపీ చిత్తూరు, తిరుపతి జిల్లాల అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డిపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో 24 ఏళ్ల క్రితం కొనుగోలు చేసిన భూమిలో దౌర్జన్యంగా ప్రవేశించి ప్రహరీని ధ్వంసం చేయించడం సరికాదన్నారు. కమ్యూనిస్టు భావాలతో ధైర్యంగా పోరాటం చేస్తున్న కరుణాకరరెడ్డి ఎదుగుదలను ఓర్వ లేక చంద్రబాబు ప్రభు త్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఇలాంటి బెదిరింపులకు కరుణాకరరెడ్డి భయపడే వ్యక్తి కాదని స్పష్టం చేశారు. ఇప్పటికై నా అక్రమ కేపులు, కక్ష సాధింపులు వదలిపెట్టి, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి పెట్టాలని సూచించారు.
రాజీనామా చేయాల్సిందే..
దేశ వ్యాప్తంగా విద్యార్థులు తమకు జరిగిన అన్నాయాన్ని ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం లాఠీ చార్జీ చేయించడం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో రైల్వే ప్రమాద ఘటనకు బాధ్యత వహిస్తూ అప్పటి రైల్యేశాఖ మంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి, ఆర్థిక కుంభకోణానికి బాధ్యత వహిస్తూ టీజీ కృష్ణమాచారి, మన రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల ప్రశ్న పత్రాలు లీక్‌కు బాధ్యత వహిస్తూ అప్పటి విద్యాశాఖ మంత్రి ముద్దుకృష్ణమనాయుడు రాజీనామా చేశారని గుర్తుచేశారు. అదే స్ఫూర్తితో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సైతం వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. యువత పోరాటానికి శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ తదితర దేశాల్లో ప్రభుత్వాలు కూలిపోయిన విషయాన్ని కేంద్ర సర్కారు గుర్తించాలని కోరారు. విద్యార్థుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని సూచించారు.


