పంటలపై ఆగని గజ దాడులు | - | Sakshi
Sakshi News home page

పంటలపై ఆగని గజ దాడులు

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

పెద్దపంజాణి: పంటలకు ఏనుగుల నుంచి రక్షణ లేకుండా పోతోంది. మండలంలోని తిప్పిరెడ్డిపల్లి, కొత్తబూరగపల్లి, పెనుగొలకల, పెద్దకాపల్లి, ముదిరెడ్డిపల్లి, బందార్లపల్లి, జిట్టంవారిపల్లి, గౌరీనగర్‌, ఆకులవారిపల్లి, బేరుపల్లి, కమ్మపాళ్యం, గంకొండ, కోగిలేరు తదితర గ్రామాలు ఆటవీ సరిహద్దులు కలిగి ఉన్నాయి. తరచూ ఏదో ఒక గ్రామంలోని రైతుల పంటలను ఏనుగులు నాశనం చేస్తూ తీవ్ర నష్టం కలిగిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం ఇక్కడి ఏనుగుల కట్టడికి పక్క రాష్ట్రమైన కర్ణాటక నుంచి కుంకీ ఏనుగులు తీసుకొచ్చింది. అయినా వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని రైతులు చర్చించుకుంటున్నారు. తాజాగా బుధవారం వేకువజామున పలమనేరు రేంజ్‌ కీలపట్ల ఫారెస్టు బీటు నుంచి వచ్చిన ఏనుగులు పెద్దకాప్పల్లి గ్రామానికి చెందిన సురేంద్రరెడ్డి మామిడి తోటలపై విరుచుకుపడ్డాయి. పది మామిడి చెట్లను విరిచేశాయి. కాయలు సైతం నేలరాల్చాయి. అదే విధంగా పెనుగొలకల గ్రామానికి చెందిన నారాయణప్ప వరి పంటను తొక్కి నాశనం చేశాయి. మరో రైతుకు చెందిన రాగి పంటను ధ్వంసం చేశాయి. ఈ దాడుల్లో దాదాపు యాభైవేల రూపాయల వరకు నష్టం వాటిల్లినట్టు అంచనా. ఉదయం పొలాల వద్దకు వెళ్లిన రైతులు ఏనుగుల విధ్వంసాన్ని చూసి కన్నీటి పర్యంతమయ్యారు.

అధికారుల నిద్ర మత్తు

ఒక వైపు ఏనుగులు దాడులు చేస్తూ పంటలకు నష్టం వాటిల్లితున్నా పలమనేరు రేంజ్‌ లోని అటవీ శాఖ అధికారులు మాత్రం నిద్రమత్తు వీడడం లేదు. గత కొంత కాలంగా ఏనుగులు పలమనేరు రేంజ్‌ కీలపట్ల బీటులో మకాం వేసి ఉన్నాయి. వాటిని పొలాలపైకి రాకుండా అటవీ ప్రాంతంలోకి మళ్లించే చర్యలు చేపట్టలేదని సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఏనుగుల దాడి నుంచి పంట పొలాలను రక్షించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలి తం కనిపించడం లేదని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లా అధికారులైనా స్పందించి ఏనుగులను అడవిలోకి మళ్లించే చ ర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement