పలమనేరులో ఖాళీ సిలిండర్ల సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

పలమనేరులో ఖాళీ సిలిండర్ల సీజ్‌

Apr 10 2026 9:51 AM | Updated on Apr 10 2026 9:51 AM

పలమనేరు: నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలోని పాత పోస్టాపీసు వద్ద ఓ గోడౌన్‌లో నిల్వ ఉంచిన ఖాళీ సిలిండర్లను డిస్ట్రిక్‌ సివిల్‌ సప్లయ్‌ ఆఫీసర్‌ శంకర్‌ తమ సిబ్బందితో కలసి గురువారం దాడులు చేసి సీజ్‌ చేశారు. పట్టణానికి చెందిన కృష్ణమూర్తి అనే యువకుడు డొమస్టిక్‌ సిలిండర్లను పోగుచేసి వాటిని కమర్షియల్‌గా వివిధ రూపాల్లో మార్చుతూ అక్రమాలకు పాల్పడుతున్నాడు. దీనిపై వచ్చిన సమాచారంతో అధికారులు దాడులు చేసి గోడౌన్‌లో నిల్వ ఉన్న వందకుపైగా సిలిండర్లను సీజ్‌ చేశారు. నిర్వాహకుడిపై 6ఏ కేసు నమోదు చేసి జేసీ కోర్టుకు కేసును రెఫర్‌ చేశారు. అసలే గ్యాస్‌ దొరక్క వినియోగదారులు ఇక్కట్లు పడుతుంటే ఇలా బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మకాలు చేయడంపై ఆయన సీరియస్‌ అయ్యారు. అసలు ఇన్ని సిలిండర్లు ఎలా వచ్చాయని నిర్వాహకున్ని ప్రశ్నించారు. స్థానికంగా ఉన్న సీఎస్‌డీటీల ప్రమేయం ఉండడంతోనే ఈ అక్రమాలు సాగుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారిపై కఠిన చర్యలు తప్పవని డీఎస్వో హెచ్చరించారు. నిర్వాహకునికి సహకరిస్తున్న గ్యాస్‌ ఏజెన్సీ వారిపై కూడా చర్యలుంటాయన్నారు. ఈ దాడుల్లో జిల్లా సివిల్‌ సప్లయ్‌ కార్యాలయ అధికారి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, స్థానిక తహసీల్దార్‌ ఇన్బునాథన్‌ తదితరులు పాల్గొన్నారు.

శ్రీవారి దర్శనంపేరుతో మోసం కేసులో ఒకరి అరెస్టు

తిరుమల: శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శనం కల్పిస్తామని సోషల్‌ మీడియా వేదికల ద్వారా భక్తులను మోసం చేస్తున్న తమిళనాడు రాష్ట్రం, తిరువల్లూరు జిల్లాకు చెందిన సి.సెంథిల్‌ కుమార్‌ (47)ను తిరుమల టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు.. టీటీడీ లోగోను దుర్వినియోగం చేస్తూ ‘‘త్వరితగతిన దర్శనం’’, ‘‘అత్యంత సమీపంలో దర్శనం’’, ‘‘వీఐపీ దర్శనం టికెట్లు అందుబాటులో ఉన్నాయి’’ అంటూ తప్పుడు ప్రచారం చేసి, భక్తులను నమ్మించినట్లు పోలీసులు తెలిపారు. టీటీడీ విజిలెన్స్‌ విభాగం ఫిర్యాదు మేరకు తిరుమల టూ టౌన్‌, తిరుమల వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్లలో కేసులు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ ఎల్‌. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందం తమిళనాడులో విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకుంది. దర్యాప్తులో నిందితుడు ఒక్కో టికెట్‌కు సుమారు రూ.16,500 చొప్పున వసూలు చేసి, కుటుంబ సభ్యుల బ్యాంక్‌ ఖాతాలు, ఫోన్‌న్‌పే ద్వారా డబ్బులు స్వీకరించినట్లు తేలింది. ఇతడి వద్ద నుంచి డెల్‌ ల్యాప్‌టాప్‌, మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement