గ్యాస్‌ దందా! | - | Sakshi
Sakshi News home page

గ్యాస్‌ దందా!

Mar 14 2026 7:47 AM | Updated on Mar 14 2026 7:47 AM

కొరత పేరుతో బ్లాక్‌మార్కెట్‌

కమర్షియల్‌ గ్యాస్‌ కోసం హోటళ్ల

నిర్వాహకులు పరేషాన్‌

బుకింగ్‌ ఫుల్‌.. సరఫరా అంతంతే

దొంగచాటుగా అమ్మకాలు

ఏజెన్సీలు, డెలివరీ బాయ్‌లకు కాసుల వర్షం

గతంలో రూ.50–100.. ఇప్పుడు రూ.200 నుంచి రూ.800 వరకు

అదనపు వసూళ్లు

ఫిర్యాదు చేసినా స్పందించని

పౌర సరఫరాల శాఖ అధికారులు

చిత్తూరు రూరల్‌ (కాణిపాకం): జిల్లాలో గ్యాస్‌ బాంబ్‌ పేలుతోంది. బండపై...పలు ఏజెన్సీలు బండబాదుడు బాదుతున్నాయి. కొరతంటూ..వినియోగదారులకు కోతపెడుతోంది. బుకింగ్‌ ఫుల్‌కు పుల్‌స్టాఫ్‌ పెడుతూ...బ్లాక్‌ మార్కెట్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇస్తోంది. ముఖ్యంగా కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో హోటళ్లు, టిఫిన్‌న్‌ సెంటర్లు, బేకరీలు, చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరఫరా తగ్గిందనే పేరుతో గ్యాస్‌ ఏజెన్సీలు బుకింగ్‌లను పెండింగ్‌లో పెట్టి, అదే సిలిండర్లను అదనపు డబ్బులు తీసుకుని దొంగచాటుగా విక్రయిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

జిల్లాలో 42 గ్యాస్‌ ఏజెన్సీలున్నాయి. వీటి కింద దీపం కనెక్షన్‌లు 2,45,786, ఉజ్వల కనెక్షన్‌లు 20,212, ఎల్‌పీజీ కనెక్షన్‌లు 5,09,116, కమర్షియల్‌ కనెక్షన్‌లు 2,930 వరకు ఉన్నాయి. ఇటీవల అంతర్జాతీయ పరిస్థితులు, యుద్ధం కారణంగా గ్యాస్‌ సరఫరా లో అంతరాయం ఏర్పడిందని ఏజెన్సీలు చెబుతున్న ప్పటికీ, వాస్తవానికి కొరతను ఆసరాగా చేసుకుని బ్లాక్‌ మార్కెట్‌కు తెరతీసినట్టు వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

కమర్షియల్‌ గ్యాస్‌కు భారీ డిమాండ్‌

జిల్లాలో వేల సంఖ్యలో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బేకరీలు వంటి వ్యాపారాలు కమర్షియల్‌ గ్యాస్‌పై ఆధారపడి ఉంటాయి. ఇటీవల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో వ్యాపారు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుకింగ్‌లు చేసినా సిలిండర్లు సమయానికి అందకపోవడంతో వ్యాపారాలు నిలిచిపోయే పరిస్థితి ఏర్పడుతోంది.

బ్లాక్‌లో అమ్మకాలు..?

వినియోగదారులు గ్యాస్‌ సిలిండర్ల కోసం బుకింగ్‌ చేస్తే ‘స్టాక్‌ లేదు’, ‘సరఫరా రాలేదు’ అంటూ పలు ఏజెన్సీలు సమాధానం చెబుతున్నాయని వినియోగదారులు చెబుతున్నారు. అయితే అదే సమయంలో కొందరికి అదనపు డబ్బులు తీసుకుని సిలిండర్లు అందిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో గ్యాస్‌ సిలిండర్‌పై రూ.50 నుంచి రూ.100 వరకు అదనంగా వసూలు చేసే వారు. ప్రస్తుతం పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఒక్కో సిలిండర్‌పై రూ.200 నుంచి రూ.800 వరకు అదనంగా వసూలు చేస్తున్నట్లు వినియోగదారు లు చెబుతున్నారు. ముఖ్యంగా హోటల్‌ యజమానులు, చిన్న వ్యాపారులు ఈ అదనపు చార్జీలను చెల్లించక తప్పడం లేదని అంటున్నారు.

డెలివరీ బాయ్‌ల పాత్రపై ఆరోపణలు

కొన్ని చోట్ల డెలివరీ సిబ్బంది ముందుగా సిలిండర్లను నిల్వ ఉంచి, తర్వాత అదనపు డబ్బులు ఇచ్చే వారికి మాత్రమే అందిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్యాస్‌ ఏజెన్సీలు, డెలివరీ సిబ్బంది కలిసి ఈ వ్యవహారాన్ని నడుపుతున్నారని వినియోగదారులు అంటున్నా రు. దీంతో సాధారణ వినియోగదారులు, చిన్న వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు.

పట్టించుకోని అధికారులు

గ్యాస్‌ దందాపై పౌరసరఫరాల శాఖ అధికారులు చర్య లు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదు చేసేందుకు వినియోగదారులు ఫోన్‌న్‌ చేసినా స్పందన లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్‌ డిస్ట్రిబ్యూటర్ల ఒత్తిడిలో అధికారులు జోగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాస్‌ కొరత పేరుతో జరుగుతున్న దందాపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని వినియోగదారులు డిమాండ్‌ చేస్తున్నారు. బ్లాక్‌మార్కెట్‌కు పాల్పడుతున్న ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుని సిలిండర్ల సరఫరాను సక్రమంగా నిర్వహించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement