గుడిపాల: రైతులందరికీ అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులను పంటల సాగులో వినియోగించుకోవాలని కలెక్టర్ సుమిత్‌కుమార్ అన్నారు. శుక్రవారం గుడిపాల మండలంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్‌తో కలిసి ఆయన పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో మూడు విడతలుగా 2 లక్షలా 5 వేల 753మంది రైతులకు 400 కోట్ల రూపాయలు రైతుల బ్యాంక్ వ్యక్తిగత ఖాతాలకు జమ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో ప్రధాన పంటగా వ్యవసాయ పంటలతో పాటు ఉద్యాన పంటల అభివృద్ధి , పాడి పరిశ్రమపై దృష్టి పెట్టాలని రైతులను కోరారు. జిల్లాలో వర్షపాతం తక్కువగా ఉన్నదని రైతులు ఉద్యానశాఖ పంటలపై ఆసక్తి చూపాలని రైతులకు పిలుపునిచ్చారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ..సూపర్ సిక్స్‌లో భాగంగా రైతులకు ప్రభుత్వం రూ.14 వేలు అందజేసిందన్నారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి చెక్కును అందజేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసులు, ఎంపీడీవో శిరీష, ఎంపీపీ గోళ్ల హరిప్రసాద్, సింగిల్‌విండో చైర్మన్ ప్రతాప్‌నాయుడు, వ్యవసాయాధికారులు సంగీత, వేణుగోపాల్ పాల్గొన్నారు.


