చిత్తూరు రూరల్(కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా ప్రభుత్వాస్పత్రి ఆవరణలో శుక్రవారం జరిగిన అగ్ని ప్రమాదంలో పెను విషాదం తప్పింది. పాడుబడ్డ 108, 104 వాహనాల స్క్రాప్ తొలగింపు సమయంలో గ్యాస్ కట్టర్లు వినియోగించడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి, క్షణాల్లోనే ఒక 108 వాహనం పూర్తిగా దగ్ధమైంది. అపోలో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
స్కారప్ వాహనాలతోనే ప్రమాదం
చిత్తూరు ప్రభుత్వాస్పత్రిలో పాడుబడ్డ 108, 104 వాహనాలకు ఇటీవల వేలం నిర్వహించారు. వేలంలో 23 వాహనాలను దక్కించుకున్న స్క్రాప్ యజమానులు వాటిని అక్కడి నుంచి తరలించి తమ ప్రాంగణంలో విడగొట్టాల్సి ఉండగా ఆస్పత్రి ఆవరణలోనే గ్యాస్ కట్టర్లతో కటింగ్ పనులకు దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఒక 108 వాహనంలోని సీట్లకు మంటలు అంటుకుని కేవలం ఐదు సెకన్లలోనే వాహనం మొత్తం అగ్నికి ఆహుతైంది. వాహనంలో ఉన్న ఫోమ్, ప్లాస్టిక్ పదార్థాలు, చుట్టుపక్కల ఎండిన చెత్త, చెట్లు ఉండటంతో మంటలు ఒక్కసారిగా చెలరేగాయి. కొద్దిసేపట్లోనే పక్కనే ఉన్న మరో స్క్రాప్ వాహనానికి మంటలు వ్యాపించాయి. మంటలు చెలరేగిన విషయం గుర్తించిన అపోలో సెక్యూరిటీ సిబ్బంది వెంటనే స్పందించారు. అందుబాటు లో ఉన్నవాటితో మంటలను ప్రాథమికంగా అదుపు చేసే ప్రయత్నం చేశారు. అదే సమయంలో ఫైర్ స్టేషన్‌కు సమాచారం అందించడంతో ఆగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిగా ఆర్పేశారు. ప్రమాదం జరిగిన ప్రదేశానికి అతి సమీపంలోనే 108 వాహనాల కార్యాలయం, శిశు వార్డు ఉండటం తీవ్ర ఆందోళన కలిగించింది. మంటలు అదుపులోకి రావడంలో కాస్త ఆలస్యం అయినా 108 కార్యాలయంతో పాటు శిశు వార్డుకూ మంటలు వ్యాపించే పమ్రాదం ఉండేది.
రోగుల తరలింపు
మంటల చెలరేగడంతో శిశు వార్డు వైద్యాధికారి అప్రమత్తమై అక్కడున్న రోగులను వెంటనే మరో ప్రాంతానికి తరలించారు. ఈ ఘటనకు స్క్రాప్ యజమానుల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని తెలుస్తోంది. స్క్రాప్ యజమానులు గ్యాస్ కట్టర్ల కోసం కమర్షియల్ సిలిండర్లనే వాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ ఘటనతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రి భద్రతా వ్యవస్థపై కూడా తీవ్ర ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఆస్పత్రి ఆవరణలో ఎవరు అనుమతి ఇచ్చారు? ఏ షరతులతో స్క్రాప్ తొలగింపు పనులు అప్పగించారు? డొమెస్టిక్ సిలిండర్లు వాడారా? భద్రతా ప్రమాణాలు ఎందుకు పాటించలేదు? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కాలిపోయిన పాత వాహనాలు
మంటలను అదుపుచేస్తున్న అగ్నిమాపక సిబ్బంది


