16 నుంచి ‘పది’ పబ్లిక్ పరీక్షలు
ప్రణాళిక, సన్నద్ధత ముఖ్యం
ఆరోగ్యం, తల్లిదండ్రుల పాత్ర ముఖ్యం
పది పరీక్షలకు హాజరుకానున్న 21,051 మంది విద్యార్థులు
చిత్తూరు కలెక్టరేట్ : పదో తరగతి... ప్రతి విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన మలుపు. భవిష్యత్తు ఉన్నత విద్యాభ్యాసానికి, పునాది వేసే తొలి మెట్టు. పబ్లిక్ పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ విద్యార్థుల్లో తెలియని ఆందోళన, కంగారు, ఒత్తిడి మొదలవు తాయి. అయితే పరీక్షలు అంటే భయపడాల్సిన అవసరం లేదని, సరైన ప్రణాళిక, ఆత్మవిశ్వాసం ఉంటే పది పరీక్షల్లో అత్యుత్తమ గ్రేడ్ (10కి10) సాధించడం సులువేనని మానసిక, విద్యా నిపుణులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు భయాన్ని వీడి, విజయతీరాలను చేరుకోవడానికి నిపుణులు అందిస్తున్న సమగ్రమైన మెలకువలపై సాక్షి ప్రత్యేక కథనం.
ప్రణాళిక అవసరం
కచ్చితమైన టైమ్ టేబుల్ ముఖ్యం. రోజువారీ దినచర్యలో ఏ సమయానికి ఏ సబ్జెక్టు చదవాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. కష్టంగా అనిపించే సబ్జెక్టులకు ఎక్కువ సమయం, ఉదయం పూట ప్రశాంతమైన సమయాన్ని కేటాయించాలి. ఏ చాప్టర్ నుంచి ఎన్ని మార్కుల ప్రశ్నలు వస్తాయో బ్లూ ప్రింట్ ద్వారా అవగాహన పెంచుకోవాలి. ఎక్కువ మార్కు ల వెయిటేజీ ఉన్న పాఠాలపై ముందుగా దృష్టి పెట్టాలి. చదివిన ప్రతి అంశాన్ని ఒక చిన్న నోట్ బుక్‌లో పాయింట్ల వారీగా రాసుకోవాలి. ఫార్ములాలు, ముఖ్యమైన తేదీలు, కీ వర్డ్స్ కోసం మైండ్ మ్యాప్స్ ఉపయోగిస్తే చివరి నిమిషంలో రివిజన్ చేయడానికి చాలా సులభంగా ఉంటుంది.
ప్రశ్న పత్రాల సాధన
ప్రస్తుత ఏడాదిలో నిర్వహించిన పరీక్షల ప్రశ్నపత్రాలను రివిజన్ చేసుకోవాలి. వాటిని నిర్ణీత సమ యంలో (3 గంటల్లో) రాయడానికి సాధన చేయాలి. దీనివల్ల సమయ నిర్వహణ అలవడుతుంది. మోడల్ పేపర్లు రాసిన తర్వాత, ఎక్కడ తప్పులు దొర్లుతున్నాయో విశ్లేషించుకుని సరిదిద్దుకోవాలి.
పరీక్ష హాలులో పాటించాలి
తొలి 15 నిమిషాల సద్వినియోగం చేసుకోవాలి. పరీక్ష మొదలవడానికి ముందు ప్రశ్న పత్రం చదువుకోవడానికి ఇచ్చే 15 నిమిషాల సమయం విలువైంది. ఇందులో పేపర్ మొత్తాన్ని ఒకసారి చదివి, బాగా వచ్చిన ప్రశ్నలను ముందుగా గుర్తించాలి. జవాబు పత్రం చూడగానే దిద్దే ఉపాధ్యాయుడికి మంచి అభిప్రాయం కలగాలి. రెండు జవాబుల మధ్య సరైన గ్యాప్ వదలడం, ముఖ్యాంశాలను అండర్ లైన్ చేయడం, అవసరమైన చోట కొట్టి వేతలు లేకుండా రాయడం అలవర్చుకోవాలి. ఏ సెక్షన్‌కు ఎంత సమయం కేటాయించాలో ముందుగానే ఒక అంచనాతో ఉండాలి. ఒకే ప్రశ్న దగ్గర ఆగిపోయి సమయం వృథా చేయకూడదు. రాని ప్రశ్నలను చివర్లో ఆలోచించి రాయాలి. షీట్‌లో వివరాలు నింపేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. బబ్లింగ్ చేసేటప్పుడు హడావుడి పడకూడదు. అడిషనల్ షీట్స్ తీసుకుంటే వాటికి నంబర్లు వేసి దారం గట్టిగా కట్టాలి.
ఆరోగ్యం , తల్లిదండ్రుల పాత్ర
పరీక్షల సమయంలో నిద్ర వాయిదా వేసుకోకూడదు. పగలు, రాత్రి పుస్తకాలతో కుస్తీ పడుతూ నిద్రను నిర్లక్ష్యం చేయకూడదు. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల ప్రశాంతమైన నిద్ర మెదడును చురుకుగా ఉంచుతుంది. సమతుల్య ఆహారం తీసుకోవాలి. నూనె పదార్థాలు, జంక్ ఫుడ్ మానేయాలి. తాజా పండ్లు, కూరగాయలు, నట్స్ తీసుకోవాలి. శరీరం డీహైడ్రేట్ కాకుండా ఎప్పటికప్పుడు నీళ్లు, మజ్జిగ, కొబ్బరినీళ్లు తాగుతూ ఉండాలి. పరీక్షల సమయంలో తల్లిదండ్రుల బాధ్యత ముఖ్యమైనది. ఈ సమయంలో పిల్లలపై మార్కుల ఒత్తిడి తీసుకురాకూడదు. ఇతరులతో పోల్చి వారి ఆత్మన్యూనతను పెంచకూడదు. ‘నువ్వు చేయగలవు, ఎంత వస్తే అంత రాయ్, మేమున్నాం’ అనే భరోసా ఇస్తే పిల్లలు రెట్టించిన ఉత్సాహంతో పరీక్షలు రాస్తారు.


