చిత్తూరు కలెక్టరేట్ : తెలుగు సాహితీవనంలో తనదైన ముద్ర వేసిన తొలి తెలుగు కవయిత్రి, ఆతుకూరి మొల్ల మహిళా సాధికారతకు నిలువుటద్దమని డీఆర్‌వో మోహన్ కుమార్ కొనియాడారు. శుక్రవారం కలెక్టరేట్‌తో పాటు పీవీకేఎన్, సావిత్రమ్మ ప్రభు త్వ డిగ్రీ కళాశాలల్లో కవయిత్రి మొల్ల జయంతి ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ లో నిర్వహించిన కార్యక్రమంలో మొల్ల విగ్రహానికి నివాళులర్పించారు. డీఆర్‌వో మాట్లాడుతూ.. తెలుగు సాహితీ వనంలో తనదైన ముద్ర వేసిన తొలి తెలుగు కవయిత్రి, భక్త శిఖామణి ఆతుకూరి మొల్ల అని అన్నారు. ఆమె నేటి తరానికి, ముఖ్యంగా మహిళా లోకానికి గొప్ప ఆదర్శప్రాయురాలని కొనియాడారు. 16వ శతాబ్దానికి చెందిన మొల్ల, సామాన్య కుటుంబంలో జన్మించినప్పటికీ నాటి సామాజిక పరిస్థితులను అధిగమించి సాహిత్యం వైపు అడుగులు వేశారని ఆయన గుర్తుచేశారు. ఆమె రచించిన రామాయణం పండితులకే కాకుండా సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా సరళమైన, స్వచ్ఛమైన తెలుగులో ఉండటం వల్లే కాలపరీక్షను తట్టుకొని నిలిచిందన్నారు. నేటి మహిళలు వంటింటికే పరిమితం కాకుండా, తమలోని సృజనాత్మకతను వెలికితీసి సమాజంలో ఉన్నత స్థానాలకు చేరుకోవాలన్నారు.కార్యక్రమంలో జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి రబ్బానీ భాషా, బీజేపీ నాయకులు అట్లూరి శ్రీనివాసులు, రాయలసీమ కుమ్మరి యూత్ సెక్రెటరీ హరిప్రసాద్, హరి బాబు, చలపతి, సోమశేఖర్ పలువురు పాల్గొన్నారు.
తెలుగు సాహిత్య సౌరభం
పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొల్ల జయంతి కార్యక్రమం నిర్వహించారు. ప్రిన్సిపల్ డా.జీవనజ్యోతి మాట్లాడుతూ.. తెలుగు సాహిత్య చరిత్రలో మొల్ల ఒక అద్వితీయమైన స్థానాన్ని ఆక్రమించారని కొనియాడారు. తెలుగు భాషా సాహిత్య సంపదలో ‘మొల్ల రామాయణం’ ఒక ఆభరణం వంటిదని చెప్పారు. కార్యక్రమంలో అధ్యాపకులు చెన్నకేశవులు, జయచంద్రుడు, గోపీనాయక్, జ్యోత్స ్న, నిరోషా, బాలకృష్ణా, సుహాసిని, విద్యార్థులు పాల్గొన్నారు.
సుందరకాండకు సాహితీ నీరాజనం...
తెలుగు సాహిత్య చరిత్రలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన తొలి తెలు గు కవయిత్రి ఆతుకూరి మొల్ల జయంతి వేడుకలు సావిత్రమ్మ మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు. సదస్సులో పాల్గొన్న తెలుగు అధ్యాపకులు డాక్టర్ జి. ధర్మమూర్తి మాట్లాడుతూ.. మొల్ల సాహిత్య ప్రతిభను విద్యార్థులకు వివరించారు. మొల్ల రచించిన రామాయణంలో సుందరకాండకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, అద్భుతమైన గ్రంథంగా తీర్చిదిద్దారని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ మనోహర్, వైస్ ప్రిన్సిపల్ ఉషారాణి, అధ్యాపకులు శివశంకర్ పాల్గొన్నారు.


