సాక్షి టాస్క్‌పోర్స్ : కూటమి నేతల అధికార దాహానికి కొండలు, గుట్టలు కరిగిపోతున్నాయి. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండలు, గుట్టలు కనుమరుగు అవుతున్నాయి. కార్వేటినగరం మండలం, కొటార్వేడు పంచాయతీ, కనికాపురం సమీపంలోని సర్వే నం.140–9లో మొత్తం 100 ఎకరాల గుట్ట పొరంబోకు భూమి ఉంది. ఇది తమిళనాడుకు సరిహద్దు ప్రాంతం పక్కనే ఉండడంతో కూటమి నేతల కన్నుపడింది. ఆ గుట్టలో గ్రావెల్ తీసి అక్రమంగా తమిళనాడుకు తరలించి భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంటున్నారు.
ఇష్టారాజ్యంగా తవ్వకాలు
రోజుకు 50 నుంచి 100 ట్రాక్టర్ల ద్వారా మట్టి తవ్వి తరలించేస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్ గ్రావెల్ రూ.వెయ్యికి పైగా ధర పలుకుతోంది. తమిళనాడులో రియల్ వ్యాపారులతో చేతు లు కలిపి ఇక్కడి గ్రావెల్‌ను తీసుకెళ్లి అక్కడ అక్రమంగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. రాత్రి పూట గుట్టలో హిటాచీలు, జేసీబీలతో తోడేస్తున్నారు. గోపిశెట్టి పల్లె ఎస్సీ కాలనీలోని రైతులకు చెందిన పట్టా భూముల్లోని గ్రావెల్‌ను కూడా తవ్వేస్తున్నారు. ఒక్క కార్వేటినగరంలోనే గాక శ్రీరంగరాజపురం, పాలసముద్రం, గంగాధర నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం మండలాల్లో కొందరు అధికా ర పార్టీ నేతలు షాడో ఎమ్మెల్యే అవతారమెత్తి అక్రమ రవాణాకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అధికారుల కనుసన్నల్లోనే..?
కూటమి నేతలు చేస్తున్న అక్రమాలకు అధికారులు వంత పాడుతున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కనికాపురం గుట్టలో రెండు వేలకు పైగా ట్రాక్టర్లలో గ్రావెల్‌ను తరలించేశారు. సమాచారం ఇచ్చే వారిపై అక్రమార్కులను ఉసిగొల్పి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కనికాపురం గుట్టలో సుమారు 20 ఎకరాల్లో మట్టిని తోడేశారు. కూటమి నేతల ఒత్తిడితోనే ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. మామూళ్ల మత్తులో అధికారులు జోగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఇక్కడ నుంచి మట్టి, గ్రావెల్, ఇసుక, కంకర వేల టన్నులు కొద్దీ తరలించి సొమ్ము చేసుకుంటున్నా అధికారులు ఏం చేస్తున్నారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అక్రమార్కులు చేస్తున్న అవినీతిలో అధికారుల భాగస్వామ్యం అవుతున్నారనే విమర్శలు లేకపోలేదు.
కనికాపురం గుట్టలో తవ్వకాలు
ప్రైవేటు వెంచర్లలో డంపింగ్ చేసిన గ్రావెల్
అక్రమ రవాణాతో ఆందోళన
కనికాపురం గుట్ట నుంచి నిత్యం గ్రావెల్‌తో రవాణా చేస్తున్న వాహనాలతో స్థానిక ప్రజలు భీతిల్లిపోతున్నారు. వాహనాల రాకపోకలతో రోడ్లు ఛిద్రమైపోతున్నాయని స్థానికులు అంటున్నారు. పరిమితికి మంచి రవాణా చేస్తుండడంతో సమీప ప్రాంతాలు కాలుష్యం బారిన పడి అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న ప్రాంతాలు దుమ్ము దూళితో పేరుకుపోయి అనారోగ్యానికి గురవుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గంగాధర నెల్లూరులో అక్రమ మైనింగ్ అడ్డాగా మారినా జిల్లా స్థాయి అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అక్రమ తవ్వకాలు ఇలాగే జరిగితే వచ్చే మూడేళ్లలో ఎక్కడా కొండలు, గుట్టలు కనపడవని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


