సంక్షేమం సున్నా
ఊసేలేని ఆడబిడ్డ నిధి పథకం
నిరుద్యోగ భృతికి మంగళం
కంచికి చేరిన 50 ఏళ్లకే పింఛను
ప్రజలను ఏమారుస్తున్న కూటమి ప్రభుత్వం
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ప్రజలు
కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బడ్డెట్ అంకెల గారడీ తప్ప మరేమీ లేదని మేధావులు, విద్యావేత్తలు, ప్రజలు విమర్శిస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కనిపించడం లేదని వాపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు ఊసే లేదని చెబుతున్నారు. ముఖ్యంగా ఆడబిడ్డ నిధి కింద మహిళలకు నెలకు రూ.1500లు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల వారికి 50 ఏళ్లకే పింఛన్లు ఇస్తామని చెప్పారు. దాని గురించి పట్టించుకోలేదని, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, ఉద్యోగాల భర్తీ, కొత్త పింఛన్ల మంజూరు తదితరాల ఊసే లేదని విమర్శిస్తున్నారు. విద్యా రంగం అభివృద్ధికి నిధులు కేటాయించకుండా పీపీపీ విధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారని, తద్వారా పేద పిల్లలకు అన్యాయం చేస్తున్నారని పేర్కొంటున్నారు. రాష్ట్రాన్ని తాకట్టు పెట్టి తీసుకువస్తున్న రూ.లక్షల కోట్లు అప్పులు ఏమి చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. – చిత్తూరు కార్పొరేషన్/ కాణిపాకం/గుడిపాల/పలమనేరు/చిత్తూరు కలెక్టరేట్
నిరుద్యోగ భృతి గోవిందా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు ఇస్తామన్నారు. రెండు బడ్జెట్‌లు పూర్తయినా దాని ఊసే లేదు. ఇలా నిరుద్యోగులను మోసం చేసే మాటలు ఎందుకు చెబుతారో అర్థంకావడం లేదు. బడ్జెట్ అంతా పెద్ద డూపుగా మారిపోయింది. ఇక ఎవరైనా చంద్రబాబు మాట నమ్ముతారా. – ప్రకాష్, బైరెడ్డిపల్లి
సున్నా వడ్డీకి సున్నం పెట్టారు
గ్రూపుల్లోని మహిళలకు సున్నా వడ్డీకి రుణాలు ఇస్తామన్నారు. హామీలు ఇచ్చారు కానీ అమలు చేయడం లేదు. దీన్ని మోసం అనరా. అమలు చేసేందుకు వీలు కానప్పుడు ఎందుకు చెప్పాలి. కూటమి ప్రభుత్వంలో మహిళా గ్రూపుల్లోని సభ్యులకు ఎలాంటి ప్రయోజనం లేక అప్పులు చేసుకోవాల్సి వస్తోంది. – దేవసేన, పెద్దపంజాణి
బడ్జెట్‌లో పథకాలకు
నిధులు కేటాయించని వైనం


