జలం.. గరళం
నగరి పట్టణంలోని భూగర్భ జలాలు కలుిషి తం అయ్యాయి. నూలుకు రంగు వేసే ప్రక్రియలో విడిచిపెట్టే వ్యర్థ రసాయన నీరు పారే కాలువలకు సమీపంగా ఉన్న ప్రాంతాల్లో బోరు నుంచి వచ్చేది జలం కాదని అది ప్రజల పాలిట పాషాణం అని నీటి సరఫరా, పారిశుద్ధ్య విభాగం నిర్వహించిన తాగునీటి పరీక్షలో తేలిపోయింది. ఈ నీటిని తాగితే మంచాన పడటం ఖాయమని ఆ నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ఈ పరిణామం ప్రజలను ఒకింత ఆందోళనకు గురిచేస్తోంది. దీనిపై నేడు మహాధర్నాకు సన్నద్ధమయ్యారు.
కుశస్థలి నదిలోకి వస్తున్న రసాయ రంగునీరు
ఎరుపెక్కి పారుతున్న కుశస్థలి నది
నగరి : నగరి మున్సిపాలిటీలో పలు ప్రాంతాల్లో నీటి నాణ్యతను పరిశీలించడానికి నాలుగు ప్రాంతాల్లో మున్సిపల్ ట్యాప్‌లలో వచ్చే నీటితో పాటు మరో నాలుగు ప్రాంతాల్లో నివాసితులు వేసుకున్న బోర్లలో వచ్చే నీటిని సేకరించి పరీక్ష చేశారు. మున్సిపల్ కొళాయిల్లో వచ్చే నీరు మినహా బోర్లలో వచ్చే నీరు తాగడానికి, వంటకు, స్నానానికి కూడా వినియోగించరాదని తేలింది. మునీశ్వర ఆలయం వద్ద బోరు నీటి పరీక్షలో యురేనియం 0.10 ఎంజీ/లీ ఉంది, ఓంశక్తి ఆలయం వద్ద తీసిన నీటిలో యురేనియం 0.265 ఎంజీ/లీ ఉన్నట్లు, ఇందిరానగర్‌లో తీసిన నీటిలో యురేనియం 0.33 ఎంజీ/లీ, మాంగనీసు 0.466 ఎంజీ/లీ ఉన్నట్లు, ఆనం లలితా లే అవుట్‌లో యురేనియం 0.49 ఎంజీ/లీ, మాంగనీసు 2.316 ఎంజీ/లీ ఉన్నట్లు తేలింది. పర్యావరణ పరిరక్షణ సంస్థ సూచనల మేరకు సురక్షిత నీటిలో ఉండాల్సిన మాంగనీసు పరిమాణం 0.3 ఎంజీ/లీ, యురేనియం పరిమాణం 0.03 ఎంజీ/లీ మాత్రమే. అయితే రసాయన నీటి ప్రభావంతో నగరిలో పరిశోధించిన ప్రాంతాల్లో చూపిన మాంగనీస్ స్థాయి రెండింతల నుంచి ఏడింతల వరకు ఎక్కువగా ఉండగా, యురేనియం స్థాయి మూడింతల నుంచి పదహారింతల వరకు ఎక్కువగా ఉంది. దీంతో సుదూర ప్రాంతాల నుంచి మున్సిపల్ కొళాయిల్లో వచ్చే నీటిపైనే నగరి ప్రజలు ఆధార పడాల్సి ఉంది.
ఆగని దందా
భూగర్భ జలాలు పాడైపోయినా, మున్సిపల్ సమావేశాల్లో ఈ అంశంపై ప్రశ్నల వర్షం కురిపించినా, డైయింగ్ యూనిట్ల దందాకు మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నగరిలో డైయింగ్ యూనిట్లను అద్దెకు తీసుకున్న తమిళనాడుకు చెందిన ఈరోడు, సేలం వ్యాపారులు తమ పరిశ్రమలకు అవసరమైన నూలుకు రంగులు వేసుకొని వృథా రసాయనాలను దర్జాగా వదిలేసి వెళ్లిపోతున్నారు. ప్రతి రోజు 20 వాహనాలు నూలును తమిళనాడుకు ట్రాన్స్‌పోర్టు చేస్తోంది. భారీ డైయింగ్ యూనిట్ల నుంచి వచ్చే రసాయన నీటితో కుశస్థలి ఎరుపెక్కి పారుతోంది. అందరికీ ఆంక్షలు విధించేస్తోంది. ఒక్క చుక్క రసాయనీరు కూడా బయటకు రాదన్న అధికారుల హామీలు పారే నీటిలోనే కొట్టుకుపోయింది. కాలువల్లో పారే మురుగు నీటిలో మునిగిపోయింది. విషపూరిత రసాయనాలు కాలువల్లో పారుతుంటే మున్సిపల్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదో..! చెరువుల్లో, నదిలో పారుతుంటే ఇరిగేషన్ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడంలేదో, పర్యావరణం కాలుష్యభరితం అవుతుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్టు అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారో నగరి ప్రజలకు జవాబు తెలియని ప్రశ్నగా మిగిలిపోతోంది.
నీటి పరిశోధన నివేదిక
కాలువల్లో పారుతున్న రసాయన నీరు
నేడు మహాధర్నా
నగరి పర్యావరణ పరిరక్షణ సమితి రసాయ నీటికి వ్యతిరేకంగా పోరాడాలంటూ ప్రజలకు పిలుపునిచ్చింది. వ్యాపారం తమిళనాడులో వ్యర్థాలు నగరిలోనా అనే నినాదంతో నిరసన వ్యక్తం చేయనున్నారు. దీనిపై ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. సుమారు 20 మిషన్ డైయింగ్ యూనిట్ల వారు 10 వేల మరమగ్గ పరిశ్రమలను సాకు చూపుతూ చాపకింద నీరులా వారికి కూడా చేటుచేస్తున్నారన్నా రు. మరమగ్గ పరిశ్రమనే నేడు వారు శాసించే స్థాయికి చేరుకోవడంతో నేత పరిశ్రమను నమ్ముకున్న వారు కూడా నేడు నీటి సమస్యతో సతమతం అవుతున్నారని, ఇది ప్రభుత్వానికి చెవికెక్కేలా చెప్పి తమిళనాడు డైయింగ్ యూనిట్లను తరిమికొట్టడం, స్థానిక డైయింగ్ యూనిట్ల వారిని నివాస ప్రాంతాలకు దూరంగా తరలించడమే ధర్నా ఉద్దేశమని చెబుతున్నారు.
సమస్యలు తప్పవు
పర్యావరణ పరిరక్షణ సంస్థ తన పరిశోధనలో పేర్కొన్న నీటిలో మాంగనీసు శాతం ఎక్కువగా ఉంటే నాడీ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయి. ఈ నీటిని వేడిచేస్తే మాంగనీసు మరింత దృఢంగా మారుతుంది. వంట, స్నానానికి కూడా ఈ నీటిని వాడకూడదు. కొళాయిలు, పైపులు, షింక్‌లపై ఉప్పులాంటి పదార్థం పేరుకుపోయి నలుపు, గోధుమ రంగు మరకలు ఏర్పరుస్తుంది. వస్తువులు త్వరగా పాడైపోతాయి. యురేనియం శాతం ఎక్కువగా ఉంటే కిడ్నీ సంబంధిత వ్యాధులు, క్యాన్సర్, ఎముకల సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు వచ్చేందుకు అధికంగా ఆస్కారం ఉంది. చిన్న పిల్లలకు ఈ నీటిని అస్సలు వినియోగించకూడదు.
జలం.. గరళం
జలం.. గరళం


