బడులపై ఇన్‌చార్జుల పెత్తనం
జిల్లాలో పదో తరగతికి వంద రోజుల ప్రణాళిక అమలు
మానిటరింగ్‌నకు ఇన్‌చార్జీల ఏర్పాటు
ఇతర శాఖల్లో పనిచేసే వారికి అదనపు బాధ్యతలు
సంబంధం లేని వ్యక్తుల నియామకంపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత
కార్వేటినగరం : రాష్ట్ర ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో గందరగోళం ఏర్పడుతోంది. ఎప్పుడెలాంటి ఆదేశాలు జారీ చేస్తారో ఎవరికి అంతుచిక్కని పరిస్థితి నెలకొంటోంది. ఇప్పటికే రక రకా ల యాప్‌ల నమోదుతో హెచ్‌ఎంలు, ఉపాధ్యాయు లు తలలు పట్టుకుంటుండగా తాజాగా ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో వందరోజుల ప్రణాళికను విధిగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. శని, ఆదివారాలతో పాటు ప్రభుత్వ సెలవుల్లోనూ తరగతులు నిర్వహించాలని పేర్కొనడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మరో ౖవైపు జిల్లాలోని 62 మండలాలకు ఒకరు చొప్పున ఇన్‌చార్జిలను నియమించారు. విద్యాశాఖతో సంబంధం లేని ఇతర శాఖల ఉద్యోగులు, అధికారులను ఇన్‌చార్జులుగా నియమించడంపై టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరు వారంలో రెండు రోజులు ఆయా పాఠశాలలకు వెళ్లి తనిఖీలి చేయాల్సి ఉంటుంది.
పదో తరగతి సంబంధించి అమలు చేస్తున్న వందరోజుల ప్రణాళిక గందరగోళానికి దారి తీస్తోంది. విద్యాశాఖలో సంబంధం లేని వ్యక్తుల నియామకం అగ్గి రాజేస్తోంది. ఈ ప్రక్రియ మొత్తం ఇన్‌చార్జిల కనుసన్నల్లో జరగనుంది. ప్రత్యేక తరగతుల నిర్వహణ మొదలు స్లిప్ టెస్టులు, మార్కుల నమోదు. రిజిస్టర్ నిర్వహణ, ఉపాధ్యాయుల హాజరు ఇలా అన్నింటినీ పబ్లిక్ పరీక్షల ప్రారంభం వరకూ ఇన్‌చార్జిలే పర్యవేక్షించనున్నారు.
ఇతర శాఖ అధికారుల పర్యవేక్షణ
రెవెన్యూ, పంచాయతీరాజ్,డ్వామా, వైద్య, ఎంపీడీఓ ఆర్‌డబ్ల్యూ ఎస్.వ్యవసాయ, ఇరిగేషన్, హౌసింగ్, మున్సిపల్ కమిషనర్, వెటర్నరీ తదితర శాఖల్లో పని చేస్తున్న వీరంతా వారి మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు వెళ్లి పదో తరగతిలో ప్రణాళిక అమలు అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. స్లిప్ టెస్టులు, ఉపాధ్యా యుల హాజరు, పదిలో షైనింగ్, రైజింగ్ స్టార్లుగా విభజించి పాఠాలు బోధిస్తున్నారనే అంశాన్ని రోజూ పర్యవేక్షించాలి. ఉపాధ్యాయులు హాజరు నమోదు సబ్జెక్టు టీచరు వస్తున్నారా, ఆదివారా లు, ఇతర సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తున్నారనే అంశాన్ని మానిటర్ చేయాల్సి ఉంది.
టీచర్ల మండిపాటు
బడుల పర్యవేక్షణకు ఇతర శాఖల అధికారులను నియమించడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. వాస్త వానికి ప్రతి మండలానికి ఏంఈవో 1,2, ఉన్నారు. వీరితో పాటు డీవైఈవోలు, ప్రతి పాఠశాలకు హెచ్‌ఎం ఉన్నారు. ప్రణాళిక అమలు పర్యవేక్షణకు వీరున్నప్పుడు ఇతర శాఖల అధికారులను ఇన్‌చార్జిలుగా నియమించడమేమిట ని పలువురు ప్రశ్నిస్తున్నారు. వీరిని అపాయింట్ మెంట్ చేయడం తమను అవమానించడమే నని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాల నిర్వహణ, రికార్డులు పది సిలబస్‌పై వీరికి ఏ మేర కు అవగాహన ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఈ నూరు రోజుల పాటు సదరు ఇన్‌చార్జిలు తమ శాఖలో జరిగే పనులు మాని దీన్ని పర్యవేక్షిస్తారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
జిల్లాలో ఇలా...?
జిల్లాలో 380 ప్రభుత్వ యాజమాన్య ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఇందులో సుమారు 36 వేల మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి నిర్వహించనున్నారు. ఈ తరుణంలో డిసెంబరు 6వ తేదీ నుంచి వంద రోజుల ప్రణాళికను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది.
అనాలోచిత నిర్ణయం
వంద రోజుల ప్రోగ్రామ్ ఉపాధ్యాయులు విద్యార్థులను ఒత్తిడికి గురిచేస్తోంది. కార్యక్రమ పర్యవేక్షణకు ఎంఈవో , డీవైఈవోలను నియమించాలి. ఇన్‌చార్జిల కంటే విద్యాశాఖ అధికారులు అయితే మంచి ఫలితాలు ఉంటాయి. వంద రోజుల ప్రణాళిక ప్రశ్నపత్రాలను అప్లోడ్ చేయకపోవడం వల్ల కొంత మంది ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం దారుణం. ఈ విషయంలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అనాలోచితంగా ఉంది. – సుదర్శన్‌రాజు, ఏపీటీఎఫ్ 1938 మాజీ మండల అధ్యక్షుడు,
శ్రీరంగరాజపురం మండలం
ఇతర శాఖల అధికారులతో తనిఖీలు సరికాదు
పదో తరగతి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించడానికి విధ్యాశాఖ చేపట్టిన వందరోజుల కార్యాచరణ ప్రణాళిక ఏ విధంగా జరుగుతోందో పర్యవేక్షించడానికి విద్యాశాఖకు ఏ మాత్రం సంబంధం లేని ఇతర శాఖలకు చెందిన అధికారులను నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయం సరైంది కాదు. దీనివల్ల ఉపాధ్యాయుల ఆత్మాభిమానం దెబ్బతింటుంది. – దేవయ్య,
ఎస్టీయూ మాజీ జిల్లా నేత , పాలసముద్రం మండలం
బడులపై ఇన్‌చార్జుల పెత్తనం
బడులపై ఇన్‌చార్జుల పెత్తనం


