నేడు డయల్ యువర్ ఎస్‌ఈ
చిత్తూరు కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్ తెలిపారు. సమస్యలపై వినియోగదారులు ఉదయం 8.30–9.30 గంటల మధ్య 7993147979 నంబర్‌కు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
లడ్డూ పోటు తనిఖీ
కాణిపాకం : లడ్డూలో నాణ్యత ఉండాలని..లోటు కనిపిస్తే చర్యలు తప్పవని ఈవో పెంచల కిషోర్ హెచ్చరించారు. కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థాన లడ్డూ పోటును ఆదివారం తనిఖీ చేశారు. లడ్డూ తయారీని క్షుణంగా పరిశీలించారు. ఈవో మాట్లాడుతూ లడ్డూ రుచిని మరింత పెంచేలా..తయారీలో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నామన్నారు. కార్యక్రమంలో చైర్మన్ మణినాయుడు, సిబ్బంది ఉన్నారు.
నేడు ఇంటర్ తత్కాల్‌లో ఫీజు చెల్లింపునకు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని ఇంటర్మీడియెట్ విద్యార్థులు ఈనెల 5వ తేదీ లోగా ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజును తత్కాల్ పద్ధతిలో చెల్లించవచ్చని జిల్లా ఇంటర్మీడియెట్ డీఐఈవో రఘుపతి తెలిపారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తత్కాల్ విధానంలో ఫీజు చెల్లించేందుకు ఆఖరి అవకాశం కల్పించారన్నారు. తత్కాల్‌లో రూ.5 వేల అపరాధ రుసుంతో ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారని తెలిపారు. ఇప్పటి వరకు ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.


