సంక్రాంతికి ‘ప్రైవేటు’ బాదుడు!
దోపిడీకి ప్రైవేటు ట్రావెల్స్ సర్వం సిద్ధం అప్పుడే పండుగ బుకింగ్ మొదలు పెరిగిన టిక్కెట్ ధరలు హైదరాబాద్ నుంచి వచ్చే బస్సులకు ఫుల్ డిమాండ్ ఊరొచ్చేవారు బెంబేలు
పండుగ బాదుడుకు ప్రైవేట్ ఆపరేటర్లు సిద్ధమయ్యారు. అప్పుడే సంక్రాంతి బుకింగ్‌లు ఫుల్ అవుతున్నాయి. రైల్వే టిక్కెట్ల వెయింటిగ్ లిస్టు చాంతాడంత ఉండడం... హైదరాబాద్, బెంగుళూరు నుంచి వచ్చి వెళ్లే సమయంలో ఆర్టీసీ బస్సు టిక్కెట్లు ఇప్పటికే కొనుగోలు పూర్తి కావడంతో ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు టిక్కెట్ ధరలను రెండు, మూడు రెట్లు పెంచేశారు. దీంతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లేవారికి పండుగ రోజుల్లో ఇళ్ల వద్ద అయ్యే వ్యయం కన్నా ప్రయాణానికే అయ్యే ఖర్చు అధికం కానుంది.
కాణిపాకం : జిల్లా నుంచి బెంగళూరు, హైదరాబాద్, చైన్నె, విజయవాడ ప్రాంతాల్లో స్థిరపడ్డ వా రు చాలా మంది ఉన్నారు. అలాగే ఉద్యోగం, ఉపాధి, ఉన్నత చదువుల కోసం లక్షల మంది వెళ్లారు. వీరు రాకపోకలు అప్పడప్పుడు సర్వసాధారణంగా కనిపిస్తోంది. అయితే పండగకు ఊర్లోకి రావడం సమ్‌థింగ్ స్పెషల్‌గా భావిస్తున్నారు. అందులోనూ సంక్రాంతి పండగకు పల్లెకొస్తే ఉత్సాహంగా గడపవచ్చునని అనుకుంటుంటారు. ఈక్రమంలో కొంత మంది కార్లలో పల్లెకు వస్తుంటారు. అయితే మధ్య తరగతి, పేద వర్గాలకు చెందిన వారు రైలు, ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తారు.
శుక్రవారం నుంచే సొంతూళ్లకు..
ఈనెల 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఇక ఈనెల 14వ తేదీ బుధవారం భోగి పండుగ వచ్చింది. అయితే తొమ్మిదో తేదీ రెండవ శనివారం కావడంతో చాలా మంది శుక్రవారం రాత్రి బయలుదేరనున్నారు. రెండవ శనివారం, తరువాత ఆదివారం సెలవు కావడంతో సోమ, మంగళవారాలు సెలవులు పెట్టుకుంటే తిరి గి 17వ తేదీ శనివారం, 18వ తేదీ ఆదివారం తిరిగి వలస ప్రాంతాలకు వెళ్లనున్నారు. 18వ తేదీ అమావాస్య కావడంతో చాలామంది 17వ తేదీన తిరిగి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
బెంగళూరు నుంచి రూ.5 వేలు
బెంగళూరు నుంచి చిత్తూరుకు సాధారణ రోజుల్లో నాన్‌ఏసీలో సీటర్ రూ.280 నుంచి రూ.350 వరకు ఉంటుంది. అదే ఏసీ సీటర్ అయితే రూ.500 వరకు ఛార్జ్ చేస్తారు. ఏసీ స్లీపర్ అయితే రూ. 500 నుంచి రూ.1000 వరకు ఉంటుంది. పండగ బాదుడు నేపథ్యంలో ఒక్కసారిగా చిత్తూరు రావడానికి ప్రైవేటు బస్సు చార్జీలు ఆకాశనంటుతున్నాయి. అప్పుడే ఆన్‌లైన్‌లో టిక్కెట్లు బుకింగ్ ఫుల్ కావడంతో ప్రైవేటు బస్సు నిర్వాహకులు భారీగా దోపిడీకి స్కెచ్ వేశారు. శుక్రవారం రాత్రి నుంచి ధరలు అమలులోకి పెట్టేశారు. ఈ నేపథ్యంలో నాన్‌ఏసీ ధరలు రూ. 500 నుంచి రూ.1500 పలుకుతున్నాయి. ఏసీ ధరలు రూ. 1500 నుంచి రూ.5 వేలు కనిపిస్తున్నా యి. ఈ టిక్కెట్ ధరలు చూసి చాలా మంది పెద్ద పండుగకు పల్లెకు వద్దని వాయిదా వేసుకుంటున్నారు.
పట్టని నియంత్రణ
ప్రైవేట్ ఆపరేటర్ల దోపిడీపై చంద్రబాబు ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఆపరేటర్లలో ఆ పార్టీకి చెందిన సానుభూతి పరులు, ప్రధాన నేతలు ఉండడంతో చూసీచూడనట్టుగా వదిలేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక పండుగ సమయంలో దొడ్డిదారిన బస్సులు నడిపేందుకు సైతం ప్రైవేట్ ఆపరేటర్లు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. డిమాండ్ లేని ప్రాంతాలకు బస్సు సర్వీసులు నిలుపుదల చేసి డిమాండ్ ఉన్న సర్వీసులో తిప్పనున్నారు. ఇక పండగ సమయంలో చూసీచూడనట్లు వదిలేసే అవకాశం ఉండడంతో ప్రైవేట్ ఆపరేటర్లు ఇష్టానుసారంగా బస్సులు తిప్పనున్నారు.
ఇష్టానుసారంగా పెంచేసి..
ఏపీఎస్ ఆర్టీసీ ఏసీ, నాన్‌ఏసీ బస్సులు అనే తేడా లేకుండా టిక్కెట్లు అయిపోవడంతో చాలామంది ప్రైవేట్ బస్సుల వైపు చూస్తున్నారు. ఇదే అదనుగా ప్రైవేట్ ఆపరేటర్లు బస్సు టిక్కెట్ ధరలు అమాంతంగా పెంచేశారు. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ బస్సు టిక్కెట్ ధరలు 9వ తేదీ నుంచి 13వ తేదీ వరకు టిక్కెట్ ధరలు రెండు..మూడు రెట్లు పెరిగాయి. అన్ సీజన్‌లో నాన్ ఏసీ సిటింగ్ రూ. 620 నుంచి రూ.800 వరకు ఉంది. ఇప్పుడు నాన్ ఏసీ స్లీపర్ టిక్కెట్ ధర రూ.800 నుంచి రూ.1200 వరకు పలుకుతోంది. ఇక ఏసీ బస్సు సిటింగ్ ధర రూ. 620 నుంచి రూ.1000 వరకు ఉంది. స్లీపర్ టిక్కెట్ ధర రూ.900 రూ.1500 పలుకుతోంది. తొమ్మిదవ తేదీన అయితే ఏకంగా రూ.2,000 నుంచి రూ.5 వేలు దాటడం గమనార్హం. తిరిగి ఎక్కువ మంది వెళ్లే 18వ తేదీన నాన్ ఏసీ, ఏసీ సిటింగ్ ధర రూ. 1600 నుంచి రూ. ఽ1800 ఫిక్స్ చేశారు. ఏసీ, నాన్ ఏసీ స్లీపర్ ధరలు రూ.2 వేల నుంచి రూ.5 వేల వరకు ఉండడం గమనార్హం.
టిక్కెట్లు ఫుల్
జిల్లాకు వచ్చేవారు సికింద్రాబాద్, హైదరాబాద్ నుంచి బయలుదేరి చిత్తూరుకు వస్తారు. ఆ రోజుల్లో రెగ్యులర్‌గా నడిచే రైళ్ల వెయిటింగ్ లిస్టు భారీగా ఉంది. ప్రధాన సూపర్ ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల టిక్కెట్లు వెయిటింగ్ లిస్టు పరిమితి దాటిపోవడంతో రిగ్రెట్లో పెట్టారు. పండుగ కోసం ఇటీవల ప్రకటించిన ప్రత్యేక రైళ్ల పరిస్థితి అలానే ఉంది. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఇంచుమించు ఇదే పరిస్థితి, ఇక ఆర్టీసీ బస్సులలో కూడా టిక్కెట్లు అందుబాటులో లేకుండా పోయాయి. హైదరాబాద్ నుంచి రోజూ సుమారు 8 నుంచి 10 రెగ్యులర్ బస్సులున్నాయి. వీటిలో తొమ్మిదో తేదీ ఉదయం నడిచే బస్సులకు తప్ప మిగిలిన బస్సుల టిక్కెట్లు పూర్తవుతున్నాయి. 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకు ఉదయం, రాత్రి సర్వీసులు బస్సులు టిక్కెట్లు ఫుల్ అవుతున్నాయి. జిల్లాలో చిత్తూరు, కుప్పం, పలమనేరు, పుంగనూరు డిపోల బస్సుల పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే విధంగా ఉంది.
సంక్రాంతికి ‘ప్రైవేటు’ బాదుడు!


