చట్టాన్ని అతిక్రమించే పనులొద్దు
చిత్తూరు అర్బన్ : నూతన సంవత్సర వేడుకల్లో ప్రజలు, యువత చట్టాన్ని అతిక్రమించే చర్యలకు దూరంగా ఉండాలని ట్రాఫిక్ సీఐ లక్ష్మీనారాయణ అన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఏడాదీ నూతన సంవత్సరం అర్ధరాత్రి ఆనందోత్సవాల్లో కొంతమంది నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయన్నారు. అందరూ బాధ్యతతో వ్యవహరిస్తేనే కుటుంబాలు సురక్షితంగా, సమాజం ప్రశాంతంగా ఉంటుందన్నారు. 31వ తేదీ రాత్రి వేడుకల పేరుతో బైకులపై తిరుగుతూ గోల చేయడం చట్టానికి వ్యతిరేకమన్నారు. అలాంటి వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవన్నారు.
వీడియో రికార్డింగ్‌కు వినతి
శాంతిపురం: కుప్పం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ కోసం భూ సేకరణలో భాగంగా బుధవారం జరగనున్న పబ్లిక్ హియరింగ్ ప్రక్రియను పూర్తిగా వీడియో తీయాలని బాధిత రైతులు కోరారు. ఈ మేరకు మంగళవారం కుప్పం ఆర్డీవో, శాంతిపురం తహసీల్దార్లకు వారు వినతి పత్రాలను అందించారు. కలెక్టర్ ఆధ్వర్యంలో జరగనున్న బహిరంగ విచారణలో రైతుల అభిప్రాయాలు, అధికారుల ప్రకటనలు, ప్రసంగాలను వీడియో రికార్డింగ్ చేసి, మొత్తం వీడియో కాపీని తమకు కూడా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భూ సేకరణకు కొందరు రైతులు ససేమిర అంటూ హై కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో అధికారులు నేడు మరో విడత బహిరంగ విచారణ నిర్వహించనుండడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


