భూలోక వైకుంఠం!
సకల పాపహరణం.. వైకుంఠ ద్వార దర్శనం ప్రత్యేక ఆకర్షణగా ఆనంద నిలయం, గరుడ ద్వారం 85 వేల మందికిపైగా వైకుంఠ ద్వార ప్రవేశం భక్తులకు సేవలందించిన చెవిరెడ్డి కుటుంబీకులు
తిరుపతి రూరల్: తుమ్మలగుంటలో వెలసిన శ్రీ కల్యా ణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని వైభవంగా నిర్వహించారు. మంగళవారం తెల్లవారు జాము 4 గంటల నుంచే వైకుంఠ ద్వార ప్రవేశానికి భక్తులు పోటెత్తారు. ఎప్పటిలాగే ఆలయంలో ఆగమోక్తంగా పూజలు నిర్వహించారు. ఆ తరువాత వైకుంఠ ద్వారాలకు పూజచేసి తలుపులు తెరిచారు. అనంతరం ఆలయ నిర్వాహకులతో పాటు అర్చకులు, వేద పండితులు ముందుగా వైకుంఠ ద్వార ప్రవేశం చేయగా ఆ తర్వాత సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు.
తిరుమల వెళ్లలేక.. తుమ్మలగుంటకు
తిరుమల వెళ్లి స్వామిని దర్శించలేని భక్తులందరూ తుమ్మలగుంట చేరుకున్నారు. ఆ తర్వాత వైకుంఠ ద్వార ప్రవేశం చేసి గోవింద నామస్మరణలతో భక్తితత్వం పంచుకున్నారు. ఆలయ వ్యవస్థాపక అధ్యక్షుడు చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి అక్రమ నిర్బంధంలో ఉన్నప్పటికీ ఆయన కుటుంబీకులు ఆయం వద్ద భక్తుల హృదయాలను హత్తుకునేలా భారీ సెట్టింగ్‌లు ఏర్పాటు చేశారు. పుష్పాలంకరణ విశేషంగా ఆకట్టుకుంది. ఆలయంతో పాటు వైకుంఠ ద్వారాన్ని సుంగదభరిత పుష్పాలు, పరిమళ భరిత పత్రాలతో అలంకరించారు. దర్శనానికి వచ్చే భక్తులు ముందుగా బ్రహ్మోత్సవాల్లో స్వామి వారు అధిరోహించే సప్త వాహనాలను దర్శించుకుని ఆపై సప్తద్వారాల గుండా ఆనంద నిలయం కింద ఆలయం వద్దకు చేరుకునేలా ఏర్పాట్లు చేశారు. దీనిపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తెరుచుకున్న సప్త ద్వారాలు
భక్తులు రాగానే ఆలయానికి అతి సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సప్త ద్వారాలు తెరుచుకున్నాయి. అర్చక స్వాములు సప్త ద్వారాలు, ఆనంద నిలయం, గరుడ ద్వారానికి పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చే భక్తులందరూ అక్కడ ఏర్పాటు చేసిన సప్తద్వారాలు, ఆనంద నిలయం, గరుడ ద్వారాలను చూసి ఆశ్చర్యపోయారు.
85 వేల మందికిపైగా దర్శనం
తిరుమల వెళ్లడానికి స్థానికులకు టోకెన్లు ఇవ్వకపోవడంతో అత్యధిక శాతం మంది భక్తులు తుమ్మలగుంట కు చేరుకున్నారు. తెల్లవారు జామున 4 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు సర్వదర్శనం కల్పించడంతో సుమారు 85 వేల మందికిపైగా భక్తులు స్వామి వారిని దర్శించి వైకుంఠ ద్వారంలో ప్రవేశించారు. వీఐపీల దర్శన సమయంలో కూడా సాధారణ భక్తులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
తుమ్మలగుంటకు పోటెత్తిన భక్తులు
సామాన్య భక్తులకు పెద్ద పీట
తిరుమల తరహాలో ఆగమశాస్త్రం ప్రకారం వైకుంఠ ద్వారానికి పూజలు చేసి ప్రారంభించారు. అంతకుముందు స్వామి వారి మూలమూర్తికి అభిషేకం, ప్రత్యేక అలంకరణ, అర్చన వంటి దైనందిన పూజా కార్యక్రమాలు పూర్తిచేశారు. అనంతరం భక్తులను వైకుంఠ ద్వార ప్రవేశానికి అనుమతించారు. క్యూల్లోకి వచ్చిన భక్తులకు ఒక గంటలో స్వామి దర్శనం కలిగించేలా చర్యలు తీసుకున్నారు. భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నప్పటికీ క్యూల్లో ఎక్కడా నిలబడే అవకాశం లేకుండా చేసి, దర్శనం కల్పించారు.
భూలోక వైకుంఠం!
భూలోక వైకుంఠం!
భూలోక వైకుంఠం!


