ఏటా పెరుగుతున్న ‘క్రైమ్’
●
చిత్తూరు అర్బన్: చిత్తూరు జిల్లా.. మూడు రాష్ట్రాలకు సరిహద్దు. చిన్నపాటి చైన్ స్నాచింగ్ కేసుల్లో కూడా నిందితులు పక్క రాష్ట్రాల వాళ్లే. నేరం పూర్తయిన వెంటనే నిముషాల్లో రాష్ట్ర సరిహద్దు దాటేయొచ్చు. నేరస్తులను పట్టుకోవడం, చోరీకి గురైన సొమ్ము రికవరీ, సైబర్ వలలో వేల కి.మీ ప్రయాణం.. ఇన్ని చేసినా ప్రతీ రోజూ నేరస్తులు జిల్లా పోలీసులకు సరికొత్త సవాళ్లను విసురుతూనే ఉన్నారు. మానవ తప్పిదాలతో జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ ఏడాది పోలీసుశాఖ విడుదల చేసిన వార్షిక నేర సంక్షిప్త నివేదికలో కొన్ని గణాంకాలు ఆశ్చర్య పరస్తుంటే.. మరికొన్ని పర్వాలేదనిపిస్తున్నాయి. సామాన్య ప్రజల ప్రశాంత జీవనమే పోలీసు ప్రధాన కర్తవ్యమని ఎస్పీ డూడీ చెబుతున్నారు. మంగళవారం చిత్తూరులోని పోలీసు అతిథిగృహంలో చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ 2025 పోలీసుశాఖ పనితీరు తెలిపే నివేదికను మీడియాకు వివరించారు.
సంచలనాలు
2015లో జరిగిన చిత్తూరు మాజీ మేయర్ అనురాధ, ఆమె భర్త కటారి మోహన్ జంట హత్యల కేసులో ప్రధాన నిందితుడు చింటూతో సహా ఐదుగురికి చిత్తూరు కోర్టు ఉరిశిక్ష విధించడం రాష్ట్రంలోనే సంచనాత్మక తీర్పుగా మారింది. ఇక చిన్నపిల్లలపై లైంగిక దాడుల ఘటనల్లో వేర్వేరు కేసుల్లో ఐదుగురికి 20 ఏళ్ల జైలుశిక్ష కూడా పడింది. చిత్తూరు నగర శివారుల్లో ఓ మైనర్ బాలికపై ముగ్గురు కామాంధులు గ్యాంగ్‌రేప్ చేయడం, ఒడిశా నుంచి కుప్పంకు గంజాయి దిగుమతి చేయడం, రూ.80 వేలు అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి కొట్టడం లాంటి ఘటనలు రాష్ట్రంలోనే చర్చనీయాంశమయ్యాయి. చైన్‌స్నాచింగ్ చేస్తూ పూతలపట్టులో మహిళ మృతికి కారణమైన హేమచంద్ర, సురేష్, మస్తాన్‌ను పోలీసులు అరెస్టు చేయడం, వి.కోటలో దారిదోపిడీ చేస్తున్న జయపాల్‌ను అరెస్టు చేసి రూ.3.2 కోట్ల విలువ చేసే బంగారు బిస్కెట్లు సీజ్ చేయడం, గుడిపాలలో యువతులను బెదిరించి లైంగిక దాడులు చేసిన కేసులో జాన్ అలెక్స్‌ను పట్టుకోవడం కూడా జిల్లా పోలీసులకే సాధ్యం.
పెరిగిన నేరాలు
నేరం 2024 2025
రోడ్డు ప్రమాదాలు 748 771
మృతులు 402 381
పోక్సో 46 56
మాదకద్రవ్యాలు 49 50
హత్యలు, గొడవలు 857 859
చోరీలు 476 426
ఛేదించినవి 236 207
చోరీకి గురైన సొమ్ము రూ.6.20 కోట్లు రూ.11.52 కోట్లు
రికవరీ రూ.2.95 కోట్లు రూ.8.39 కోట్లు
సామాన్యులకు అండగా..
గతేడాది మొత్తం 7,034 కేసులు రిపోర్టయితే, ఈ సారి 5,216 నమోదయ్యాయి. దాదాపు 26 శాతం క్రైమ్ రేట్ తగ్గించగలిగాం. రోడ్డు ప్రమాదాల్లో సాంకేతిక తప్పిదాలను సరిచేయడానికి కలెక్టర్‌తో మాట్లాడుతున్నాం. కొత్త ఏడాదిలో ‘ధైర్యస్పర్శ’ పేరిట ప్రజలు భయపడే కొన్ని ప్రాంతాలను మారుస్తున్నాం. మహిళా భద్రత, పిల్లలపై నేరాల నియంత్రణపై దృష్టి పెడుతున్నాం. గంజాయి, లాటరీ, పేకాటను ఏమాత్రం ఉపేక్షించం. ప్రజలు సహకరించాలి. – తుషార్ డూడీ, ఎస్పీ, చిత్తూరు.
తగ్గిన నేరాలు
నేరం 2024 2025
మహిళలపై 507 443
చోరీలు 124 88
మోసాలు 194 152
సైబర్ నేరాలు 30 19
ప్రాపర్టీ నేరాలు 480 466


