టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
నగరి : అడ్డూఅదుపు లేకుండా తిరుగున్న టిప్పర్లు ఒక నిండు ప్రాణాన్ని బలిగొన్నాయి. మంగళవారం మండలంలోని ఏడుగట్లు గ్రామంలో కేశవరాజకుప్పం మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తిరువళ్లూరు జిల్లా, పళ్లిపట్టు తాలుకా, గొల్లాల కుప్పంకు చెందిన చెంచుగాన్ (29) మృతిచెందాడు. మృతిని బంధువులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చెంచుగాన్ తమిళనాడు పొన్‌పాడిలోని ప్రైవేటు కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య చాముండేశ్వరి తిరుపతిలోని ప్రైవేటు వైద్యశాలలో నర్సుగా పనిచేస్తూ అక్కడే ఉంటోంది. నూతన సంవత్సర వేడుకలను భార్యతో కలిసి జరుపుకునేందుకు అవసరమైన సరంజామా తీసుకుని మంగళవారం పని ముగించుకొని అక్కడి నుంచి తిరుపతికి వెళుతున్నట్లు తల్లికి చెప్పి వచ్చాడు. అయితే మార్గ మధ్యంలోనే అతనిని మృత్యువు టిప్పర్ రూపంలో బలిగొంది. కేశవరాజకుప్పం మలుపు వద్ద టిప్పర్ వెనుక నుంచి బైక్‌ను ఢీకొట్టడంతో చెంచుగాన్ అక్కడికక్కడే మృతిచెందాడు. టిప్పర్ వదలిపెట్టి డ్రైవర్ పరారయ్యాడు. కాగా చెంచుగాన్‌కు పిల్లలు లేరు. తల్లిదండ్రులకు చెంచుగాన్ ఒక్కగానొక్క కుమారుడు, కుటుంబానికి అతనే ఆధారం.
కన్నీరు పెట్టించిన తల్లిదండ్రుల ఆక్రందన
తల్లితండ్రులు తన కుమారుడి మృతదేహాన్ని చూసి పెట్టిన ఆక్రందన అందరినీ కలచివేసింది. టిప్పర్ వదలిపెట్టి డ్రైవర్ పరారు కావడం.. ఎవరూ వచ్చి సమాధానం చెప్పకపోవడంతో మృతుని బంధువులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తమకు న్యాయం జరిగేవరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ భీష్మించుకున్నారు.
మృతదేహాన్ని చూసి బోరున విలపిస్తున్న
తల్లిదండ్రులు, (ఇన్‌సెట్) చెంచుగాన్ (ఫైల్)
టిప్పర్లకు అడ్డుకట్ట ఏదీ
జాతీయ రహదారి, రైల్వే పనులంటూ విచ్చలవిడిగా గ్రావెల్ తరలిస్తున్న టిప్పర్లతో గ్రామీణ రోడ్లు రద్దీగా మారాయి. వీటికి అధికారులు అడ్డుకట్ట వేయలేకపోతున్నారని ‘గ్రామీణ రోడ్లు.. నరకానికి నకళ్లు’ అన్న కథనంతో సాక్షి దినపత్రికలో కథనం కూడా ప్రచురితమైంది. అయినా అధికారులు గానీ, గ్రావెల్ కాంట్రాక్టర్లు గానీ ఈ మార్గాన్ని బాగుచేయడానికి ఎలాంటి చొరవ చూపలేదు. టిప్పర్లను అదుపు చేయలేదు. ఫలితంగా నేడు ఒక యువకుడు ప్రాణం బలైపోయింది.
టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
టిప్పర్ ఢీకొని యువకుడి మృతి
టిప్పర్ ఢీకొని యువకుడి మృతి


