అధికార మదంతో పచ్చనేతల దౌర్జన్యం
సాక్షి టాస్క్‌ఫోర్స్: తమ పార్టీ అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చా.. తమది కాని భూమిని కబ్జా చేయొచ్చా.. ఎంతవరకు న్యాయం..కబ్జాకు గురవుతున్న భూమిని కాపాడుకునే ప్రయత్నంలో బాధితులపైనే విచక్షణా రహితంగా కూటమి నేతలు దాడులకు తెగబడ్డారు. ఈ ఘటన గంగవరం మండలంలోని జరావారిపల్లి గ్రామంలో శనివారం వెలుగుచూసింది. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా.. కీలపట్ల పంచాయతీ జరావారిపల్లి గ్రామానికి చెందిన లేట్ వెంకటస్వామి పేరిట గత 1981వ సంవత్సరంలో సర్వే నెంబర్ 550/4లో విస్తీర్ణం 2.02 ఎకరాల భూమి రెవెన్యూ లెక్కల్లో నమోదై ఉంది. దీనికి సంబంధించిన పట్టా కూడా వెంకటస్వామి కుటుంబీకుల దగ్గర ఉందని చెబుతున్నారు. గత 1998వ సంవత్సరంలో వెంకటస్వామి మరణించడంతో అనువంశికంగా వచ్చే డీకేటీ భూమిని వెంకటస్వామి కుమారుడు చెంగల్‌రాయులు సాగు చేసుకుంటున్నాడు. అయితే ఆ భూమి తన తండ్రి పేరిటే రికార్డులో ఉంది తప్ప ఇన్నేళ్లు గడుస్తున్నా చెంగల్‌రాయులు పేరుపైకి పట్టా మార్చుకోలేదు. చెంగల్‌రాయులు కుటుంబీకులకు అనాదిగా వస్తున్న భూమిపై ఇదే పంచాయతీ గాంధీనగర్ గ్రామానికి చెందిన రెడ్డిశేఖర్ కన్ను పడింది. తమ భూమి ఆనుకునే ఈ భూమి కూడా ఉండటంతో భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని నిర్ణయించుకున్నాడు. గత ఐదేళ్ల కిందట భూమి తమదంటూ చెంగల్‌రాయులు కుటుంబీకులతో గొడవలు పడిన రెడ్డిశేఖర్ కుటుంబీకులు తీవ్రంగా గాయపరిచారు. అప్పట్లో బాధితులు పలమనేరు కోర్టును ఆశ్రయించగా బాధితులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు ఉత్తర్వుల మేరకు రెవెన్యూ, పోలీసుల సమక్షంలో భూమిని సర్వే చేసి భూమిని శాశ్వతంగా చెంగల్‌రాయులు కుటుంబీకులకు అప్పగించారు. ఆ తరువాత భూమిలో మామిడి మొక్కలు నాటుకున్నారు. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉండటంతో భూమిని మళ్లీ ఎలాగైనా కబ్జా చేయాల్సిందేనంటూ రెడ్డిశేఖర్ కంకణం కట్టుకున్నాడు. బాధితులను బెదిరింపులకు గురి చేసి భూమిలో ఉన్న మామిడి చెట్లను జేసీబీతో తొలగించాడు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా అంతలోనే పోలీస్ స్టేషన్‌కు వచ్చిన రెడ్డిశేఖర్ ప్రభుత్వం మాది , మీరు పట్టించుకోవద్దు అంటూ పోలీసులను సైతం తమ ఎదుటే హెచ్చరించినట్టు బాధితులు తెలిపారు. రెవెన్యూ అధికారులు మాత్రం తమ సమస్య గురించి ఏమాత్రం పట్టించుకోలేదంటూ వాపోయారు. అధికారులెవరు తమ సమస్యను పట్టించుకోకపోవడంతో భూమి వద్ద మామిడిచెట్ల తొలగింపును అడ్డుకునే ప్రయత్నం చేసిన బాధితులు చెంగల్‌రాయులు, భూలక్ష్మి, సురేష్ ముగ్గురిపై రెడ్డిశేఖర్ కుటుంబీకులు విచక్షణారహితంగా రాళ్లు, కర్రలతో దాడి చేసి గాయాలపాలు చేశారని తెలిపారు. దాడిలో గాయపడిన బాధితులు పలమనేరు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ భూమిని టీడీపీ నాయకుడు రెడ్డిశేఖర్ కబ్జా చేసి మామిడి చెట్లను తొలగిస్తుంటే అడ్డుకున్నందుకు తీవ్రంగా కొట్టినట్టు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరారు.
గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చెంగల్‌రాయులు, కొడుకు సురేష్
అధికార మదంతో పచ్చనేతల దౌర్జన్యం
అధికార మదంతో పచ్చనేతల దౌర్జన్యం
అధికార మదంతో పచ్చనేతల దౌర్జన్యం


