జీఎస్టీ స్కాం! | - | Sakshi
Sakshi News home page

జీఎస్టీ స్కాం!

Dec 28 2025 8:23 AM | Updated on Dec 28 2025 8:23 AM

జీఎస్టీ స్కాం!

జీఎస్టీ స్కాం!

● ప్రధానమంత్రికి ఫిర్యాదు ● బయటకు వస్తున్న బాధితులు ● కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదు?

సాక్షి, టాస్క్‌ఫోర్స్‌ : చిత్తూరు కేంద్రంగా సాగుతున్న జీఎస్టీ స్కాం రోజురోజుకు మలుపులు తిరుగుతోంది. అమాయకులైన పేదల ఐడీ కార్డుతో అధికార పా ర్టీకి చెందిన ఓ నేత అక్రమార్జనే ధ్యేయంగా రూ.కోట్లా ది రూపాయలు కొల్లగొడుతున్నట్లు సమాచారం. అధికార పార్టీ అండతో అతడిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. కానీ ఎట్టకేలకు ఓ బాఽధితుడు బయటకు వచ్చాడు. నగరానికి చెందిన విజయచక్రవర్తి తనకు జరిగిన అన్యాయం పై ప్రధానమంత్రి, కేంద్ర హోంమంత్రి, ఆర్థికశాఖ మంత్రి, సీఎం, డిప్యూటీ సీఎం, ఆర్థికమంత్రి, హోంమంత్రి, వాణిజ్య పన్నులశాఖ కమిషనర్లకు తనకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేశాడు. ప్రస్తుతం ఈ వివాదం ముదురుతోంది. దీనిపై బాధితుడు కలెక్టర్‌కు సోమ వారం నేరుగా ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.

ముదురుతున్న వివాదం

నగరానికి చెందిన విజయచక్రవర్తి 2018లో మదీన స్టీల్‌ కంపెనీలో సూపర్‌వైజర్‌గా పనిచేశారు. ఆ సమయంలో వేతనం వేసేందుకు యజమాని అతడి ఆధార్‌, పాన్‌కార్డు, తదితర ఐడీ ఫ్రూప్స్‌ తీసుకున్నాడని బాధితుడు తెలిపాడు. తీరా 2019లో ప్రభుత్వ వైన్‌షాప్‌లో ఉద్యోగం రావడంతో అక్కడ పనిమానేశాడన్నారు. ఇటీవల అతడికి విడతల వారీగా మొత్తం రూ.42 లక్షలకు పైగా జీఎస్టీ చెల్లించాలని నోటీసులు వచ్చాయన్నారు. గతంలో పనిచేసిన యజమానిని సంప్రదించగా తనపై వ్యాపారం చేశానని... అధికారులు మన గుప్పెట్లో ఉన్నారని , ఏమి భయపడవద్దని సర్దిచెప్పి పంపినట్లు చెప్పాడు. సమస్య తీరకపోవడంతో తిరిగీ యజమానిని సంప్రదించగా దురుసుగా ప్రవర్తించాడన్నారు. దీంతో ప్రధానమంత్రి నుంచి వాణిజ్యపన్నులశాఖ కమిషనర్‌ వరకు మొత్తం 9 మందికి ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు.

నోటీసులు ఎక్కడ ?

ఇంత జరుగుతున్నా జీఎస్టీ అధికారులు అతడికి నోటీసులు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్న తలెత్తుతోంది. చట్ట ప్రకారం రూ.5 కోట్లు పన్ను అక్రమాలకు పాల్పడితే జీఎస్టీ అధికారులు అరెస్టు వారెంటు నోటీసులు జారీ చేయవచ్చు. కానీ ఇంత వరకు ఈ స్కాం పై ఎటువంటి నోటీసులు జారీ చేయకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశాల్లో సైతం మనీలాండరింగ్‌ చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఫిర్యాదుల పై స్పందించిన కొందరు అధికారుల పై పోలీసు కేసులు, రాజకీయ పలుకుబడితో స్కాందారుడు వేధింపులకు గురిచేసినట్లు సమాచారం. తనకు సరుకు విక్రయించని వ్యాపారుల పై దౌర్జన్యాలకు దిగడం, లారీలో వెళుతున్న లోడ్‌ను ఆపేయడం, జీఎస్టీ అధికారులు విచారణకు పిలుస్తున్నారని లోడ్‌ను తీసుకెళ్లడం వంటి జరిగాయని ఆరోపణలు ఉన్నాయి.

సమగ్ర నివేదిక

అధికారులు వీటిపై సమగ్ర రిపోర్టు సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వాటిని రాష్ట్ర అధికారులతో పాటు ఈడీ, సీబీఐ, ఎన్‌ఐఏకు పంపనున్నట్లు తెలుస్తోంది. అధికార పార్టీ అండదండలు ఉండటంతో స్కాందారుడు తప్పించుకు తిరుగుతున్నాడని అధికారుల వాదన. దీంతో కేంద్ర అధికారులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధం అయినట్లు తెలుస్తోంది.

నకిలీ కంపెనీల నుంచి రూ.118.70 కోట్లు

జిల్లాలో పలు నకిలీ కంపెనీలను సృష్టించి వాటి ద్వారా రూ.118.70 కోట్లకు పైగా అవినీతి జరిగినట్లు అధికారులు తేల్చారు. వీటి ద్వారా ఐటీసీ కొల్లగొట్టినట్లు తెలుసుకున్నారు. లలిత ట్రేడర్స్‌ రూ.25.43 కోట్లు, ఆర్‌పీ ఎంటర్‌ప్రెజెస్‌ రూ.15.98 కోట్లు, తాజ్‌ ట్రేడర్స్‌ రూ.13.37 కోట్లు, మహాదేవ్‌ ఎంటర్‌ప్రెజెస్‌ రూ.9.54 కోట్లు, ఎంఎఫ్‌ ఎంటర్‌ప్రెజెస్‌ రూ.9.06 కోట్లు, ఐబీ ట్రేడర్స్‌ రూ.2.04 కోట్లు, రూ.2.16 కోట్లు, ఎఆర్‌ స్టీల్స్‌ రూ.3.11 కోట్లు, జెడ్‌ఎఫ్‌ ట్రేడర్స్‌ రూ.4.59 కోట్లు, ముజు మెటల్స్‌ రూ.5.73 కోట్లు, అబ్రార్‌ టుడే ఫ్యాషన్‌ మాల్‌ రూ.5.36 కోట్లు చేసినట్లు నిర్ధారించినట్లు సమాచారం. ఇవే కాకుండా మరిన్ని కోట్లు అవినీతి జరిగినట్లు అధికారులు గుర్తించే పనిలో పడ్డట్లు తెలుస్తోంది.

రూ.400 కోట్లకు పైగా అక్రమాలు

జీఎస్టీ స్కాం దాదాపు రూ.400 కోట్ల వరకు జరిగినట్లు అధికారులు అంచనా వేశారు. దీని పై సమగ్ర రిపోర్టు సిద్ధం చేశారు. అమ్మకం, కోనుగోలు చేయకుండా ఐటీసీ క్లెయిమ్‌ చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టినట్లు వారి విచారణలో తేలింది. గతంలోనూ అక్రమ వ్యాపారంపై రూ.93 కోట్లు జరిమానా, పరిహారం చెల్లించాలని స్కాందారుడికి అధికారులు నోటీసులు ఇచ్చారు. దీనిపై అతడు హైకోర్టులో సవాల్‌ చేస్తూ కేసు వేశాడు. అది ఇంకా కొనసాగుతోంది. వంద మంది పేదల నుంచి ఐడీ ఫ్రూఫ్స్‌ సంపాదించి నకిలీ వ్యాపారాలు చేసినట్లు అధికారులు తెలుసుకున్నారు. ముంబాయి, ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణలో లావాదేవీలు జరిపినట్లు నకిలీ పత్రాలు సృష్టించారన్నారు. వందల కోట్లు సరుకు కోనుగోలు చేసినట్లు నకిలీ బిల్లులు సృష్టించి స్టాక్‌ పాయింట్‌లో మాత్రం సరుకు లేదని తెలుసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement