
కొందరికే యూరియా
పలమనేరు: ప్రస్తుతం యూరియా కోసం రైతులు పడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. ఈ నేపథ్యంలో కుప్పానికి సీఎం చంద్రబాబు వస్తున్న నేపథ్యంలో యూరియా విషయంపై రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందనే నిఘా వర్గాల హెచ్చరికలతో జిల్లా అధికార యంత్రాంగం ముందస్తు చర్యలు చేపట్టింది. ఆ మేరకు జిల్లాలోని రైతు సేవా కేంద్రాల ద్వారా యూరియా కావాల్సిన వారి వివరాలను నమోదు చేసుకొని, వారి బయోమెట్రిక్ సేకరించి టోకెన్లు అందించే కార్యక్రమాన్ని గత సోమవారం నుంచి చేపట్టింది. ఆయా గ్రామాల రైతులు ఆర్‌ఎస్‌కేల వద్ద బయోమెట్రిక్ చేసుకొని టోకెన్లు పొందారు. ఎట్టకేలకు శుక్రవారం పలు ఆర్‌ఎస్‌కేల్లో యూరియా పంపిణీ మొదలైంది. ఉదయం నుంచే రైతులు భారులు తీరారు. తీరా ఒక్కో ఆర్‌ఎస్‌కేకు సగటున 150 బస్తాల యూరియా మాత్రమే కేటాయించారు. రైతులు మాత్రం 400 దాకా వచ్చారు. వీరికి యూరియా దక్కకపోగా అక్కడున్న సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. మరికొందరు ఏమీ చేయలేక వెనుదిరిగారు.
అధికార పార్టీ అండదండలుంటేనే..
ముందుగా టోకెన్లు పొందిన వారికి కాకుండా అధికార పార్టీ అండదండలున్న వారికి మాత్రం ముందుగానే యూరియాని అక్కడి సిబ్బంది అందించారని రైతులు ఆరోపిస్తున్నారు. టోకెన్లు పొంది కూడా లాభం లేకుండా పోయిందని మరికొందరు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ఏవో సంధ్యారాణిని వివరణ కోరగా మండలంలోని సముద్రపల్లి, మండిపేటకోటూరు, మొరం ఆర్‌ఎస్‌కేల్లో ఒక్కోచోట 150 బస్తాల యూరియాను పంపిణీ చేశామన్నారు. మళ్లీ వస్తే మిగిలిన రైతులకు పంపిణీ చేస్తామన్నారు.