
సాక్షి, చిత్తూరు: చిత్తూరులో వినాయక చవితి ఉత్సవాల్లో అసభ్యకర నృత్యాల ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అనుమతి లేకుండా నృత్య ప్రదర్శనలను నిర్వహించిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.
వివరాల ప్రకారం.. చిత్తూరు జిల్లాలోని పలమనేరు అర్బన్ పరిధిలో టి.వడ్డూరు గ్రామంలో వినాయక మండపాల ముందు అసభ్యకర నృత్యాల ప్రదర్శన జరిగింది. సరిహద్దు రాష్ట్రం తమిళనాడు తిరువల్లూరు జిల్లా ఆవడి నుండి ఐదుగురు మహిళా డాన్సర్లతో నిర్వాహకులు ప్రదర్శన ఇప్పించారు. ఈ సందర్భంగా తమిళ సినిమా పాటలతో యువకులను రెచ్చగొట్టేలా యువతులు అసభ్యకర నృత్యాలు చేశారు. ఈ సమయంలో తెలుగు సినిమా పాటలకు డ్యాన్స్ చేయాలంటూ యువత పట్టుబట్టారు. అనంతరం, డ్యాన్సర్లకు చెల్లించాల్సిన రుసుముపై నిర్వాహకులు, డ్యాన్సర్లకు మధ్య వాగ్వివాదం జరిగింది. దీంతో, ఈ వ్యవహారం కాస్తా పోలీసు స్టేషన్‌కు చేరింది.
తమకు తమకు ఇవ్వాల్సిన డబ్బు చెల్లించలేదంటూ డ్యాన్సర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అశ్లీల డాన్స్ ప్రదర్శనలు నేరం అంటూ నిర్వహణపై కేసులు నమోదు చేసినట్టు తెలుస్తోంది. ఆర్గనైజర్ చరణ్, కొంతమంది పైన కేసు నమోదు చేసినట్టు సమాచారం. వినాయక మండపాల దగ్గర పర్మిషన్ లేకుండా ఎటువంటి ఆర్కెస్ట్రా ముసుగులో అసభ్యకర నృత్యాలు, కార్యక్రమాలు చేపట్టినా చర్యలు తప్పవని పలమనేరు పోలీసులు హెచ్చరించారు.