
కొంప ముంచిన కలుషిత ఆహారం
వినాయక చవితి పూజల్లో ప్రసాదం, తాగునీరు తాగడంతో అతిసారం వాంతులు, విరేచనాలతో తల్లడిల్లిన 30 మంది బాధితులు జి.గొల్లపల్లెను సందర్శించిన అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌ఓ రోగులకు గ్రామంలోనే అత్యవసర వైద్య సేవలు
తవణంపల్లె: మండలంలోని జి.గొల్లపల్లెలో వినాయక చవితి పూజల్లో కలుషిత ప్రసాదాలు భుజించి, తాగునీరు సేవించడం వల్ల 30 అతిసారం బారినపడ్డారు. జి.గొల్లపల్లెలో గురువారం వినాయక చవితి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పూజలు చేసి గ్రామస్థులందరూ ప్రసాదాలు తిన్నారు. అక్కడే తాగునీరు సేవించారు. కానీ అదేరోజు రాత్రి ఐదుగురికి వాంతులు, విరేచనాలు కావడంతో ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం గ్రామంలోని మరో 30 మందికి వాంతులు, విరేచనాలయ్యాయి. మండల వైద్యాధికారులు డాక్టర్ ప్రియాంక, డాక్టర్ మోహన్‌వేలు ఆధ్వర్యంలో జి.గొల్లపల్లెలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. గ్రామంలోని వంశీ, సరసమ్మ, జయమ్మ, నాగరాజు, సక్కూబాయి, శ్యామలమ్మ, గోవిందస్వామి, పుష్ప, సుబ్రమణ్యంను మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి, అరగొండ అపోలో హాస్పిటల్‌కు రెఫర్ చేశారు. మిగిలిన వారి పరిస్థితి కుదుటపడడంతో ఇంటి దగ్గరే వైద్యం చేయించుకుంటున్నారు. గ్రామంలో తాగునీటి బోరులో నీరు, వాటర్ ట్యాంకు లోనీరు, రోగుల ఇళ్లల్లో తాగునీరు టెస్టింగ్ కోసం ల్యాబ్‌కు పంపారు. ఐదు రోజుల పాటు గ్రామంలో వైద్య శిబిరం నిర్వహించనున్నారు.