
శ్రీరంగరాజపురం : ఆడికృత్తిక పండుగకు పుట్టింటికి వచ్చిన ఓ మహిళ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన ఆదివారం శ్రీరంగరాజపురం మండలంలో వెలుగు చూసింది. స్థానికుల కథనం మేరకు.. పాతపాళ్యం గ్రామానికి చెందిన చిన్నస్వామి చివరి కుమార్తె పూజ (30)ను యాదమరి మండలం పరదరామి గ్రామానికి చెందిన వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. వీరికి ముగ్గురు సంతానం. అయితే పూజ భర్త ఇటీవల అనారోగ్యంతో మరణించాడు.
ఆడికృత్తిక సందర్భంగా పూజ తన ముగ్గురు పిల్లలను తీసుకుని పాతపాళ్యం గ్రామానికి వచ్చింది. ఆదివారం తమ పొలం వద్దకు వెళ్తుండగా మార్గమధ్యలో గుండెపోటు రావడంతో కింద పడిపోవడంతో స్థానికులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు పిల్లలను చూసి గ్రామస్తులు బోరున విలపించారు.