
ఇప్పటి దాకా పంటలపైకి ఏనుగులు రాకుండా మళ్లించడమే..
క్యాప్చరింగ్‌తోనే మదుపుటేనుగల కట్టడి
కర్ణాటకలో ఇప్పటికే సత్ఫలితాలు
కార్యాచరణ చేపట్టనున్న అటవీశాఖ అధికారులు
పలమనేరు : చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా తీరని సమస్యగా మారింది. అడవిని దాటుతున్న ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడుల్లో రైతుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అడవిని దాటి బయటకొచ్చిన ఏనుగులు సైతం వివిధ కారణాలతో మృతి చెందుతున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటి దాకా అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాలు ప్రయోజనం లేకుండా పోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని మొసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు చేపట్టింది.
ఇటీవలే టేకుమంద ఫారెస్ట్‌లో కుంకీ ఏనుగుల ట్రయల్ రన్ చేపట్టి అది విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. కానీ ఆడ ఏనుగులతో సమస్యలేదు గాని మదపుటేనుల కారణంగానే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోంది. వీటిని అదుపు చేయడమే కుంకీ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం. ఇందుకోసం అత్యంత కీలకమైన ప్రక్రియ క్యాప్చరింగ్ మాత్రమే. మదపు టేనుగుల క్యాప్చరింగ్ త్వరలో చేపడతామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ప్రక్రియ జరిగి ఇక్కడి గుంపుల్లోని, ఒంటరిగా సంచరిస్తున్న మదపు టేనుగులను బంధిస్తేనే ఏనుగుల సమస్యకు చెక్ పెట్టినట్లు అవుతుంది.
ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు
2012 నుంచి గతనెల 26న సోమలలో మృతి చెందిన క్రిష్ణంరాజు దాకా మొత్తం 34 మంది ప్రాణాలను కోల్పోయారు. ఏనుగుల దాడుల్లో 24 మందికి పైగా గాయపడ్డారు. ఏనుగుల బారిన పడి 63 పశువులు మృతి చెందాయి. ఈ దాడులను ఎక్కువగా చేసింది మదపుటేనుగులే. ఇక ఏనుగుల కారణంగా 8602 ఎకరాల పంటలు నాశనమయ్యాయి.
లక్ష్యం ఇదీ...
కుంకీ ఏనుగుల ద్వారా ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కుంకీ ఆపరేషన్లు కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు దుబేరా బేస్ క్యాంపు నుంచి నాలుగు, రామ కుప్పం ననియాల నుంచి రెండు ఏనుగులను తెప్పించారు.
వీటికి ఈ ప్రాంతాన్ని అలవాటు చేసి ఆపై అడవిలోని ఏనుగులకు కట్టడి చేయాలి. ఇందులో అత్యంత ముఖ్యమైన పని క్యాప్చరింగ్. అంటే మదపు టేనుగులను గుర్తించి వాటికి మత్తుచ్చి కుంకీల సాయంతో క్యాంపునకు తీసుకొచ్చి ఎలిఫెంట్ క్రాల్స్‌లో బంధించాలి. ఆపై ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తే ఇవి కుంకీల మాదిరి దాడులు చేయకుండా పోతాయి.
ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి?
ఇక్కడి క్యాంపులో అభిమన్యు, క్రిష్ణ, జయంత్, వినాయక, దేవా, రంజన్‌లున్నాయి. ఇటీవల సోమలలో రైతును ఏనుగులు చంపడంతో రైతులు రోడ్డెక్కారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేఖత వస్తుందని ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అటవీశాఖ హుటాహుటిన కుంకీ ట్రయల్ రన్ చేసి ప్రజల దృష్టిని మళ్లించిదనే మాట వినిపిస్తోంది.
ఆ మేరకు టేకుమంద అడవిలో ఏనుగుల మళ్లింపునకు పూర్తి ఫిట్‌నెస్ కలిగిన క్రిష్ణ, జయంత్, వినాయక్‌లను మాత్రం మావటిల ద్వారా పంపారు. అడవిలోని ఏనుగుల గుంపును అక్కడి నుంచి కౌండిన్య ఫారెస్ట్‌లోకి మళ్లించారు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమే. దీంతోనే ఏనుగులను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేరు.
మదపుటేనుగులు అదుపులోకి తెస్తేనే..
ప్రజల ప్రాణాలు తీస్తున్న వాటిలో 90 శాతం మదపుటేనుగులే. ప్రస్తుతానికి కొన్ని ఒంటరిగా సంచరిస్తుండగా మరికొన్ని గుంపుల్లో ఉన్నాయి. ఇక్కడి ఎలిఫెంట్ క్యాంపులోని దేవా, రంజన్ సైతం కుంకీలుగా మారాలి. అప్పుడు కుంకీలు నాలుగు దిశల్లో వెళ్లి గుంపులోని మదపు టేనుగులను అదుపుచేయాలి. ఆ సమయంలో మావటీలు మత్తు సూదిచ్చి దాన్ని బంధించి క్యాంపునకు తీసుకురావాలి.
ఈ ప్రక్రియలో కుంకీల పని ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాహనం ఎక్కించడం చేస్తాయి. ఇలా తీసుకొచ్చిన మదపు టేనుగులను క్యాంపులోని క్రాల్స్‌లో బంధించి మూడు నుంచి ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చాకే ఇవి కుంకీలుగా మారుతాయి. ఇలా మదపు టేనుగులన్నింటిని కట్టడి చేస్తేగాని సమస్య పరిష్కారం కాదు.
జిల్లాలో ఏనుగుల పరిస్థితి ..
పలమనేరు, కుప్పం, పూతలపట్టు, పుంగనూరు పరిధిల్లోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీపైగా మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఏనుగుల సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 105 దాకా ఏనుగులుండగా ఇందులో కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీలోనే 56 దాకా గుంపులుగా ఉన్నాయి. ఇవిగాక పక్కరాష్ట్రాల నుంచి వలస ఏనుగులు ఇక్కడికి వస్తుంటాయి.
వచ్చిన చోటుకే మళ్లీ వస్తున్నాయి
మేం పొలం వద్ద కాపురం ఉంటున్నాం. ఓ మదపు టేనుగు మా పొలం వద్దకు ఇప్పటికే నాలుగైదు సార్లు వచ్చి పంటను తొక్కినాశనం చేసింది. మొన్న వచ్చినప్పుడు ఇంటిని మొత్తం కూల్చేసింది. దీంతో మేము ఎలాగో తప్పించుకొని ప్రాణాలతో భయటపడ్డాం. కుంకీలో ఏమోగాని ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా చేయాలి. – చంద్రయ్య, బాధిత రైతు, ఇందిరానగర్