breaking news
Kunki
-
కుంకీ ఆ'పరేషాన్'
పలమనేరు : చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య దశాబ్దాలుగా తీరని సమస్యగా మారింది. అడవిని దాటుతున్న ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. ఏనుగుల దాడుల్లో రైతుల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. అడవిని దాటి బయటకొచ్చిన ఏనుగులు సైతం వివిధ కారణాలతో మృతి చెందుతున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటి దాకా అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాలు ప్రయోజనం లేకుండా పోయాయి. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని మొసలిమడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్ ప్రాజెక్టు చేపట్టింది. ఇటీవలే టేకుమంద ఫారెస్ట్‌లో కుంకీ ఏనుగుల ట్రయల్ రన్ చేపట్టి అది విజయవంతమైందని అధికారులు చెబుతున్నారు. కానీ ఆడ ఏనుగులతో సమస్యలేదు గాని మదపుటేనుల కారణంగానే ప్రాణ నష్టం ఎక్కువగా జరుగుతోంది. వీటిని అదుపు చేయడమే కుంకీ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశ్యం. ఇందుకోసం అత్యంత కీలకమైన ప్రక్రియ క్యాప్చరింగ్ మాత్రమే. మదపు టేనుగుల క్యాప్చరింగ్ త్వరలో చేపడతామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. కానీ ఈ ప్రక్రియ జరిగి ఇక్కడి గుంపుల్లోని, ఒంటరిగా సంచరిస్తున్న మదపు టేనుగులను బంధిస్తేనే ఏనుగుల సమస్యకు చెక్ పెట్టినట్లు అవుతుంది. ఇప్పటి వరకు 34 మంది ప్రాణాలు కోల్పోయారు 2012 నుంచి గతనెల 26న సోమలలో మృతి చెందిన క్రిష్ణంరాజు దాకా మొత్తం 34 మంది ప్రాణాలను కోల్పోయారు. ఏనుగుల దాడుల్లో 24 మందికి పైగా గాయపడ్డారు. ఏనుగుల బారిన పడి 63 పశువులు మృతి చెందాయి. ఈ దాడులను ఎక్కువగా చేసింది మదపుటేనుగులే. ఇక ఏనుగుల కారణంగా 8602 ఎకరాల పంటలు నాశనమయ్యాయి. లక్ష్యం ఇదీ... కుంకీ ఏనుగుల ద్వారా ఏనుగుల సమస్యను పరిష్కరించేందుకు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కుంకీ ఆపరేషన్లు కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. అక్కడ విజయవంతం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం పలమనేరు ఎలిఫెంట్ క్యాంపునకు దుబేరా బేస్ క్యాంపు నుంచి నాలుగు, రామ కుప్పం ననియాల నుంచి రెండు ఏనుగులను తెప్పించారు. వీటికి ఈ ప్రాంతాన్ని అలవాటు చేసి ఆపై అడవిలోని ఏనుగులకు కట్టడి చేయాలి. ఇందులో అత్యంత ముఖ్యమైన పని క్యాప్చరింగ్. అంటే మదపు టేనుగులను గుర్తించి వాటికి మత్తుచ్చి కుంకీల సాయంతో క్యాంపునకు తీసుకొచ్చి ఎలిఫెంట్ క్రాల్స్‌లో బంధించాలి. ఆపై ఆరు నెలలపాటు శిక్షణ ఇస్తే ఇవి కుంకీల మాదిరి దాడులు చేయకుండా పోతాయి. ప్రస్తుతం జరుగుతున్నది ఏంటి? ఇక్కడి క్యాంపులో అభిమన్యు, క్రిష్ణ, జయంత్, వినాయక, దేవా, రంజన్లున్నాయి. ఇటీవల సోమలలో రైతును ఏనుగులు చంపడంతో రైతులు రోడ్డెక్కారు. దీంతో ప్రభుత్వంపై వ్యతిరేఖత వస్తుందని ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అటవీశాఖ హుటాహుటిన కుంకీ ట్రయల్ రన్ చేసి ప్రజల దృష్టిని మళ్లించిదనే మాట వినిపిస్తోంది. ఆ మేరకు టేకుమంద అడవిలో ఏనుగుల మళ్లింపునకు పూర్తి ఫిట్నెస్ కలిగిన క్రిష్ణ, జయంత్, వినాయక్‌లను మాత్రం మావటిల ద్వారా పంపారు. అడవిలోని ఏనుగుల గుంపును అక్కడి నుంచి కౌండిన్య ఫారెస్ట్‌లోకి మళ్లించారు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమే. దీంతోనే ఏనుగులను పూర్తి స్థాయిలో కట్టడి చేయలేరు.మదపుటేనుగులు అదుపులోకి తెస్తేనే.. ప్రజల ప్రాణాలు తీస్తున్న వాటిలో 90 శాతం మదపుటేనుగులే. ప్రస్తుతానికి కొన్ని ఒంటరిగా సంచరిస్తుండగా మరికొన్ని గుంపుల్లో ఉన్నాయి. ఇక్కడి ఎలిఫెంట్ క్యాంపులోని దేవా, రంజన్ సైతం కుంకీలుగా మారాలి. అప్పుడు కుంకీలు నాలుగు దిశల్లో వెళ్లి గుంపులోని మదపు టేనుగులను అదుపుచేయాలి. ఆ సమయంలో మావటీలు మత్తు సూదిచ్చి దాన్ని బంధించి క్యాంపునకు తీసుకురావాలి. ఈ ప్రక్రియలో కుంకీల పని ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా వాహనం ఎక్కించడం చేస్తాయి. ఇలా తీసుకొచ్చిన మదపు టేనుగులను క్యాంపులోని క్రాల్స్‌లో బంధించి మూడు నుంచి ఆరు నెలలపాటు శిక్షణ ఇచ్చాకే ఇవి కుంకీలుగా మారుతాయి. ఇలా మదపు టేనుగులన్నింటిని కట్టడి చేస్తేగాని సమస్య పరిష్కారం కాదు.జిల్లాలో ఏనుగుల పరిస్థితి .. పలమనేరు, కుప్పం, పూతలపట్టు, పుంగనూరు పరిధిల్లోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీపైగా మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఏనుగుల సంచరిస్తున్నాయి. ఈ ప్రాంతంలో మొత్తం 105 దాకా ఏనుగులుండగా ఇందులో కౌండిన్య ఎలిఫెంట్ శాంచురీలోనే 56 దాకా గుంపులుగా ఉన్నాయి. ఇవిగాక పక్కరాష్ట్రాల నుంచి వలస ఏనుగులు ఇక్కడికి వస్తుంటాయి.వచ్చిన చోటుకే మళ్లీ వస్తున్నాయి మేం పొలం వద్ద కాపురం ఉంటున్నాం. ఓ మదపు టేనుగు మా పొలం వద్దకు ఇప్పటికే నాలుగైదు సార్లు వచ్చి పంటను తొక్కినాశనం చేసింది. మొన్న వచ్చినప్పుడు ఇంటిని మొత్తం కూల్చేసింది. దీంతో మేము ఎలాగో తప్పించుకొని ప్రాణాలతో భయటపడ్డాం. కుంకీలో ఏమోగాని ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా చేయాలి. – చంద్రయ్య, బాధిత రైతు, ఇందిరానగర్ -
గుదిబండగా మారిన నాలుగు కుంకీ ఏనుగులు
-
'కుంకీ' కుట్ర!
సాక్షి, అమరావతి: గ్రామాలపై ఏనుగుల దాడిని నిలువరించడానికి కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిన నాలుగు కుంకీ ఏనుగులు పనికిరానివని తేలింది. వాటిని మేపలేక అక్కడి ప్రభుత్వం ‘గజ’కర్ణ విద్యను ప్రదర్శించి ఏపీకి అంటగట్టి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్ద ఘనతగా ప్రచారం చేసుకుని ఇప్పుడు కిక్కురుమనడంలేదు. తీసుకువచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్ కూడా నిర్వహించలేదు. దీన్నిబట్టే వాటి సామర్థ్యం ఏమిటో స్పష్టమవుతోంది. అడవి ఏనుగుల కట్టడి కోసం తెచ్చి.. తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు, ఒడిశా సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో అడవి ఏనుగులు తరచూ ఊళ్లపై పడి పొలాల్ని ధ్వంసం చేయడం, మనుషులపై దాడి చేస్తుండటంతో వాటిని నియంత్రించే కుంకీ ఏనుగులను తీసుకొచ్చి సమస్య పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చాక ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు. దీనిలోభాగంగా ఆయన రెండుసార్లు కర్ణాటక వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. గత మే నెలలో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా నాలుగు కుంకీ ఏనుగుల్ని వేడుకగా స్వీకరించారు. తమ రాష్ట్రంలో 3,695 ఏనుగులు ఉన్నాయని, ఏపీకి అవసరం కావడంతో కుంకీ ఆపరేషన్‌లో శిక్షణ పొందిన రంజన్ (26), దేవ (39), అభిమన్యు (14), కృష్ణ (15) అనే ఏనుగుల్ని ఏపీకి ఇస్తున్నట్లు సిద్ధరామయ్య చెప్పారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతో చొరవ చూపారని, ఆయన వల్లే కుంకీ ఏనుగుల్ని ఏపీకి ఇస్తున్నట్లు చెప్పారు. మరో రెండు ఏనుగుల్ని త్వరలో ఇస్తామని కూడా పేర్కొన్నారు. రెండు నెలలైనా ఒక్క కుంకీ ఆపరేషన్ లేదు తీసుకొచ్చిన ఏనుగుల్ని చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఎలిఫెంట్ క్యాంప్‌లో అటవీ అధికారులు ఉంచారు. అవి వచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్ కూడా నిర్వహించలేదు. ఎందుకని ఆరా తీయగా వాటికి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదని తేలింది. వాటిని పోషించడమూ దండగేనని అటవీ శాఖాధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అందులో దేవ అనే ఏనుగు గుడ్డిదని సమాచారం. అది ఒక కంటితో మాత్రమే చూడగలదని అధికారులు గుర్తించారు. మరో ఏనుగు రంజన్ పిచ్చిదని, దాన్ని అదుపు చేయడం మావటివల్ల కూడా కావడం లేదని తెలుస్తోంది. మిగతా రెండు ఏనుగులకూ కుంకీ ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదని, అవి ఎందుకూ పనికిరావని అధికారులు తేల్చేశారు. దీంతో అటవీశాఖ కక్కలేక మింగలేక నీళ్లు నములుతోంది. ఈ ఏనుగుల పోషణకు ఒక్కో దానికి ఏడాదికి రూ.25లక్షలు ఖర్చవుతుందని అంచనా. నాలుగు ఏనుగులకు ఏడాదికి రూ.కోటి వెచ్చించాలి. మరో 25 ఏళ్లపాటు ఈ భారాన్ని మోయక తప్పదని, పవన్ కళ్యాణ్ అత్యుత్సాహం, ఏపీ అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగం లేని ఏనుగులను తీసుకొచ్చిన ఏపీ సర్కారు రాష్ట్రానికి పెద్ద సమస్యగా మార్చింది. ఇప్పుడు ఏం చేయాలో తెలీక మదనపడుతున్నట్టు సమాచారం. -
కుంకీలతో కట్టడి సాధ్యమేనా
పలమనేరు: చిత్తూరు జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో ఏనుగుల సమస్య(elephant problem) దశాబ్దాలుగా ఉంది. అడవిదాటి వచ్చి ఏనుగులు రైతుల పంటలను నాశనం చేస్తున్నాయి. మరోవైపు ఏనుగుల దాడుల్లో(elephant attack) జనాలు మృత్యువాత పడుతున్నారు. ఏనుగులు సైతం వివిధ కారణాలతో మరణిస్తున్నాయి. అడవిలోంచి ఏనుగులు బయటకు రాకుండా కట్టడి చేసేందుకు ఇప్పటివరకు అటవీశాఖ చేపట్టిన సోలార్ ఫెన్సింగ్, కందకాల తవ్వకం వల్ల ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది.కర్ణాటక టైప్ పేరిట గతంలో చేపట్టిన హ్యాంగింగ్ సోలార్ సిస్టం సైతం ప్రయోగాత్మకంగానే ముగిసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కుంకీ ఏనుగుల ద్వారా ఇక్కడి ఏనుగులను కట్టడి చేసేందుకు పలమనేరు మండలంలోని ముసలిమొడుగు వద్ద కుంకీ ఎలిఫెంట్(Kunki Elephant) ప్రాజెక్టు పనులు చేపడుతోంది. ఇదే తరహాలో రామకుప్పం మండలంలో ననియాల క్యాంపును గతంలో ఏర్పాటు చేసినా ఈ ఏనుగులు కనీసం అడవిలోని ఓ ఏనుగును సైతం అదుపు చేయలేదు. ఈ నేపథ్యంలో ఇక్కడికి రానున్న కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను కట్టడి చేస్తాయా? అనే అనుమానం ఇక్కడి రైతుల్లో నెలకొంది. కౌండిన్యలో ఏనుగుల పరిస్థితి ఇదీ పలమనేరు, కుప్పం పరిధిలోని కౌండిన్య అభయారణ్యం 250 కి.మీ మేర మన రాష్ట్రంతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోని అడవులకు ఆనుకొని ఉంది. కౌండిన్య అభయారణ్యంలో స్థిరంగా ఉన్న గుంపులు, వలస వచ్చిన గుంపులు కలిపి మొత్తం 120 వరకు ఏనుగులు సంచరిస్తున్నాయి. 1984లో ప్రభుత్వం ముసలిమొడుగు వద్ద కౌండిన్య ఎలిఫెంట్ శాంక్చురీని ఏర్పాటు చేసింది. ఇందులోకి తమిళనాడులోని మోర్థన ఫారెస్ట్నుంచి, ననియాల, కర్ణాటకలోని బన్నేరుగట్ట, బంగారుపేట, కేజీఎఫ్, తమిళనాడులోని క్రిష్ణగిరి, హొసూరు, కావేరిపట్నం తదితర ప్రాంతాల నుంచి ఏనుగులు వస్తున్నాయి. ఏనుగులు అడవిని దాటి బయటకు రాకుండా ఉండేందుకు గతంలో రూ. 2.61 కోట్లతో బంగారుపాళ్యం మండలం నుంచి కుప్పం వరకు 142 కి.మీ మేర సోలార్‌ఫెన్సింగ్‌ను 40 కి.మీ మేర ట్రెంచ్‌లను ఏర్పాటుచేశారు. అయితే సోలార్‌ఫెన్సింగ్‌ను ఏనుగులు తొక్కి అడవిలోంచి బయటకువస్తున్నాయి. ఫెన్సింగ్ కోసం ఏర్పాటు చేసిన కమ్మీలు నాశిరకంగా ఉండటంతో వీటిని సులభంగా విరిచేస్తున్నాయి. ఇక ఎలిఫెంట్ ట్రెంచ్‌లను సైతం ఏనుగులు మట్టిని తోసి,రాళ్లున్న చోట సులభంగా అడవిని దాటి బయటికొస్తున్నాయి. ఈరెండూ విఫలమవడంతో గతేడాది కర్ణాటక మోడల్ పేరిట హ్యాంగింగ్ సోలార్‌ను పదికిలోమీటర్ల మేర ప్రయోగాత్మకంగా చేపట్టి ఆపై దీన్నీ వదిలేశారు.కుంకీల కోసం కర్ణాటకతో ఎంవోయూ ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కర్ణాటకతో ఎంవోయూ చేసుకొని అక్కడ శిక్షణపొందిన నాలుగు కుంకీ ఏనుగులను ఇక్కడికి తెప్పిస్తోంది. ఇందుకోసం రేంజి పరిధిలోని 20 మంది ఎలిఫెంట్ ట్రాకర్లను దుభారే ఎలిఫెంట్ క్యాంపునకు పంపి నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించారు. దీనికోసం ముసలిమొడుగు వద్ద రూ.12లక్షల వ్యయంతో కుంకీ ఎలిఫెంట్ క్యాంపును 50 ఎకరాల్లో ఏర్పాటు చేస్తోంది. ఇందులో భాగంగా ఏనుగుల కోసం కర్రలకంచెతో విడిది, మేతను సిద్దం చేసుకునే గదులు, చిన్నపాటి చెరువు, శిక్షణాస్థలం. క్రాల్స్( మదపుటేనుగులను మచ్చిక చేసుకొనే చెక్క గది) పనులు జరుగుతున్నాయి.మరో రూ.27 లక్షలతో హ్యాంగింగ్ సోలార్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇలా ఉండగా గతంతో రామకుప్పం వద్ద నినియాలో ఏర్పాటు చేసిన ఇలాంటి క్యాంపులో రెండు ఏనుగులున్నాయి. వీటిని చూసేందుకు పర్యాటకులు వెళుతున్నారేగానీ ఇవి అడవిలోని ఏనుగును కట్టడి చేసిన దాఖలాలు ఇప్పటిదాకా లేవు. అదే రీతిలో ఇక్కడ కుంకీలతో సమస్య తెగుతుందా? లేదా అనే సందేహం మాత్రం ఇక్కడి రైతులకు పట్టుకుంది. అసలే ఇక్కడున్న మదపుటేనుగులు (రౌడీ ఏనుగులు,పుష్పా) కుంకీ ఏనుగులపై దాడులు చేసే అవకాశం లేకపోలేదు.గుబులు రేపుతున్న ఒంటరి ఏనుగు.... పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో వందకు పైగా ఏనుగులు సంచరిస్తున్నా కేవలం ఓ ఒంటరి ఏనుగు రెండునెలలుగా జనానికి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కేవలం వ్యవసాయపొలాల వద్ద ఉన్న ఇళ్ళను టార్గెట్ చేసి వాటిని ధ్వంసం చేస్తోంది. ఆ ఇళ్ళలోని ధాన్యం, రాగులు హాయిగా ఆరగించి వెళుతోంది. దీంతోపాటు ఆఇళ్ల వద్ద ఉన్న మనుషులపై దాడులు చేస్తోంది.వారు దొరక్కపోతే ఆ ఇళ్ల వద్ద కట్టేసి ఉన్న ఆవులు, దూడలను చంపుతోంది. దీంతో అటవీ సమీప ప్రాంతాల్లో పొలాలవద్ద కాపురాలుంటున్న వారు ఈ ఏనుగు భారినుంచి ఎలా తప్పించుకోవాలో అర్థంగాక హడలిపోతున్నారు. కాగా గత పదేళ్లలో కరెంట్ షాక్‌లు, నీటిదొనల్లో పడి, మదపుటేనుగుల రభస కారణంగా 16 ఏనుగులు చనిపోయాయి. ఏనుగుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 14మంది మృతి చెందగా 26 మందివరకు గాయపడ్డారు. అడవిని విడిచి ఎందుకొస్తున్నాయంటే... కౌండిన్య అభయారణ్యంలో ఏనుగులకు అవరసమైన ఆహారం, నీటిలభ్యత తక్కువ. ఓ ఏనుగుకు రోజుకి 900లీటర్ల నీరు, 10 హెక్టార్లలో ఫీడింగ్ అవసరం. ఆహారం తిన్నాక ఇవి రోజుకు 5మైళ్లదాకా సంచరిస్తుంటాయి. అడవిలోని దట్టమైన మోర్ధనా అభయారణ్యంలోకి ఏనుగులు వెళితే తమిళనాడు అటవీశాఖ తుపాకులతో గాల్లోకి కాల్పులు జరిపి వీటిని మళ్లీ కౌండిన్య వైపుకు మళ్లిస్తోంది. దీంతో ఏనుగులు దట్టమైన అడవిలో ఉండటంలేదు. పొలాల్లోని చెరుకు, కొబ్బరి, మామిడి లాంటి ఆహారం కోసం ఒక్కసారి వచ్చే ఏనుగు తరచూ అదే మార్గంలో వస్తూనే ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు.క్యాంప్ పనులు సాగుతున్నాయి పలమనేరులో కుంకీ ఎలిఫెంట్ క్యాంపుకోసం ఇప్పటికే పనులు సాగుతున్నాయి. మైసూరు సమీపంలోని దుబరే నుంచి నాలుగు కుంకీ ఏనుగులు త్వరలో రానున్నాయి. ఎలిఫెంట్ ట్రాకర్లకు ఇప్పటికే కుంకీ ట్రైనింగ్ ఇప్పించాం. ముఖ్యంగా మదపుటేనుగులు దాడులు చేయకుండా వాటికి శిక్షణనిస్తాం. దీంతో ఏనుగులను కట్టడి చేసే అవకాశం ఉంటుంది. – భరణి, డీఎఫ్‌వో, చిత్తూరుకుంకీలతోనైనా సమస్య తీరితే చాలు.. గతంలో ఏనుగులను కట్టడి చేసేందుకు చేసిన పనులన్నీ లాభం లేకుండా పోయాయి. ఇప్పుడు కుంకీ ఏనుగులంటున్నారు. వీటితోనైనా ఇక్కడ ఏనుగుల సమస్య పరిష్కారమైతే అదే పదివేలు. అయినా జనంపై దాడులు చేస్తూ యథేచ్ఛగా పంటపొలాలపై పడుతున్న మదపుటేనుగులను ఈ కుంకీ ఏనుగులు ఎంతవరకు అదుపు చేస్తాయనే విషయంపై అనుమానంగానే ఉంది. – ఉమాపతి, రైతుసంఘ నాయకులు, పలమనేరు -
స్టార్ డైరెక్టర్ తో తొలి సినిమా..!
తమిళసినిమా: దర్శకుడు ప్రభుసాల్మన్ చిత్రాలు ప్రత్యేకతను సంతరించుకుంటాయి. ముఖ్యంగా ఆయన చిత్రాల్లో లొకేషన్స్ కూడా ఒక పాత్రలా ఉంటాయి. సాధ్యమైనంతవరకు ఫ్రెష్ లొకేషన్స్‌ను ఎంచుకుంటారు. ఇక ఆయన చిత్రాల్లో కొత్త వారికి నటించే అవకాశం వచ్చిందంటే వారి పంట పండినట్లే. కుంకీతో లక్ష్మీమీనన్‌ను పరిచయం చేసిన ఘనత ప్రభుసాల్మన్దే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య తెలుగమ్మాయి ఆనందిని కయల్ చిత్రంతో కయల్ ఆనందిగా మార్చారు. స్టార్ నటుడు ధనుష్‌తో చేసిన తొడరి చిత్రం ఆశించిన ఫలితాన్నివ్వలేదు. దీంతో తన తాజా చిత్రానికి కొత్తవారి కోసం అన్వేషణ సాగిస్తున్నారు. అదే విధంగా ఆయన ఇంతకు ముందు తెరకెక్కించిన చక్కని ప్రేమకథా దృశ్యకావ్యం కుంకీ చిత్రానికి సీక్వెల్‌ను రూపొందించడానికి రెడీ అయ్యారు. ఇందులో కుంకీ చిత్ర జోడీ విక్రమ్‌ప్రభు, లక్ష్మీమీనన్లే నటిస్తారనే ప్రచారం జరిగింది. ఆ తరువాత కాళిదాస్ జయరామ్ నటించనున్నారనే టాక్ హల్చల్ చేసింది. అయితే ప్రభుసాల్మన్ మాత్రం మళ్లీ కొత్తవారినే నటింపజేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తన కథకు తగ్గ నటీనటుల అన్వేషణలో పడ్డారు. కాగా ఇప్పుడాయన కథకు తగ్గ నాయకి లభించిందన్నది తాజా వార్త. మరో నట వారసురాలిని తెరంగేట్రం చేయడానికి ప్రభుసాల్మన్ సిద్ధం అయ్యారని తెలిసింది. ఆమె ఎవరో కాదు నట దంపతులు రాజశేఖర్–జీవితల పెద్ద కూతురు శివాని అని ప్రచారం జరుగుతోంది. విషయమేమింటంటే ఈ అమ్మడు ఇటీవలే తాను ముందుగా కోలీవుడ్‌లోనే నాయకిగా పరిచయం అవుతానని స్టేట్మెంట్ ఇచ్చేసిందన్నది గమనార్హం. మరి ప్రభుసాల్మన్ దర్శకత్వంలో నటించే అవకాశం వరించిందంటే శివానికి నిజంగా లక్కే అవుతుంది. -
బరువును నేను పట్టించుకోను!
బరువు తనను ఏవిధంగానూ బాధించదని అంటున్నారు నటి లక్ష్మిమీనన్. కుంకీ, మంజాపై లాంటి చిన్న చిత్రాల ద్వారా నటిగా మంచి పేరు సంపాదించుకున్న ఈ మాలీవుడ్ భామకు ఆ తరువాత విశాల్, కార్తీ, జయంరవి లాంటి స్టార్ హీరోలతో నటించే అవకాశం లభించిది. అయినా ఎందుకనో ఈ అమ్మడు పోటీలో వెనక పడిపోయారు. నిజానికి లక్ష్మిమీనన్ నటించిన చిత్రాలు అధికశాతం విజయం సాధించాయి. ఆ మధ్య విశాల్‌తో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించి కాస్త కలకలం సృష్టించిన ఈ ముద్దుగుమ్మ కథకు అవసరం అనిపిస్తే గ్లామర్‌గా నటించడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు కూడా. అలాగే విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రంలో మోడరన్ యువతిగా నటించారు. అయితే ఆ చిత్రంలో కాస్త బరువు పెరిగిందనే ప్రచారం జరుగుతోంది. అంతే కాదు అది చాలా ఎఫెక్ట్ అయిందంటున్నారు కోలీవుడ్ వర్గాలు. లక్ష్మిమీనన్ బరువును చూసి ఆమెను ఎంపిక చేయాలనుకున్న దర్శక నిర్మాతలు నటీమణులు మంజిమామోహన్ లాంటి వర్ధమాన నటీమణులపై దృష్టిసారిస్తున్నారట. వారి పారితోషికం కూడా తక్కువ కావడం, వారి ఎదుగుదల కూడా ఇందుకు కారణం అనే ప్రచారం జరుగుతోంది. ఇది నటి లక్ష్మిమీనన్ చెవిని తాకిందట. అయితే ఈ విషయం గురించి ఈ భామ అస్సలు పట్టించుకోవడం లేదట. ప్రస్తుతం ఒక్క చిత్రం కూడా చేతిలో లేని లక్ష్మిమీనన్ ఇప్పుడు అవకాశాల వేటలో పడ్డారు. నటనకు అవకాశం ఉంటే ఇంతకు ముందు వేదాళం చిత్రంలో అజిత్‌తో కలిసి నటించినట్లు చెల్లెలి పాత్రల్లో కూడా నటించడానికి సిద్ధం అని అంటున్నారని తెలిసింది. అదే విధంగా తనను ఒక ప్రముఖ నటిగా చూడకుండా సాధారణ నాయకిగానే చూడాలని, ఇంతకు ముందు దర్శక నిర్మాతలు అలానే భావించేవారని చెప్పుకొచ్చారు. ఇక బరువెక్కడం వల్ల అవకాశాలు రావన్న చింత తనకు లేదని, తనకు నప్పే పాత్రలయితే దర్శక నిర్మాతలు కచ్చితంగా తనకు అవకాశాలు ఇస్తారనే నమ్మకాన్ని వ్యక్తపరుస్తున్నారీ జాన.