
గుదిబండగా మారిన నాలుగు కుంకీ ఏనుగులను ఏపీకి అంటగట్టిన కర్ణాటక
ఒకటి గుడ్డిది.. ఒకటి పిచ్చిది
మిగిలిన రెండూ పనికిరానివే
వాటిని తెచ్చి గొప్పగా ప్రచారం చేసుకున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
వచ్చే 25 ఏళ్లు వాటిని భరించడానికి ఖర్చు తడిసిమోపెడు
సాక్షి, అమరావతి: గ్రామాలపై ఏనుగుల దాడిని నిలువరించడానికి కర్ణాటక ప్రభుత్వం రాష్ట్రానికి బహుమతిగా ఇచ్చిన నాలుగు కుంకీ ఏనుగులు పనికిరానివని తేలింది. వాటిని మేపలేక అక్కడి ప్రభుత్వం ‘గజ’కర్ణ విద్యను ప్రదర్శించి ఏపీకి అంటగట్టి చేతులు దులుపుకున్నట్లు తెలుస్తోంది. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం దీన్ని పెద్ద ఘనతగా ప్రచారం చేసుకుని ఇప్పుడు కిక్కురుమనడంలేదు. తీసుకువచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్ కూడా నిర్వహించలేదు. దీన్నిబట్టే వాటి సామర్థ్యం ఏమిటో స్పష్టమవుతోంది.
అడవి ఏనుగుల కట్టడి కోసం తెచ్చి..
తమిళనాడు, కర్ణాటక సరిహద్దుల్లో ఉన్న చిత్తూరు, ఒడిశా సరిహద్దులో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల పరిధిలో అడవి ఏనుగులు తరచూ ఊళ్లపై పడి పొలాల్ని ధ్వంసం చేయడం, మనుషులపై దాడి చేస్తుండటంతో వాటిని నియంత్రించే కుంకీ ఏనుగులను తీసుకొచ్చి సమస్య పరిష్కరిస్తామని అధికారంలోకి వచ్చాక ఉపముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్ కళ్యాణ్ హడావుడి చేశారు. దీనిలోభాగంగా ఆయన రెండుసార్లు కర్ణాటక వెళ్లి అక్కడి ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు.
గత మే నెలలో ఆయన కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా నాలుగు కుంకీ ఏనుగుల్ని వేడుకగా స్వీకరించారు. తమ రాష్ట్రంలో 3,695 ఏనుగులు ఉన్నాయని, ఏపీకి అవసరం కావడంతో కుంకీ ఆపరేషన్‌లో శిక్షణ పొందిన రంజన్ (26), దేవ (39), అభిమన్యు (14), కృష్ణ (15) అనే ఏనుగుల్ని ఏపీకి ఇస్తున్నట్లు సిద్ధరామయ్య చెప్పారు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ ఎంతో చొరవ చూపారని, ఆయన వల్లే కుంకీ ఏనుగుల్ని ఏపీకి ఇస్తున్నట్లు చెప్పారు. మరో రెండు ఏనుగుల్ని త్వరలో ఇస్తామని కూడా పేర్కొన్నారు.
రెండు నెలలైనా ఒక్క కుంకీ ఆపరేషన్ లేదు
తీసుకొచ్చిన ఏనుగుల్ని చిత్తూరు జిల్లా పలమనేరు సమీపంలోని ఎలిఫెంట్ క్యాంప్‌లో అటవీ అధికారులు ఉంచారు. అవి వచ్చి రెండు నెలలైనా వాటితో ఒక్క కుంకీ ఆపరేషన్ కూడా నిర్వహించలేదు. ఎందుకని ఆరా తీయగా వాటికి ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదని తేలింది. వాటిని పోషించడమూ దండగేనని అటవీ శాఖాధికారులు నెత్తీనోరూ బాదుకుంటున్నారు. అందులో దేవ అనే ఏనుగు గుడ్డిదని సమాచారం. అది ఒక కంటితో మాత్రమే చూడగలదని అధికారులు గుర్తించారు.

మరో ఏనుగు రంజన్ పిచ్చిదని, దాన్ని అదుపు చేయడం మావటివల్ల కూడా కావడం లేదని తెలుస్తోంది. మిగతా రెండు ఏనుగులకూ కుంకీ ఆపరేషన్ చేసే సామర్థ్యం లేదని, అవి ఎందుకూ పనికిరావని అధికారులు తేల్చేశారు. దీంతో అటవీశాఖ కక్కలేక మింగలేక నీళ్లు నములుతోంది. ఈ ఏనుగుల పోషణకు ఒక్కో దానికి ఏడాదికి రూ.25లక్షలు ఖర్చవుతుందని అంచనా.
నాలుగు ఏనుగులకు ఏడాదికి రూ.కోటి వెచ్చించాలి. మరో 25 ఏళ్లపాటు ఈ భారాన్ని మోయక తప్పదని, పవన్ కళ్యాణ్ అత్యుత్సాహం, ఏపీ అటవీ శాఖాధికారుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగం లేని ఏనుగులను తీసుకొచ్చిన ఏపీ సర్కారు రాష్ట్రానికి పెద్ద సమస్యగా మార్చింది. ఇప్పుడు ఏం చేయాలో తెలీక మదనపడుతున్నట్టు సమాచారం.