
కార్వేటినగరం: ఆడికృత్తిక వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని రెండవ రోజు ఆదివారం స్కంధ పుష్కరిణి సమీపంలోని కుమారగిరిపై వెలసిన వళ్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి వారు శనివారం పురవీధుల్లో విహరించారు. ముందుగా స్వామివారిని పట్టువస్త్ర, సుగంధ భరిత పుష్పమాలికలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.
వేడుకగా సారె సమర్పణ
చాకలివానిగుంట ఎస్టీకాలనీకి చెందిన వారు వళ్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారికి ఆనవాయితీ ప్రకారం పట్టువస్త్రాలు, పరిమళ భరిత పుష్పమాలికలను ప్రత్యేక వాయిద్యాల నడుమ నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా తీసుకెళ్లి స్వామివారికి సమర్పించి మొక్కలు తీర్చుకున్నారు.
కనుల పండువగా కల్యాణోత్సవం
వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి కల్యాణాన్ని వేద పండితులు వేద మంత్రాల నడుమ స్వామివారి శిరస్సుపై ముత్యాల తలంబ్రాలు పోసి నేత్రపర్వంగా చేపట్టారు. అమ్మవారి కల్యాణానికి ఉభయదారులుగా ఎంపీపీ లతాబాలాజీ కుటుంబ సభ్యులు వ్యవహరించారు. రాత్రి స్వామివారిని స్కంధపుష్కరిణిలో తెప్పపై ప్రతిష్టించారు. తెప్పపై విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆలయ ఆవరణలో భక్తులకు అన్నదానం చేపట్టారు. కార్యక్రమంలో ఈఓ కృష్ణనాయక్, రవియాదవు, రాజశేఖర్, భక్తులు పాల్గొన్నారు.

తెప్పపై సుబ్రహ్మణ్యస్వామి విహారం

తెప్పపై సుబ్రహ్మణ్యస్వామి విహారం