
అక్రమ కేసులకు భయపడేది లేదు
సదుం: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. అక్రమ కేసులో అరెస్టు అయిన ఎంపీ విడుదల కావాలని సింగిల్‌విండో మాజీ వైస్ చైర్మన్ రమేశ్ రెడ్డి ఆధ్వర్యంలో ఎర్రాతివారిపల్లె అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం పూజలు నిర్వహించారు. అనంతరం 116 టెంకాయలను నాయకులు కొట్టారు. వైఎస్సార్‌సీపీ నేతలను వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందని పెద్దిరెడ్డి వెల్లడించారు. కేసుల పేరుతో జైళ్లలో ఉంచి కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించే గొంతుకలను నియంత్రించాలని భావిస్తే, అది వారి భ్రమ మాత్రమే అన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వ నిర్ణయాలను పార్టీ ఆధ్వర్యంలో ఎదిరించి, ప్రజల పక్షాన పోరాడుతామని స్పష్టం చేశారు. కూటమి పాలనపై ప్రజలు ఈ కొద్దిరోజులకే విసిగి పోయారన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, వైస్ ఎంపీపీ ధనుంజయ రెడ్డి, పుట్రాజు, రమణ, రమణారెడ్డి, వాసు, ఎంపీటీసీ సభ్యుడు మల్లికార్జున, ఈశ్వర్ రెడ్డి, తిమ్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.