చౌడేపల్లె: కోరిన కోర్కెలు తీర్చుతూ భక్తులపాలిట వరాలిచ్చే ఆరాధ్య దైవంగా విరాజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. భక్తులు అధిక సంఖ్యలో బోయకొండకు చేరుకుని అమ్మవారికి విశిష్ట పూజలు నిర్వహించారు. భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో క్యూలైన్లు అన్నీ కిక్కిరిసిపోయాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు ిపిండి, నూనెదీపాలు, మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం పర్యవేక్షణలో అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.
20న విద్యుత్ గ్రీవెన్స్
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం బుధవారం విద్యుత్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు. స్థానిక గాంధీరోడ్డులోని ట్రాన్స్‌కో అర్బన్ ఈఈ కార్యాలయంలో ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ఈఈ మునిచంద్ర తెలిపారు. చిత్తూరు, పూతలపట్టు వినియోగదారులు సమస్యలను రాతపూర్వకంగా ఫిర్యాదు చేయాలని వివరించారు.
అటవీ ప్రాంతాల్లోకి వెళ్లొద్దు
చౌడేపల్లె: అంకాలమ్మ కొండ సమీపంలోని అటవీ ప్రాంతాల్లోకి ప్రజలు, పశువులు, గొర్రెలు, మేకల కాపరులు వెళ్లొద్దొంటూ సోమల సెక్షన్ ఆఫీసర్ ఇంద్రాణి హెచ్చరికలు చేశారు. ఆదివారం ఆమె ఆమినిగుంటలో ప్రజలకు అవగాహన కల్పించారు. గత రెండు రోజుల కిందట గొర్రెల మందపై చిరుతపులి దాడి చేసి గొర్రెలను గాయపరిచిన ఘటనపై అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎవరూ అడవుల్లోకి వెళ్లరాదని హెచ్చరించారు. కొండ చుట్టూ పంటలు సాగుచేసిన రైతులు ఒంటరిగా వెళ్లరాదని, అడవి జంతువులు కనిపిస్తే బిగ్గరగా కేకలు వేయాలని సూచించారు. చిరుతపులి ఇటీవల కాలంలో వరుసగా పశువులు, గొర్రెలపై దాడి చేసిందని గుర్తుచేశారు. ఎలాంటి ఘటనలు తలెత్తినా వెంటనే ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆమె వెంట ఎఫ్‌బీఓలు ప్రభాకర్, రామచంద్ర తదితరులు ఉన్నారు.
భక్తులతో పోటెత్తిన బోయకొండ