
రాజనాలబండలో ముగిసిన తిరుణాల
● ప్రత్యేక పూజలందుకున్న వీరాంజనేయస్వామి ● తిరుణాలకు పోటెత్తిన భక్తులు
చౌడేపల్లె: సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ శ్రీ వీరాంజనేయస్వామి ఆలయ తిరుణాల అట్టహాసంగా ముగిసింది. తొలుత రాజనాలబండకు సమీపంలోని కొత్తగూబలవారిపల్లె, దాసరయ్యగారిపల్లె, పెద్దూరు, ఉటూరు గ్రామాలకు చెందిన దేవరెద్దులతో గ్రామపెద్దలు మేళతాళాల నడుమ రాజనాలబండకు చేరుకున్నారు. కొలింపల్లె గ్రామం నుంచి గ్రామదేవత బోయకొండ గంగమ్మ అమ్మవారి ఉత్సవమూర్తితో కలసి ఊరేగింపుగా కోలాటలు, చెక్కభజనలు, పిల్లనగ్రోవుల గానామృతంతో పాటు కత్తిసాముతో నృత్యం చేస్తూ చేరుకుని సంప్రదాయబద్ధంగా బండారు పంపకం జరిగింది. అక్కడి నుంచి దేవరెద్దులతో బోయకొండ అమ్మవారి ఉత్సవమూర్తిని కలశాలను గ్రామపెద్దలు, వంశపారపర్యంగా తెచ్చిన వారికి టీటీడీ డిప్యూటీ ఈఓ వీఆర్ శాంతి రాజనాలబండ ఆలయం వద్ద స్వాగతం పలికారు. ఆలయం చుట్టూ మేళతాళాలతో మూడుసార్లు ప్రదక్షిణలు చేయించి ఆలయంలోకి తీసుకొచ్చారు. వివిధ గ్రామాల నుంచి వేలాదిమంది భక్తులు రాజనాలబండకు రావడంతో భక్తులతో కిటకిటలాడింది. భక్తిశ్రద్ధలతో వీరాంజనేయస్వామికి పూజలు చేశారు. ఉట్లోత్సవం, పోకుమాను బరుగుట వంటి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పోకుమాను పైకి ఎక్కడానికి యువకులు పోటీ పడ్డారు. మల్లువారిపల్లె నుంచి రాజనాలబండ వరకు వాహనాల రద్దీ నెలకొనడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. పోలీసులు రెండు గంటల పాటు శ్రమించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. కార్యక్రమంలో సూపరింటెండెంట్ నాగేంద్ర ప్రసాద్, ఏఈఓ చౌదరి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు భానుప్రకాష్, ధనుంజయరాజు, ఉదయ్‌కుమార్, రాజేష్, శ్రీహర్ష, చంద్రశేఖర్, దిలీప్ తదితరులు పర్యవేక్షించారు.
ప్రత్యేక పూజలందుకుంటున్న వీరాంజనేయస్వామి, పోకుమాను ఎక్కుతున్న యువకులు, దేవరెద్దులను తీసుకొస్తున్న దృశ్యం

రాజనాలబండలో ముగిసిన తిరుణాల

రాజనాలబండలో ముగిసిన తిరుణాల