
టీచర్ల అపరిష్కృత సమస్యలపై వినతి
చిత్తూరు కలెక్టరేట్ : ప్రభుత్వ టీచర్ల అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆ సంఘ నాయకులు ఆదివారం విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం ఆయన విలేకరులకు పలు అంశాలు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వ మెమో 57 ప్రకారం 2003 డీఎస్సీ టీచర్లకు పాత పెన్షన్‌ను అమలు చేయాలని కోరినట్లు తెలిపారు. ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసి అన్ని కేడర్‌లలో ఉద్యోగోన్నతులు చేపట్టాలన్నారు. 12వ పీఆర్‌సీ కమిటీ, ఐఆర్ ప్రకటన, డీఏల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల బకాయిల విడుదల ఆలస్యం అవుతోందని త్వరలో మంజూరు చేస్తామని మంత్రి వెల్లడించారన్నారు. తెలుగు మీడియంను సమాంతరంగా కొనసాగించాలన్నారు. ఈ విద్యాసంవత్సరం 10 వ తరగతి పరీక్షలు తెలుగు మీడియంలో రాయాలనుకునే విద్యార్థులకు అవకాశం కల్పిస్తామని మంత్రి వెల్లడించినట్లు తెలిపారు. అనంతరం సెప్టెంబర్ 1న రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల్లో చేపట్టబోయే మై స్కూల్, మై ప్రైడ్ పోస్టర్లను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరింపజేసినట్లు ఆయన వెల్లడించారు.
వైభవంగా గోకులాష్టమి
నారాయణవనం : పద్మావతీ సమేత కల్యాణ వేంటేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం గోకులాష్టమి పండుగను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేకువనే సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి నిత్య కై ంకర్యాలు సమర్పించారు. తిరుచ్చిపై శ్రీకృష్ణుని కొలువుదీర్చి మాడవీధుల్లో ఊరేగించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామివారు, గోపాలునికి స్నపన తిరుమంజనం జరిపించారు. దేవదేవేరులు, శ్రీకృష్ణస్వామివారిని తిరుచ్చిపై ఊరేగింపుగా పదహారు కాళ్ల మండపానికి వేంచేపు చేశారు. ఈ మేరకు వేడుకగా ఉట్లోత్సవం నిర్వహించారు. యువకులు ఉత్సాహంగా ఉట్టి కొట్టి సందడి చేశారు. అనంతరం ఉత్సవర్లను ఆలయానికి తీసుకువచ్చి ఆస్థానం చేపట్టారు. ఆలయ అధికారి నాగరాజు, ప్రధాన అర్చకులు శ్రీధరభట్టాచార్య, శ్రీనివాసభట్టాచార్య, నరసింహరాఘవ భట్టాచార్య, ఆర్జితం అధికారి భరత్ పాల్గొన్నారు.

టీచర్ల అపరిష్కృత సమస్యలపై వినతి