
ఎవరూ అధైర్య పడొద్దు.. అండగా ఉంటాం
గ్రామ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయండి
వైఎస్సార్‌సీపీ నేతలతో మాజీమంత్రి పెద్దిరెడ్డి
చౌడేపల్లె: కూటమి ప్రభుత్వ వైఫల్యాలను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లాలని వైఎస్సార్‌సీపీ నేతలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. ఆదివారం భాగేపల్లెలో కాగతి సర్పంచ్ షంషీర్, కోఆప్షన్ మెంబరు సాధిక్ బాషా, నేతలు బ్రహ్మానందరెడ్డి, నారాయణరెడ్డితో కలిసి మాట్లాడారు. ఎవరూ అధైర్య పడొద్దని.. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ రానున్న రోజుల్లో తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ కమిటీలను పటిష్టంగా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామాల్లో పార్టీ పటిష్టత కోసం కష్టపడి చురుగ్గా పనిచేసే కార్యకర్తలకు గుర్తింపునిచ్చి కమిటీలో స్థానం కేటాయించాలన్నారు. పార్టీ బలోపేతానికి గ్రామస్థాయిలో ఏర్పాటు చేసిన గ్రామ కమిటీ, రైతు, యువత, మహిళా కమిటీల ఆధ్వర్యంలో సమన్వయంతో ఇంటింటా ప్రచారం నిర్వహించి కూటమి మోసాలు, దౌర్జన్యాలను తెలిపి ప్రజలను చైతన్యవంతులను చేయాలని కోరారు. ఆయన వెంట బాబాజాన్, షేర్‌ఖాన్, నరేష్ తదితరులు ఉన్నారు.