సరుకు చెన్నై చేరకుండానే ప్రియురాలితో పరారైన భాస్కర్‌రెడ్డి ? | Forest Officials Caught 144 A1 Grade Red Sandalwood Logs | Sakshi
Sakshi News home page

సరుకు చెన్నై చేరకుండానే ప్రియురాలితో పరారైన భాస్కర్‌రెడ్డి ?

Aug 14 2025 11:52 AM | Updated on Aug 14 2025 12:20 PM

Forest Officials Caught 144 A1 Grade Red Sandalwood Logs

చిత్తూరు జిల్లా:  బైరెడ్డిపల్లి మండలం ఆలపల్లి కొత్తూరు సమీపంలోని దండుకుంట పొలాల వద్ద ఓ ఇంట్లో 144 ఎర్ర చందనం దుంగలను పలమనేరు ఫారెస్ట్‌ అధికారులు రెండు రోజుల కిందట సీజ్‌ చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా చెబుతున్న భాస్కర్‌రెడ్డి కర్ణాటకలోని బెంగళూరులో జేసీబీ డ్రైవర్‌గా ఉన్న వ్యక్తి ఎలా స్మగ్లర్‌గా మారాడన్నదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది. ఓ సాధారణ డ్రైవర్‌గా ఆపై జేసీబీ ఆపరేటర్‌గా ఉంటూ  ఇంతటి డాన్‌గా మారడంతో ఆయన వెనుక ఎవరి హస్తం ఉందనే కోణంపై స్థానిక అటవీశాఖ విచారణ చేస్తోందని సమాచారం. ఎర్ర చందనం దుంగలున్నాయనే పక్కా సమాచారంతో వెళ్లిన ఫారెస్ట్‌ అధికారులు పక్కన ఉండి తన ప్రియురాలితో పరారైన భాస్కర్‌రెడ్డిని ఎందుకు పట్టుకోలేదనే విషయం ఇప్పుడు పలు అనుమానాలకు తావిస్తోంది. 

సరుకు కట్టిగేనహళ్లికేనా... 
తాజాగా దుంగలు పట్టుబడిన గ్రామం కర్ణాటక రాష్ట్రానికి కూత వేటు దూరంలో ఉంది. శేషాచలం నుంచి హొస్కోట సమీపంలోని కట్టిగేనహళ్లికి ఎన్నో ఏళ్లుగా  చెన్నై–బెంగళూరు జాతీయ రహదారి మీదుగానే ఎర్ర చందనం అక్రమ రవాణా అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన స్మగ్లర్లు ఏపీ సరిహద్దులోని ఆలపల్లి ప్రాంతాన్ని స్టాక్‌ పాయింట్‌ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. హైవే నుంచి ఈ గ్రామం చాలా దçగ్గర్లో ఉంది. ఇక్కడి నుంచి కర్ణాటకలోని చల్లహళ్లి, బైప్పళ్లి, కగ్గనహళ్లిల మీదుగా హైవేలో ఎలాంటి టోల్‌గేట్లు లేకుండా  హోస్‌కోటకు అడ్డదారులున్నాయి. దీంతో ఇక్కడి నుంచి దుంగలను కర్ణాటకలోని కట్టిగేనహళ్లికి తరలిస్తున్నారనే సమాచారం. 

స్మగ్లర్లకు ఆ గ్రామం అడ్డా  
కొన్నేళ్లుగా శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలుతున్న ఎర్ర చందనం కర్ణాటక రాష్ట్రంలోని హోస్కోట సమీపంలోని కట్టినేనహళ్లికి చేరుతోంది. ఈ గ్రామం ఎర్ర చందనం స్మగ్లింగ్‌కు పేరు గాంచింది. ఆ గ్రామానికి చెందిన వసీంఖాన్, నదీంఖాన్‌ అంతర్జాతీయ ఎర్ర స్మగర్లుగా పేరొందారు. వీరి అండతో  ఆ గ్రామస్తులు రెండు దశాబ్దాలుగా ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణాను వృత్తిగా చేసుకున్నారు. ఈ గ్రామంలో దాదాపు 20 మంది ఎర్ర స్మగర్లుండగా వీరిలో ఆరుగురు అంతర్జాతీయ ఎర్ర చందనం డాన్‌లు ఉన్నారు. ఈ గ్రామానికి కొత్త వ్యక్తులు వెళ్లి తిరిగీ రావడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఖాకీ చొక్కా కనబడితే అంతే సంగతులు. ఒక్కో గ్యాంగ్‌లో వంద మంది దాకా ప్రైవేటు సైనాన్ని నిర్వహిస్తున్నారు. గ్రామంలో అన్ని కుటుంబాల వారు ఇదే వృత్తిగా మార్చుకున్నారు. గ్రామ పొలిమేరల్లోని కోళ్లఫారాలు, వ్యవసాయ పొలాల వద్ద ఉన్న ఇళ్లనే ఎర్ర చందనం గోడౌన్లుగా మార్చేసుకున్నారు. ఇప్పటికే ఆ గ్రామానికి వెళ్లిన కన్నడ పోలీసులు, ఈ ప్రాంతం నుంచి వెళ్లిన  పోలీసులపై గతంలో దాడులు కూడా జరిగాయి.  

పట్టుబడిన దుంగలు ఏ–1 గ్రేడ్‌  
పట్టుబడిన ఎర్ర చందనం దుంగలు ఏ–1 గ్రేడ్‌వని పలమనేరు సబ్‌ డీఎఫ్‌ఓ వేణుగోపాల్‌ మీడియాకు తెలిపారు. అత్యంత ధర ఫలికే ఈ దుంగలను జపాన్, చైనా దేశాలకు తరలిస్తారన్నారు. ఈ దుంగలు కట్టెగేనహళ్లిలో గ్రేడింగ్‌ చేశాక మంగళూరు సముద్ర తీరం నుంచి తీసుకెళ్లి అక్కడి నుంచి స్టీమర్ల ద్వారా తరలిస్తుంటారని తెలుస్తోంది. స్టీమర్లలోని ఖాళీ ప్రదేశాల్లో దుంగల నుంచి దుబాయ్‌కు తరలిస్తారని గతంలో పలమనేరు పోలీసులకు పట్టుబడ్డ నాజర్‌ఖాన్‌ తెలిపాడు. ఈ స్మగ్లింగ్‌లో కన్నడ పోలీసులతో పాటు, పోర్టు  సిబ్బందితో పాటు సెంట్రల్, ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ సిబ్బంది కూడా భాగస్వామ్యులేనని గతంలో పోలీసుల విచారణలో తేలింది. ఏదేమైనా ఫారెస్ట్‌ అధికారులు ఈ కొత్త పుష్పాలు, కనిపించని పుష్పాలను ఎలా పట్టుకుంటారో కేసును ఎలా ఛేదిస్తారో వేచి చూడాల్సిందే. కాగా ఈ విషయమై స్థానిక సబ్‌ డీఎఫ్‌ఓ వేణుగోపాల్, ఎఫ్‌ఆర్వో నారాయణలను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు.

ఇసుక మాటున అక్రమ రవాణా 
శేషాచలం అడవుల నుంచి సేకరించిన దుంగలను పలు మార్గాల ద్వారా ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా ఇసుక టిప్పర్లు, ట్రాక్టర్‌లలో ఇసుక చాటున తరలిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రికార్డులు లేని కార్లను కూడా స్మగ్లింగ్‌కు వాడుకున్నట్లు సమాచారం. ఫ్రీ ఇసుక పాలసీ కావడంతో ఇసుక ట్రాక్టర్‌ను ఎవరూ ఆపడంలేదు. దీంతో ఎలాంటి అనుమానం రాకుండా స్మగర్లు ఇలా దుంగలను సరిహద్దులు దాటిస్తున్నట్లు సమాచారం. ఆలపల్లి వద్ద పొలాల వద్దనున్న ఇంటి వద్దకు కేవలం ఇసుక ట్రాక్టర్లు, కొన్ని కార్లు మాత్రమే వచ్చేవని స్థానికులు చెబుతున్నారు. దీన్ని బట్టి ఈ ఇసుక లోపలే దుంగలు ఇక్కడికి చేరుతున్నట్లు తెలుస్తోంది.

ప్రధాన స్మగ్లర్‌ ఉడాయింపుపై అనుమానాలు 
ఆలపల్లి సమీపంలోని దండుకుంట వద్ద ఓ ఇంట్లో ఎర్ర చందనం దుంగలున్నాయని స్థానిక ఫారెస్ట్‌ అధికారులకు సమాచారం అందింది. సోమవారం మధ్యాహ్నం అక్కడికి అధికారులు చేరుకున్నారు. ఇంటిపై దాడిచేసి అక్కడి దుంగలను స్వా«దీనం చేసుకుంటుండగానే అక్కడే నిందితుడు భాస్కర్‌రెడ్డి ఉన్నాడని సమాచారం. అధికారులను చూసిన నిందితుడు పొలంలో ఉన్న తన ప్రియురాలికి కాల్‌ చేసి పక్కనే ఆపి ఉన్న కారు వద్దకు రమ్మని దాంట్లో ఇద్దరూ ఉడాయించారు. అయితే వీరిని ఫారెస్ట్‌ అధికారులు ఎందుకు పట్టుకోలేదనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement