
జిల్లా కోర్టులో ప్రథమ చికిత్స కేంద్రం
చిత్తూరు లీగల్ : చిత్తూరులోని జిల్లా న్యాయస్థానాల సముదాయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రథమ చికిత్స కేంద్రాన్ని జిల్లా జడ్జి అరుణసారిక ప్రారంభించారు. కక్షిదారులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు.. ఎవ్వరైనా సరే ప్రథమ చికిత్స అవసరమైనప్పుడు ఇక్కడ వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారని జిల్లా జడ్జి తెలిపారు. న్యాయస్థానాలు పనిచేసే రోజుల్లో ప్రథమ చికిత్స కేంద్రం కూడా పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు, న్యాయశాఖ ఉద్యోగులు పాల్గొన్నారు.
నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం నిర్వహించనున్నట్లు జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈఓ రవికుమార్‌నాయుడు తెలిపారు. ఉదయం 10 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో కార్యక్రమం ఉంటుందన్నారు. కార్యక్రమానికి కలెక్టర్, ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు హాజరవుతారన్నారు. అధికారులు సమాచారంతో రావాలని కోరారు.
కాణిపాకం..జనసందడి
కాణిపాకం : కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినా యకస్వామి దేవస్థానం శుక్రవారం భక్తజన సందడితో రద్దీగా మారింది. ఉచిత దర్శనం మొదలు శీఘ్ర, అతిశీఘ్ర, వీఐపీ దర్శనం వరకు భక్తులతో క్యూలైన్లు కిక్కిరిశాయి. మూడు రోజుల పాటు సెలవులు కావడంతో ఆలయం భక్త జనులతో కిటకిటలాడింది. వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలయ అధికారులు చర్యలు తీసుకున్నారు. శని, ఆదివారాల్లో ఆలయానికి భక్తుల తాకిడి మరింత అధికంగా ఉంటోందని ఆలయ అధికారులు చెబుతున్నారు.
వాణ్యిసముదాయానికి
వేలంపాటతో ఆదాయం
వెదురుకుప్పం : మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన వాణిజ్య సముదాయానికి అధికారులు ఎట్టకేలకు వేలంపాట నిర్వహించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి డిప్యూటీ సీఎం నారాయణస్వామి వెదురుకుప్పం పంచాయతీని వ్యాపారపరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి పూనుకున్నారు. జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులుతో మాట్లాడి రూ.50 లక్షలు జెడ్పీ నిధులు మంజూరు చేయించారు. దీంతో వైఎస్సార్‌సీపీ నాయకుడు, కాంట్రాక్టర్ రామయ్య 11 గదులు నిర్మించి పూర్తి చేశారు. అప్పట్లోనే మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రారంభోత్సవం చేసేశారు. అయితే వేలం పాట సమయానికి ఎన్నికల కోడ్ రావడంతో ఆగిపోయింది. ఇదే సమయంలో ప్రభుత్వం మారడంతో టీడీపీ నాయకుల పెత్తనం ఎక్కువైంది. స్థానిక సర్పంచ్ శిల్ప వేలం పాటకు నోటీస్ అందించి తేదీ నిర్ణయించినా టీడీపీ నేతలు అధికారులను బెదిరించి జరపకుండా అడ్డుకున్నారు. ఈక్రమంలో వేలం పాట నిర్వహించాలంటూ రామయ్య హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో విధి లేని పరిస్థితుల్లో అధికారులు శుక్రవారం వేలం పాట నిర్వహించారు. 11 గదుల కొత్త షాపింగ్ కాంప్లెక్స్‌ను వేలం వేయగా నెలకు రూ. 65,500, 10 గదుల పాత కాంప్లెక్స్ గదుల వేలం ద్వారా నెలకు రూ. 28,300 వచ్చినట్లు కార్యదర్శి కోదండరామిరెడ్డి తెలిపారు. అదేవిదంగా వారపు సంత వేలం ద్వారా సంవత్సరానికి రూ. 1,81,500 వచ్చిందన్నారు. మొత్తానికి అన్ని విధాలా సంవత్సరానికి రూ. 13,07,100 ఆదాయం పంచాయతీకి వచ్చిందన్నారు. వేలం పాటలో ఎంపీడీఓ పురుషోత్తం, సర్పంచ్ శిల్ప, డిప్యూటీ ఎంపీడీఓ బాలసుబ్రమణ్యం, కార్యదర్శి కోదండరామిరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా కోర్టులో ప్రథమ చికిత్స కేంద్రం

జిల్లా కోర్టులో ప్రథమ చికిత్స కేంద్రం