– సినిమా టికెట్ కంటే పాప్ కార్న్ ధరే ఎక్కువ
చిత్తూరు రూరల్ (కాణిపాకం) : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సినిమా థియేటర్లపై రెవెన్యూ అధికారులు బుధవారం తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. కొన్ని థియేటర్లకు లైసెన్సు లేకుండా నడుస్తుంటే మరికొన్ని ఫైర్ సర్టిఫికెట్ లేకుండా నిర్వహిస్తున్నారు. కొత్త థియేటర్లతో పోలిస్తే పాత థియేటర్ల పరిస్థితి అధ్వానంగా ఉందని అధికారులు తనిఖీలో బట్టబయలైంది. ప్రేక్షకులకు కనీసం తాగునీరు అందుబాటులో లేదని, మరుగుదొడ్లు దుర్వాసన వెదజల్లుతూ అధ్వాన్నంగా ఉన్నట్లు గుర్తించారు.
నిబంధనలకు విరుద్ధంగా ద్విచక్రవాహనానికి రూ.20, కారుకు రూ.40 చొప్పున వసూలు చేస్తున్నట్లు తనిఖీలో గుర్తించారు. చిత్తూరు నగరంలో మొత్తం 6 థియేటర్లను రెవెన్యూ అధికారులు తనిఖీ చేశారు. ఇందులో రెండు థియేటర్లల్లో ఫైర్ సర్టిఫికెట్ లేకుండా నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. బయట రూ.10 అమ్మే పాప్ కార్న్ థియేటర్‌లో రూ.100గా ఉన్నట్లు గుర్తించారు. వాటర్ బాటిల్ కూడా ఎమ్మార్పీ కన్నా అధికంగా విక్రయిస్తున్నారని గుర్తించారు. ఫస్ట్ ఎయిడ్ కిట్లు, శానిటేషన్ సర్టిఫికెట్లు లేవని తనిఖీలో బయటపడిందన్నారు.


