‘ఇంటర్‌’లో బదిలీల కుదుపు | - | Sakshi
Sakshi News home page

‘ఇంటర్‌’లో బదిలీల కుదుపు

May 26 2025 12:17 AM | Updated on May 26 2025 12:17 AM

 ‘ఇంట

‘ఇంటర్‌’లో బదిలీల కుదుపు

చిత్తూరు కలెక్టరేట్‌ : ఇంటర్మీడియట్‌ విద్యాశాఖలో టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల బదిలీలు షురూ అయ్యాయి. ఉద్యోగుల బదిలీల షెడ్యూల్‌ను రాష్ట్ర ఇంటర్మీడియట్‌ అధికారులు విడుదల చేశారు. ఆన్‌లైన్‌లో జూన్‌ 8వ తేదీ వరకు బదిలీల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఈ ఏడాది కొత్తగా ప్రిన్సిపల్స్‌, జూనియర్‌ లెక్చరర్లు, వారి పనితీరు ఆధారంగా పాయింట్‌లను కేటాయించనున్నారు. ఒక కళాశాలలో అయిదేళ్లు ఒకేచోట పనిచేసిన ప్రిన్సిపల్స్‌, జూనియర్‌ లెక్చరర్లు తప్పనిసరిగా బదిలీ కానున్నారు. రెండేళ్లు పూర్తయిన సిబ్బంది రిక్వస్ట్‌ బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు జిల్లాలో 468 కి పైగా ప్రిన్సిపల్స్‌, లెక్చరర్లు, ఇతర సిబ్బందికి స్థానచలనం ఉంటుందని అధికారులు వెల్లడిస్తున్నారు.

పాయింట్ల కేటాయింపు ఇలా..

బదిలీల్లో ప్రిన్సిపల్స్‌, జూనియర్‌ లెక్చరర్లకు పాయింట్లు కేటాయించనున్నారు. 16 శాతం హెచ్‌ఆర్‌ఏ ఉన్న కేటగిరీ–ఏ ఉంటే ఏడాదికి 2 పాయింట్లు, 12 శాతం హెచ్‌ఆర్‌ఏలో పనిచేస్తుంటే ఏడాదికి 4 పాయింట్లు, 10 శాతంలో పనిచేస్తున్న జేఎల్‌ లకు ఏడాదికి 6 పాయింట్లు ఇస్తారు. అలాగే గిరిజన ప్రాంతాల్లో పనిచేస్తుంటే ఏడాదికి 8 పాయింట్లు కేటాయిస్తారు. వీరి పనితీరును బట్టి బదిలీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. అలాగే జూనియర్‌ లెక్చరర్లకు ఆయా సబ్జెక్టుల్లో ఇంటర్‌ ఫలితాల్లో 40 శాతం ఉత్తీర్ణులైతే ఎలాంటి పాయింట్లు ఉండవు. 41–60 శాతం వరకు అయితే 2 పాయింట్లు, 61–80 శాతం వరకు 4 పాయింట్లు, 81–100 శాతానికి 6 పాయింట్లు కేటాయిస్తారు. అలాగే ప్రిన్సిపల్స్‌కు పాయింట్లు కేటాయించనున్నారు. జిల్లాలో 75 అన్ని యాజమాన్యాల ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలున్నాయి. ఇందులో అధ్యాపకులు, సిబ్బంది కలిపి 500 కు పైగా విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో ఐదేళ్లు పూర్తి అయిన వారికి కచ్చితమైన బదిలీ జరగనుంది. రెగ్యులర్‌ బదిలీల తర్వాత కాంట్రాక్ట్‌ లెక్చరర్లకు ఖాళీల ఆధారంగా పోస్టులను కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.

తప్పనిసరిగా స్థాన చలనం

వెబ్‌ కౌన్సెలింగ్‌లో నిర్వహించే ఈ ప్రక్రియలో బదిలీల ఉత్తర్వులను జూన్‌ 8వ తేదీ లోగా జారీ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2025 మే 31 నాటికి ఒకే కేంద్రంలో ఐదేళ్లు పనిచేస్తే తప్పనిసరిగా బదిలీ కావాల్సిందేనని, రెండేళ్లు పూర్తయిన వారు రిక్వస్ట్‌ బదిలీలకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 2027 మే 31వ తేదీ లోపు ఉద్యోగ విరమణ పొందే వారికి బదిలీల నుంచి మినహాయింపు కల్పించారు.

జిల్లాలో దాదాపు 468కి పైగా స్థానచలనం

జూన్‌ 8 దాకా బదిలీల ప్రక్రియ నిర్వహణ

కసరత్తు చేస్తున్న ఇంటర్మీడియట్‌ అధికారులు

బదిలీల అనంతరమే ఒప్పంద అధ్యాపకులకు పోస్టింగులు

మేనేజ్‌మెంట్ల వారీగా కళాశాలలు ఇలా..

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు 31

హైస్కూల్‌ ప్లస్‌ 24

కేజీబీవీ 08

సోషల్‌ వెల్ఫేర్‌ గురుకులాలు 04

బీసీ వెల్ఫేర్‌ గురుకులాలు 01

ఏపీ మోడల్‌ స్కూల్స్‌ 07

మొత్తం కళాశాలలు 75

పకడ్బందీగా బదిలీలు చేపడుతున్నాం

రాష్ట్ర ఇంటర్మీడియట్‌ అధికారుల ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియను పకడ్బందీగా చేపడుతున్నాం. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకుంటున్నాం. షెడ్యూల్‌ మేరకు అందిన అభ్యంతరాలను పకడ్బందీగా పరిశీలించి ఆదివారం తుది జాబితాను విడుదల చేస్తున్నాం. బదిలీల్లో ఎవరైన నిబంధనలను అతిక్రమించినట్లు తన దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – డా.ఆదూరు శ్రీనివాసులు,

ఆర్జేడీ, డీఐఈవో (ఇంటర్మీడియట్‌), చిత్తూరు

31న బదిలీ పోస్టింగులు

బదిలీల షెడ్యూల్‌ మేరకు ఆదివారం అభ్యంతరాలు పరిశీలన చేసి, తుది జాబితాను విడుదల చేయనున్నారు. ఈనెల 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ఖాళీల ప్రకటన, వెబ్‌ ఆప్షన్‌ల నమోదుకు అవకాశం కల్పించి ఈనెల 31న పోస్టింగ్‌లను కేటాయింపు చేస్తారు. బదిలీలకు అర్హులైన అభ్యర్థుల జాబితాను ఇప్పటికే పోర్టల్‌లో ప్రకటించారు. అధికారులు ధ్రువీకరణ చేసిన జాబితాలో ఉన్న అభ్యర్థులు మాత్రమే ఆన్‌లైన్‌లో తమ ఎంపికలను నమోదు చేయాల్సి ఉంటుంది. పోస్టింగ్‌ ఆర్డర్స్‌ సైతం ఆన్‌లైన్‌లోనే డౌన్‌లోడ్‌ చేసుకుని తమకు కేటాయించిన స్థానాల్లో చేరాలని అధికారులు చెబుతున్నారు.

 ‘ఇంటర్‌’లో బదిలీల కుదుపు1
1/1

‘ఇంటర్‌’లో బదిలీల కుదుపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement