ఇసుక ధరలకు రెక్కలు
● వర్షాలతో చెరువులు,కౌండిన్యలోకి చేరిన వరద ● మూడు నెలలు ఇసుక తోడేందుకు వీలుకాని పరిస్థితి ● ఇప్పటికే దాచుకున్న ఇసుక డంపులకు డిమాండ్ ● ట్రాక్టర్ ఇసుక ఇప్పుడు రూ.4 వేలకు పైమాటే ● సిండికేట్‌గా ఏర్పడి అమాంతం పెంచిన అక్రమార్కులు
సీజ్ చేసి తక్కువ ధరకు అందించాలి
పలమనేరు ప్రాంతంలో కౌండిన్య నదిని ఆ నుకుని ఇన్నాళ్లు ఇసుక ను తోడిన కూటమి ఇ సుకాసురులెవరు? వారెక్కడ ఇసుకను డంపు చే శారో అధికారులకు తెలియందేమీ కాదు. దీనికోసం దాడులు అవసరంలేదు. వారికే తెలుసు కాబట్టి దాన్ని సీజ్ చర్యలు తీసుకోవాలి. సీజ్ చేసిన ఇసుకను అవసరమైన వారికి తక్కువ ధరతో అందుబాటులోకి తీసుకురావాలి.
– వెంకటేగౌడ, మాజీ ఎమ్మెల్యే, పలమనేరు
ఇసుక తవ్వకాలను ప్రకృతే అడ్డుకుంది
మండలంలోని కౌండిన్యతో పాటు పలు చెరువుల్లో కూటమి నాయకులు ఇన్నాళ్లు ఇసుక, మట్టిని కొల్లగొట్టేశారు.ఈ విషయం తెలిసినా అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆ ప్రకృతే వర్షాన్ని కురిపించి వాగులు, వంకలు పొర్లి చెరువుల్లోకి నీరు చేరింది. దీంతో ఇసుక తవ్వకాలకు ఆ వరుణుడే బ్రేక్ వేశాడు.
– నరసింహారెడ్డి, వైస్ సర్పంచ్, కొలమాసనపల్లి
పలమనేరు : పలమనేరు రెవెన్యూ డివిజన్‌లో కూటమి పేరు చెప్పుకొని కొందరు ఇసుకాసురులు కౌండిన్య నదిలోని ఇసుకను భారీగా తరలించి రహస్య ప్రదేశాల్లో దాచుకున్నారు. వారం రోజులుగా స్థానికంగా కురిసిన భారీ వర్షాలతో పలు చెరువులు , నదిలోకి వరద నీరు చేరడంతో మరో మూడు నెలల దాకా ఇసుక తరలించేందుకు వీలు కాని పరిస్థితి ఏర్పడింది. ఇసుకాసురుల తవ్వకాలకు వరుణుడే అడ్డుకట్ట వేశాడు. దీంతో నదిలో ఇసుక తవ్వకాలు నిలిచిపోయాయి. కానీ గతంలో డంప్ చేసిన ఇసుకను ఇప్పుడు ఇసుకాసురులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. గతంలో ట్రాక్టర్ ఇసుక రూ.2,500 ఉండగా ఇప్పుడు రూ.4 వేలకు చేరింది. మరో పది రోజుల తర్వాత ఈ ధర రూ.5 వేలు దాటడం ఖాయంగా కనిపిస్తోంది. దీంతో డంపులు పెట్టుకున్న ఇసుకాసురుల పంట పండనుంది.
దొరికనంత దోచేశారు..
వర్షాలొస్తే ఇసుక దొరకదేమోనని ఏడాదిగా కౌండిన్య నది, చెరువుల్లో నిత్యం ఇసుకు తోడిన అక్రమార్కులు భారీగా రహస్య ప్రదేశాల్లో డంపులకు చేర్చుకున్నారు. ముందుగా నదిలోని ఇసుకను దొరికినంత దోచుకోవడం కోసం ఒకరిమీద మరొకరు పోటీలు పడి మరీ ఇసుకను పోగేసుకున్నారు. కౌండిన్య నదికి ఆనుకుని ఉన్న గ్రామాల్లో కొందరు కూటమి పేరు చెప్పుకొని అప్పులు చేసి మరీ ట్రాక్టర్లు, జేసీబీలను తెచ్చి ఇసుకను తోడేశారు.
నిల్వ చేసుకున్న గ్రామాలు ఇలా..
నియోజకవర్గంలోని గంగవరం మండలంలో కౌండిన్య నదికి ఆనుకుని ఉన్న జీడిమాకులపల్లి, బైపాస్ రోడ్డు, క్యాటిల్‌ఫామ్, రామాపురం పొలా లు, మారేడుపల్లి, ముబ్బువాళ్లపేట, పలమనేరు మండలంలోని మొరం, కూర్మాయి, జల్లిపేట, మొసలిమడుగు, సముద్రపల్లి, కూర్మాయి, జంగాళపల్లి, తావడపల్లి, వడ్డూరు, పెద్దపంజాణి మండలాల్లోని 20 దాకా గ్రామాల్లో భారీగా ఇసుక డంపులున్నాయి.
సిండికేట్‌గా ఏర్పడి అమాంతం ధరలు పెంచి..
వర్షాల కారణంగా ఇసుకకు డిమాండ్ వచ్చిపడింది. దీంతో ఇప్పటికే దాచుకున్న ఇసుకాసురులు సిండికేట్‌గా ఏర్పడి ట్రాక్టర్ ఇసుక రూ.4 వేల దాకా పెంచేశారు. త్వరలో ఇది రూ.5 వేలు దాటడం ఖాయం. గతంలో కర్ణాటకలోని హోసకోట్ వ్యాపారులకై తే ఇక్కడ టిప్పర్ రూ.28 వేల దాకా అమ్మేవారు. ఇప్పుడు టిప్పర్ ధర రూ. 40 వేలకు చేరింది. సంబంధిత శాఖలైన మైనింగ్, రెవెన్యూ, పోలీస్, నీటి పారుదల అధికారులు రహస్య డంపులను సీజ్ చేయాల్సిన అవసరం ఉంది. వీటిని అధికారుల ద్వారా సామాన్యులకు అందుబాటు ధరలతో విక్రయించినా ప్రభుత్వానికి ఆదాయం దక్కుతుందనే మాట స్థానికంగా వినిపిస్తోంది.
ఇసుక ధరలకు రెక్కలు
ఇసుక ధరలకు రెక్కలు
ఇసుక ధరలకు రెక్కలు


