తప్పులు దొర్లకుండా.. నష్టం కలగకుండా
● బదిలీలు, ఉద్యోగోన్నతుల కసరత్తు వేగవంతం ● ఉమ్మడి చిత్తూరు జిల్లా కసరత్తు ప్రక్రియలో విద్యాశాఖ నిమగ్నం ● జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న ప్రక్రియ ● పర్యవేక్షించిన చిత్తూరు, తిరుపతి డీఈవోలు వరలక్ష్మి, కేవీఎన్ కుమార్
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో టీచర్ల బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ త్వరలో నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియలో ముందస్తు కసరత్తును చిత్తూరు విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపడుతున్నారు. శనివారం చిత్తూరు జిల్లా కేంద్రంలోని డీఈఓ కార్యాలయం పక్కనున్న ప్రభుత్వ పాఠశాలలో బదిలీలు, ఉద్యోగోన్నతుల ప్రక్రియ కసరత్తు నిర్వహించారు. ఈ ప్రక్రియలో తప్పులు దొర్లకుండా..ఉపాధ్యాయులకు నష్టం కలగకుండా విద్యాశాఖ అధికారులు కసరత్తు నిర్వహిస్తున్నారు. ఈ కసరత్తులో చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల విద్యాశాఖ అధికారులు, డీవైఈఓలు, ఎంఈఓలు పాల్గొన్నారు.
పకడ్బందీగా చర్యలు
ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని 66 మండలాల్లో త్వరలో ఉపాధ్యాయుల బదిలీలు, ఉద్యోగోన్నతులు నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియను అత్యంత పకడ్బందీగా నిర్వహించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రక్రియ ఉమ్మడి చిత్తూరు పరిధిలో నిర్వహించనుండడంతో చిత్తూరు విద్యాశాఖ అధికారులు, సిబ్బంది నిద్ర లేని రాత్రులు గడుపుతూ కసరత్తు చేపడుతున్నారు. ఈ ప్రక్రియలో ఏ ఒక్క పోస్టును బ్లాక్ చేయకుండా కసరత్తు నిర్వహిస్తున్నారు. గత నాలుగు నెలలుగా నిర్వహిస్తున్న టీచర్ల సీనియారిటీ, ఖాళీల ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఈ ప్రక్రియలో కీలక ఘట్టం ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో నిర్ధిష్టమైన ఖాళీలు (క్లియర్ వేకెన్సీలు) చూపే ప్రక్రియను చేపట్టారు. ఈ ప్రక్రియను చిత్తూరు డీఈఓ వరలక్ష్మి, తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్, డీఈఓ కార్యాలయ ఏడీ వెంకటేశ్వరరావు, డీవైఈఓలు ఇందిర, బాలాజీ, లోకేశ్వరరెడ్డి, 66 మండలాల ఎంఈఓలు, పర్యవేక్షించారు.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న టీచర్ల వివరాలు
ప్రభుత్వ యాజమాన్యంలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు 598
మండల పరిషత్, జెడ్పీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న టీచర్లు 13,969
నగరపాలక కార్పొరేషన్ పరిధిలో: 454
మున్సిపాలిటీ పరిధిలో: 433
మొత్తం విధులు నిర్వహిస్తున్న టీచర్లు: 15,454
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉండాల్సిన టీచర్ల పోస్టుల వివరాలు
ప్రభుత్వ యాజమాన్య పరిధిలోని మంజూరు పోస్టులు 723
మండల పరిషత్, జిల్లా పరిషత్ పరిధిలో మంజూరు పోస్టులు 15,552
నగరపాలక కార్పొరేషన్ మంజూరు పోస్టులు 589
మున్సిపాలిటీ పోస్టులు 508
మొత్తం పోస్టులు 17,372
ఈ ఏడాది ఏప్రిల్ నాటికి ఖాళీల వివరాలు
ప్రభుత్వ యాజమాన్యంలో ఖాళీలు 125
ఎంపీపీ, జెడ్పీ పరిధిలోని ఖాళీలు 1583
నగరపాలక కార్పొరేషన్‌లోని ఖాళీలు 135
మున్సిపాలిటీ పరిధిలోని ఖాళీలు 75
మొత్తం ఖాళీలు 1,918
6 వేల ఖాళీలు చూపే అవకాశం
చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల వ్యాప్తంగా ప్రస్తుతం 1,918 ఖాళీలున్నాయి. అయితే ప్రస్తుతం నిర్వహిస్తున్న ప్రక్రియలో 6 వేల వరకు ఖాళీలు చూపించే అవకాశం ఉన్నట్లు విద్యాశాఖ అధికారుల వెల్లడిస్తున్నారు. అలాగే ఉద్యోగోన్నతులు, మిగిలిన ఖాళీలకు తాజాగా నిర్వహించే డీఎస్సీలో వచ్చే టీచర్లను భర్తీ చేసేందుకు కసరత్తు చేపడుతున్నారు. క్లియర్ వేకెన్సీల వివరాల ఆధారంగా మొదట్లో బదిలీ ప్రక్రియ నిర్వహిస్తారు. ఆ తర్వాత 1:2 విధానంలో ఉద్యోగోన్నతుల జాబితా విడుదల చేయనున్నారు.
తప్పులు దొర్లకుండా.. నష్టం కలగకుండా


