బాబు పాలన అధ్వాన్నం
● కుప్పం ద్రవిడ వర్సిటీలో ఏడాదిగా జీతాలు ఇవ్వలేదు ● టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై బాబు స్పందించాలి ● కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ డిమాండ్
తిరుపతి కల్చరల్: రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పరిపాలన బాగా లేదని, ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలో ఏడాదిగా జీతాలు ఇవ్వలేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ చింతామోహన్ విమర్శించారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి ఆయన టీటీడీ పరిపాలన భవనం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదిగా టీటీడీ పరిపాలన భవనం వద్ద కాంగ్రెస్ ఆధ్వర్యంలో 30 సార్లుకు పైగా ఆందోళనలు చేపట్టామన్నారు. టీటీడీలో పని చేసే అర్చకులు, శాశ్వత ఉద్యోగులు, వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అలిపిరి నుంచి పేరూరు వరకు 400 ఎకరాలు టీటీడీ భూములున్నాయని, ఆ భూముల్లో ఒక్కొక్కరికి ఐదు సెంట్లు ఇంటి స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు తిరుమల కొండకు ఎన్నోసార్లు వచ్చి వెళ్లారని, అయితే కొండపై సుమారు 500 దుకాణాలున్నా వాటిలో ఒక్కరైనా ఎస్సీ, ఎస్టీ ఉన్నారా? అని ప్రశ్నించారు. జనాభా నిష్పత్తి ప్రకారం 500 దుకాణాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాలపై చంద్రబాబు వెంటనే స్పందించి న్యాయం చేయాలన్నారు. అలాగే టీటీడీలో పనిచేసే ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ద్రవిడ వర్సిటీలో పనిచేసే ఉద్యోగులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని, ఎస్వీయూలో ప్రొఫెసర్లకు కూడా మూడు నెలలుగా జీతాలు అందలేదన్నారు. ఉద్యోగులకు నెల నెలా సక్రమంగా జీతాలు ఇవ్వలేని స్థితిలో కూటమి ప్రభుత్వం ఉందన్నారు. శ్రీసిటీని కాంగ్రెస్ పార్టీ తెచ్చిందని, 250 కంపెనీలు ఏర్పాటు చేశామని, వేల మందికి ఉద్యోగాలు తామే ఇచ్చామని తెలిపారు. నిన్న ఒక మంత్రి శ్రీసిటీకి వచ్చి వెళ్లారని, ఆయన పర్యటన గురించి ఢంకా బజాయించుకుంటూ పేపర్లో గొప్పగా కథనాలు రాయించుకున్నాడని ఎద్దేవా చేశా రు. కాంగ్రెస్ హయాంలో తిరుపతి జిల్లా కలెక్టరేట్ ఎదురుగా ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చామని, ఇందిరమ్మ ఇళ్లకు పసుపు రంగు వేయించడం దౌర్భాగ్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు యార్లపల్లి గోపి, వెంకటేష్, ముని శోభ, తేజోవతి, కుమార్, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.


